AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-UK FTA: గుడ్‌న్యూస్.. అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. భారీగా తగ్గనున్న వాటి ధరలు!

India-UK Trade Agreement : దేశ ప్రజలకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నేటి నుంచే భారత్ - యూకే మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యంగా కుదిరిన ఈ ఒప్పందం.. వ్యాపార, ఉపాధి రంగాల్లో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఈ ఒప్పందంతో చాలా వరకు వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

India-UK FTA: గుడ్‌న్యూస్.. అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. భారీగా తగ్గనున్న వాటి ధరలు!
India Uk Free Trade Agreement
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 8:51 AM

Share

భారత్ – యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దేశాల మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.. ప్రస్తుతం 56 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఈ ఒప్పందం కింద భారత్ తన ఎగుమతుల్లో 99శాతం వాటాను యూకే మార్కెట్‌కు సుంకం లేని పద్ధతిలో అందించనుంది.ఈ ఒప్పందం ద్వారా ఉపాధి కల్పన, ఎంఎస్‌ఎంఈ రంగాల బలోపేతం, ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ మరింత బలంగా స్థిరపడటానికి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలకంగా మారనుంది.

భారీగా తగ్గనున్న ఫారిన్ స్కాచ్ విస్కీ,లగ్జరీ కార్ల ధరలు

ఈ ఒప్పందం వల్ల బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే పలు లగ్జరీ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి .విస్కీపై దిగుమతి సుంకం 150 శాతం నుంచి వెంటనే 75 శాతానికి తగ్గింది. రాబోయే 10 ఏళ్లలో ఇది క్రమంగా 40 శాతానికి పడిపోనుంది.. ల్యాండ్ రోవర్, జాగ్వార్, రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్టిన్ వంటి ప్రీమియం కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కస్టమ్స్ సుంకాన్ని 110 శాతంనుంచి దశలవారీగా 10 శాతానికి తగ్గిస్తారు. చాక్లెట్లు, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, కాస్మెటిక్స్ వంటి బ్రిటిష్ ఉత్పత్తులు కూడా భారత్‌లో చౌకగా లభించనున్నాయి.

భారతీయ రంగానికి కలిగే ప్రయోజనాలు

భారత్ యుకె వాణిజ్య ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి యూకేకి ఎగుమతి అయ్యే 99 శాతం వస్తువులపై సున్నా సుంకం వర్తిస్తుంది. దీనివల్ల అనేక రంగాలు లాభపడనున్నాయి. దుస్తులు , చర్మపు ఉత్పత్తులకు యూకే మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించడంతో మన ఎగుమతులు పెరగనున్నాయి. గతంలో ఉన్న 12 శాతం దిగుమతి సుంకం రద్దు కావడం వల్ల బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ వంటి దేశాలతో పోటీ పడే సామర్థ్యం భారత్‌కు పెరిగింది.లెదర్ ఉత్పత్తులపై యూకేలో ఉన్న 16 సుంకాన్ని తొలగించడం వల్ల ఉత్తరప్రదేశ్, తమిళనాడులోని తయారీదారులకు మేలు జరుగుతుంది.యూకే అతిపెద్ద ఔషధ దిగుమతిదారు కావడంతో, భారతీయ జనరిక్ మందులకు సున్నా సుంకం లభించడం వల్ల రంగానికి పెద్ద ఊతం లభించనుంది.

జనరిక్ మందులకు యూకేలో భారీ డిమాండ్ పెరగనుంది. టీ, మామిడి, సుగంధ ద్రవ్యాలు , సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు పెరగనున్నాయి. ​ఈ ఒప్పందం కేవలం వస్తువులకే పరిమితం కాకుండా, సేవల రంగంలో అపూర్వమైన అవకాశాలను కల్పిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు ఇతర నిపుణులకు యూకేలో పని చేయడం సులభతరం కానుంది.137 సబ్-సెక్టార్లలో భారతీయ కంపెనీలకు యూకేలో వ్యాపార విస్తరణకు వీలు కల్పించబడింది. ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్సల్టెన్సీ రంగాల్లో పనిచేసే నిపుణులకు వీసా నిబంధనలు సరళతరం చేయబడ్డాయి. ఏటా 1,800 మంది భారతీయ చెఫ్‌లు, యోగా శిక్షకులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులకు ప్రత్యేక వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం జరిగింది.

ఈ ఒప్పందంలోని కీలక అంశం డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC). దీనివల్ల యూకేలో పనిచేసే భారతీయ నిపుణులు, అక్కడి నేషనల్ ఇన్సూరెన్స్‌తో పాటు భారత్‌లో పీఎఫ్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన వల్ల ఐదేళ్ల పాటు సామాజిక భద్రత రుసుముల నుంచి మినహాయింపు లభించి, వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

వీటికి మినహాయింపు !

యూకెతో వాణిజ్య ఒప్పందం ద్వారా భారత ప్రభుత్వం తన దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది.. దేశీయ రంగాన్ని కాపాడుకునేందుకు పాడి పరిశ్రమ, తృణధాన్యాలు, వంట నూనెలు, ఆపిల్స్, బంగారం, జ్యువెలరీ, స్మార్ట్‌ఫోన్ల వంటి సున్నితమైన రంగాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించింది.ఈ ఒప్పందం భారత్ యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే కాలంలో రెట్టింపు చేయడమే కాకుండా, లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us