AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యూస్ అనుకుని యాసిడ్ తాగిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

సేలం జిల్లా అష్టంపట్టిలో తీరని విషాదం నెలకొంది. పుట్టింటికి వచ్చిన 31 ఏళ్ల దివ్య భారతి పండ్ల రసం అనుకుని ఇంట్లో ఉన్న యాసిడ్ తాగేసింది. తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆమె, మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అజాగ్రత్త ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలేం జరిగిందంటే..?

జ్యూస్ అనుకుని యాసిడ్ తాగిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Woman Dies After Drinking Acid Accidentally
Krishna S
|

Updated on: Mar 20, 2026 | 10:19 AM

Share

ఒక చిన్న అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కళ్లముందే ఆడుకుంటున్న ఇద్దరు బిడ్డలను అనాథలను చేసింది. తమిళనాడులోని సేలం జిల్లా అష్టంపట్టి ప్రాంతంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పండ్ల రసం అనుకుని పొరపాటున క్లీనింగ్ యాసిడ్ తాగడంతో 31 ఏళ్ల దివ్య భారతి ప్రాణాలు కోల్పోయారు. అష్టంపట్టి పిళ్ళయార్ నగర్‌కు చెందిన సెంథిల్ భార్య దివ్య భారతి. సెంథిల్ తిరుప్పూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా దివ్య భారతి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పుట్టింటిలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇల్లు శుభ్రం చేయడం కోసం ఆమె తల్లిదండ్రులు వంటగదిలో ఒక సీసాలో యాసిడ్‌ను భద్రపరిచారు. దురదృష్టవశాత్తూ, ఆ సీసాలో ఉన్నది పండ్ల రసం అని దివ్య భారతి పొరబడింది. ఏమరపాటుతో ఆ యాసిడ్‌ను తాగేయడంతో కొద్దిసేపటికే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. పరిస్థితి విషమించడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోరాడి ఓడిన ప్రాణం

ఆసుపత్రిలో చేరిన దివ్య భారతికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, యాసిడ్ ప్రభావం శరీర అంతర్గత అవయవాలపై తీవ్రంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ వార్త విన్న భర్త సెంథిల్, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు చిన్న పిల్లలు తల్లి కోసం ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. మృతిపై సమాచారం అందుకున్న అష్టంపట్టి పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త సెంథిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

మీ ఇంట్లో ఇలాంటి పొరపాట్లు జరగనివ్వకండి

ఈ ఘటన ప్రతి ఇంటికి ఒక హెచ్చరిక. నిత్యావసర వస్తువులతో పాటు ఇంట్లో వాడే రసాయనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాసిడ్, ఫినాయిల్ వంటి ప్రమాదకర ద్రవాలను పండ్ల రసం లేదా కూల్ డ్రింక్ సీసాలలో పోసి ఉంచకండి. ఒకవేళ ఉంచినా, వాటిపై పెద్ద అక్షరాలతో ప్రమాదం అని రాసి ఉంచండి. క్లీనింగ్ రసాయనాలను వంటగదిలో కాకుండా పిల్లలకు, ఇతరులకు అందనంత ఎత్తులో లేదా విడిగా ఉండే స్టోర్ రూమ్‌లలో భద్రపరచండి.

Follow Us