AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE 10వ తరగతి బోర్డు ఫలితాల కోసం పడిగాపులు.. 50 రోజులైనా పత్తాలేని రిజల్ట్స్! నెట్టింట పేలుతున్న జోకులు

సీబీఎస్‌ఈ 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. మే 21న పరీక్షలు ముగిసి దాదాపు 50 రోజులు గడిచినా ఫలితాల విడుదల తేదీపై సీబీఎస్‌ఈ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 11వ తరగతి అడ్మిషన్లు, స్ట్రీమ్ మార్పులు, తదుపరి విద్యా ప్రణాళికల విషయంలో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఫలితాల జాప్యంపై పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బోర్డు నుంచి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు..

CBSE 10వ తరగతి బోర్డు ఫలితాల కోసం పడిగాపులు.. 50 రోజులైనా పత్తాలేని రిజల్ట్స్! నెట్టింట పేలుతున్న జోకులు
CBSE 10th Class Second Board Result Date
Srilakshmi C
|

Updated on: Jul 15, 2026 | 7:36 AM

Share

హైదరాబాద్‌, జులై 15: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. మే 21న పరీక్షలు ముగిశాయి. దాదాపు 50 రోజులు గడిచినా ఫలితాల విడుదల తేదీపై సీబీఎస్‌ఈ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియలు ఇప్పటికే అనేక విద్యాసంస్థల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఫలితాలు విడుదల కాకపోవడంతో 11వ తరగతిలో ప్రవేశాలు, స్ట్రీమ్ మార్పులు వంటి అంశాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సీబీఎస్‌ఈ తాజా పోస్టుల కింద విద్యార్థులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఫలితాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు మీమ్స్, సరదా పోస్టులతో తమ నిరీక్షణను వ్యక్తపరుస్తుండగా, మరికొందరు బోర్డు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక విద్యార్థి స్పందిస్తూ.. ‘పరీక్షలు ముగిసి 50 రోజులు అవుతోంది. స్ట్రీమ్ మార్పు కోరుకునే విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరైన వారు 10వ తరగతి సిలబస్ చదవాలా? లేక 11వ తరగతి పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. మరో విద్యార్థి ‘ఫలితాల ప్రకటన సీబీఎస్‌ఈ ప్రాధాన్యతల జాబితాలో లేదేమో అనిపిస్తోంది. ప్రతిరోజూ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. కానీ వస్తోంది మాత్రం నిశ్శబ్దమే’అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు ‘సీబీఎస్‌ఈ ఫలితాలు పొందడం ప్రస్తుతం ఒక ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినంత కష్టంగా మారింది. పరీక్ష ఒకరోజే జరిగినా, ఫలితాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది’అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది సీబీఎస్‌ఈ అమలు చేసిన సవరించిన పరీక్షా విధానంలో భాగంగా రెండో బోర్డు పరీక్షలను నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం నెట్టింట కొందరు జోకులు పేలుస్తుంటే.. మరికొందరు ఇంకెంత కాలం ఎదురు చూడాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 11వ తరగతిలో స్ట్రీమ్స్‌ మార్చుకోవాలనుకునే విద్యార్థులు ఆ ప్రక్రియను పూర్తి చేసుకోలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. సీబీఎస్సీ సెకండ్‌ బోర్డ్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై సీబీఎస్‌ఈ నుంచి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.

Follow Us