ఛీ..యాక్! 8 బతికున్న కప్పలను అమాంతం మింగేసిన మహిళ.. ఆ తర్వాత సీన్ ఇదే
ఎంతో కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్న ఓ వృద్ధురాలు నాటు వైద్యుడి దగ్గరికి వెళ్లింది. అతడు బతికున్న కప్పలను మింగితే నడుం నొప్పి తగ్గుందని చెప్పాడు. అంతే.. వెంటనే కప్పలను పట్టి బతికుండగానే అమాంతం వాటిని గొంతులో వేసి గుట్టుక్కుమనిపించింది. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాకవుతారు..

ఓ వృద్ధురాలు నడుం నొప్పి తగ్గుతుందనీ.. నాటు వైద్యాన్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 కప్పలను పట్టి అమాంతం గొంతులో వేసుకుని గుటుక్కున మింగేసింది. నడుం నొప్పి తగ్గడం అటుంచితే.. కాసేపటికే కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం..
తూర్పు చైనాకు చెందిన జాంగ్ (82) అనే వృద్ధురాలు చాలా కాలంగా హెర్నియేటెడ్ డిస్క్‌తో బాధపడుతుంది. బతికి ఉన్న కప్పలను మింగితే వెన్నునొప్పి తగ్గుతుందని స్థానిక నాటు వైద్యులు చెప్పారు. అంతే.. అసలు విషయం చెప్పకుండా తనకు బతికున్న కప్పలను తెచ్చిపెట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపింది. అవి పెద్దవారి అరచేతికంటే కాస్త చిన్నగా ఉండాలని జాగ్రత్తలు కూడా చెప్పింది. కుటుంబ సభ్యులు కప్పలను పట్టి తీసుకువచ్చారు. దీంతో ఆమె గత సెప్టెంబర్ మొదటి వారంలో వాటిని శుభ్రం చేయకుండా, కనీసం వేడి నీళ్లలో ఉడకబెట్టకుండా బతికుండగానే మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పల చొప్పున మింగేసింది. ఉడికించకుండానే వాటిని సజీవంగా మింగేసింది. దీంతో కాసేపటికే ఆమెకు నడుంనొప్పి తగ్గకపోగా.. తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులను పిలిచి కప్పలను మింగిన సంగతి వెల్లడించింది. దీంతో వారు హుటాహుటీన హాంగ్జౌలోని జెజియాంగ్ యూనివర్సిటీ ఫస్ట్ అఫిలియేటెడ్ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కప్పలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా కప్పలలో సాధారణంగా ఉండే టేప్‌వార్మ్ లార్వా అనే స్పార్గనమ్‌తో పాటు, ఇతర బ్యాక్టీరియా ఆమె కడుపులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సజీవ కప్పలను మింగడంతో ఆమె జీర్ణవ్యవస్థలో ఇన్‌ఫెక్షన్ సోకి దెబ్బతింది. ఆమె శరీరంలోకి పరాన్నజీవులు చేరినట్లు వైద్యులు తెలిపారు. రెండు వారాలపాటు చికిత్స పొందిన తర్వాత జాంగ్ డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ఏదైనా అనారోగ్యం ఉంటే వెంటనే ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలని సూచించారు. అంతేగానీ అవగాహనలేకుండా ఇటువంటి నాటు వైద్యాలను అనుసరిస్తే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన మాదిరి అవుతుందని వైద్యులు హెచ్చరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




