AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌కు డెడ్‌లైన్.. 78 ఏళ్ల అబద్ధాలు బద్దలు.. ప్రజా తిరుగుబాటుతో దద్దరిల్లుతున్న పీవోకే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనలు మంగళవారం (జూలై 14) నాటికి 36వ రోజుకు చేరుకోగా, పీఓకే వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముజఫరాబాద్ లాంగ్ మార్చ్‌కు కేవలం 24 గంటల ముందు సుధనోటి, రావల్కోట్ ప్రాంతాలలో నిరసనకారులపై పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పాకిస్తాన్‌కు డెడ్‌లైన్.. 78 ఏళ్ల అబద్ధాలు బద్దలు.. ప్రజా తిరుగుబాటుతో దద్దరిల్లుతున్న పీవోకే!
Anti Pakistan Protest
Balaraju Goud
|

Updated on: Jul 14, 2026 | 11:31 PM

Share

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనలు మంగళవారం (జూలై 14) నాటికి 36వ రోజుకు చేరుకోగా, పీఓకే వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముజఫరాబాద్ లాంగ్ మార్చ్‌కు కేవలం 24 గంటల ముందు సుధనోటి, రావల్కోట్ ప్రాంతాలలో నిరసనకారులపై పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దమనకాండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు, రావల్కోట్‌లోని ఈద్గా మైదానాన్ని పాక్ బలగాలు ఆక్రమించుకున్నాయని మండిపడ్డారు.

ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రముఖ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్, రావల్కోట్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో వేదికపై నుండి పాకిస్తాన్ పాలకుల అసలు రంగును బయటపెట్టారు. ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ ప్రకారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కేవలం ఒక వివాదాస్పద భూభాగం మాత్రమేనని, కానీ వాస్తవానికి అది పాకిస్తాన్ చేతిలో ఉన్న ఒక ఆక్రమిత ప్రాంతమని ఆయన బాహాటంగా ప్రకటించారు. గత 78 ఏళ్లుగా పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలను, కాశ్మీరీలను భ్రమల్లో ఉంచిన వాదనలను అమన్ ఖాన్ తన ప్రసంగంతో బద్దలు కొట్టారు.

భారీగా తరలి వచ్చిన మహిళలు

సుమారు 70,000 మందికి పైగా హాజరైన ఈ భారీ బహిరంగ సభలో, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం భారీగా కనిపించింది. ఈ సందర్భంగా అమన్ ఖాన్ మాట్లాడుతూ.. “పీఓకే భవిష్యత్తును నిర్ణయించే సర్వాధికారాలు కేవలం ఇక్కడి ప్రజలకు మాత్రమే ఉన్నాయి” అని స్పష్టం చేశారు. అంతేకాదు, గత ఎనిమిది దశాబ్దాలుగా పీఓకే విద్యాసంస్థల్లో పాకిస్తాన్ పట్ల కృత్రిమ ప్రేమను నూరిపోస్తున్నారని, వేసవిలో పర్వతాలు వేడిగా, శీతాకాలంలో చల్లగా ఉంటాయనే భౌగోళిక సత్యం తప్ప, పీఓకే పాఠశాలల్లో బోధించే ప్రతి ఒక్కటి అబద్ధమేనని అక్కడి విద్యార్థులకు పిలుపునిచ్చారు.

చలో ముజఫరాబాద్

బుధవారం (జూలై 15) జరగబోయే చలో ముజఫరాబాద్ కార్యక్రమం కోసం పూంచ్ డివిజన్‌కు చెందిన ప్రజలు ఇప్పటికే రావల్కోట్‌కు భారీగా చేరుకుంటున్నారు. ఈ అంతిమ పోరాటంపై మాట్లాడిన అమన్ ఖాన్, తమకు విజయం లభించే వరకు ఈ యుద్ధం ఆగేది లేదని తేల్చి చెప్పారు. జూలై 27న జరగనున్న పీఓకే అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ, ఐఎస్ఐ (ISI) సెక్టార్ కమాండర్ బ్రిగేడియర్ ఫైక్ కార్యాలయం చుట్టూ ఫైళ్లతో తిరిగే రోజులు పోయాయన్నారు. ఈ ఎన్నికలను ఐఎస్ఐ నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రజలే స్వయంగా ఓటు వేసి, తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

పీఓకేలోని పాకిస్తాన్ కీలుబొమ్మ ప్రభుత్వానికి నిరసన నేతలు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జూలై 15న ముజఫరాబాద్ వైపు సాగే పాదయాత్ర కేవలం 38 డిమాండ్ల కోసమో లేదా పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ల రద్దు కోసమో కాదని, కేవలం ఒకే ఒక్క ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతుందని మరో కో-ఆర్డినేటర్ ఉమర్ నజీర్ స్పష్టం చేశారు. “పీఓకే నియంత్రణను, బాధ్యతను పూర్తిగా అక్కడి ప్రజలకే అప్పగించాలి” అనే ఏకైక డిమాండ్‌తో ఈ మార్చ్ జరుగుతోందని, తద్వారా పీఓకే స్వాతంత్ర్య కాంక్షను వారు ప్రపంచానికి చాటిచెప్పారు. పాక్ సైనిక బలగాల అణిచివేతను ఎదిరిస్తూ సాగుతున్న ఈ పోరాటం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us