EPFO: ఉద్యోగాలు చేసేవారికి కేంద్రం బ్యాడ్‌న్యూస్.. రూ.25 వేలకు పెంపుపై బిగ్ అనౌన్స్‌మెంట్..
ఈపీఎఫ్ఓ బేసిక్ శాలరీ లిమిట్ ప్రస్తుతం రూ.15 వేలుగా ఉంది. అయితే దీనిని రూ.25 వేలకు పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. దీని వల్ల ఎక్కువమంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎఫ్ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే దీనిపై కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది.

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. పీఎఫ్ కనీస వేతన పరిమితి పెంపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. కనీస వేతన పరిమితి ప్రస్తుతం రూ.15 వేలు ఉండగా.. దీనిని రూ.25 వేలకు పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్రం దీనిపై చర్చలు జరుపుతుందని, త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది. దీంతో కేంద్రం స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి కనీస ప్రాథమిక వేతన పరిమితిని పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో గత కొద్దికాలంగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడిటన్లయింది. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ రూ.15 వేలలోపు ఉన్నవారు ఖచ్చితంగా పీఎఫ్ పరిధిలో చేరాలి. దీని వల్ల అంతకంటే ఎక్కువ జీతం ఉన్నవారు పీఎఫ్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
లిమిట్ పెంచాలని కార్మికుల నుంచి డిమాండ్లు
ప్రస్తుతం బేసిక్ శాలరీ లిమిట్ రూ.15 వేలు మాత్రమే ఉంది. దీంతో రూ.15వేలలోపు శాలరీ ఉన్నవారు ఖచ్చితంగా పీఎఫ్‌లో చేరాలి. అంతకంటే ఎక్కువ జీతం తీసుకునేవారు స్వచ్చంధంగా చేరవచ్చు. కంపెనీ, ఉద్యోగి మధ్య ఒప్పందంతో స్వచ్చంధంగా చేరాల్సి ఉంటుంది. దీంతో రూ.15 వేలపైన జీతం తీసుకునేవారికి పీఎఫ్ ప్రయోజనాలు లభించడం లేదు. దీంతో బేసిక్ శాలరీ లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీని వల్ల ఎక్కువమంది ఉద్యోగులు పీఎఫ్ ప్రయోజనాలు పొందుతారని కార్మికులు చెబుతున్నారు. చివరిగా 2014లో పీఎఫ్ పరిమితిని రూ.6500 నుంచి రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో పోలిస్తే ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. దీంతో ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మార్పులు చేయాలని కార్మికులు కోరుతున్నారు.
కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గుతుంది..?
పీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్‌ను రూ.25 వేలకు పెంచడం వల్ల కేంద్రంపై అదనపు భారం పడుతుంది. రూ.25 వేలకు పెంచితే ఈపీఎస్ పరిధిలోకి వచ్చే సబ్సిడీ కోసం కేంద్రం ప్రతీ ఏటా అదనంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ఖజానాపై అదనపు భారం మోపే అవకాశముంటుంది. ఇదే కాకుండా లిమిట్ పెంచితే కంపెనీలు కూడా తాము చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ పెంచాల్సి ఉంటుంది. ఇది కంపెనీలకు కూడా భారంగా మారుతుంది. ఇక ఉద్యోగులకు కూడా ఇన్ హ్యాండ్ శాలరీ తగ్గుతుంది. దీని వల్ల తక్షణ ఖర్చులకు ఇబ్బందిగా మారే అవకాశముంటుంది. ఈ కారణాలతో కేంద్రం ముందడుగు వేయడం లేదని తెలుస్తోంది.
