భారత్ జాబ్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా Google టాప్!
భారతీయ ఉద్యోగార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. కేవలం అధిక జీతాలు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా.. పని-జీవిత సమతుల్యత, కెరీర్ వృద్ధి అవకాశాలు, సమానత్వం, నమ్మకమైన పని సంస్కృతి వంటి అంశాలకు ఉద్యోగులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మారుతున్న ధోరణుల్లో గూగుల్ భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన యజమానిగా (Best Employer India 2026) అగ్రస్థానంలో నిలిచింది..

రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2026 నివేదిక ప్రకారం.. గూగుల్ తర్వాత టాటా గ్రూప్ రెండో స్థానంలో, అమెజాన్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో టెక్నాలజీ, తయారీ, సేవా రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 34 మార్కెట్లలో 17 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. భారత్‌లో సుమారు 3,500 మంది ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. భారతదేశంలో ఇది 16వ రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ కాగా, ప్రపంచవ్యాప్తంగా 26వ అధ్యయనం. ఉద్యోగులు ఇప్పుడు కంపెనీలను ఎంపిక చేసేటప్పుడు కేవలం జీతాలను మాత్రమే కాకుండా.. మెరుగైన పని వాతావరణం, కెరీర్ అభివృద్ధి అవకాశాలు, ఉద్యోగ భద్రత, సమ్మిళిత సంస్కృతి, సౌకర్యవంతమైన పని విధానాలు వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారని నివేదిక వెల్లడించింది.
భారతదేశంలోని టాప్ 10 ఉద్యోగదాతలు
రాండ్‌స్టాడ్ నివేదిక ప్రకారం భారత్‌లోని అత్యంత ఆకర్షణీయమైన యజమానుల జాబితా ఇదే..
- గూగుల్
- టాటా గ్రూప్
- అమెజాన్
- శాంసంగ్ ఇండియా
- ఇన్ఫోసిస్
- రిలయన్స్ ఇండస్ట్రీస్
- ఐటీసీ గ్రూప్
- హిందుస్థాన్ యూనిలివర్
- మహీంద్రా & మహీంద్రా
- డెల్ టెక్నాలజీస్
ఈ టాప్ 10 కంపెనీల్లో ఐదు భారతీయ సంస్థలు ఉండటం విశేషం. దేశీయ కంపెనీలు కూడా ఉద్యోగులకు మెరుగైన పని సంస్కృతిని అందించడంలో ముందుకు వస్తున్నాయని ఇది సూచిస్తోంది.
ఉద్యోగులు ఎందుకు కంపెనీలు మారుతున్నారు?
సర్వే ప్రకారం భారతీయ ఉద్యోగులు ఉద్యోగాలు మారడానికి ప్రధాన కారణం పని-జీవిత సమతుల్యత లేకపోవడం. దాదాపు 49 శాతం మంది ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సరిగా లేకపోతే ఉద్యోగం మార్చే అవకాశం ఉందని తెలిపారు. 42 శాతం మంది కెరీర్ వృద్ధి అవకాశాలు లేకపోవడాన్ని కారణంగా చెప్పారు. 41 శాతం మంది తక్కువ జీతం, ప్రయోజనాలను ఉద్యోగ మార్పుకు కారణాలుగా పేర్కొన్నారు. మిలీనియల్స్‌లో కెరీర్ ఎదుగుదలపై ఆసక్తి ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. మెరుగైన అవకాశాలు లభించకపోతే ఉద్యోగం మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని 43 శాతం మిలీనియల్స్ పేర్కొన్నారు.
మంచి కంపెనీకి జీతం మాత్రమే ప్రమాణం కాదు
రాండ్‌స్టాడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ.. 2020 తర్వాత ఉద్యోగుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. ఉద్యోగులు ఇప్పుడు కంపెనీని కేవలం జీతాలు, ప్రయోజనాల ఆధారంగా కాకుండా మొత్తం పని అనుభవం ఆధారంగా అంచనా వేస్తున్నారని చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో దాదాపు సగం మంది ఉద్యోగులు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే సంస్థలు కేవలం వేతనాల పెంపుపై కాకుండా ఉద్యోగుల సంతృప్తి, రోజువారీ పని అనుభవంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ రంగంలో పనిచేస్తున్న కొత్త తరం ఉద్యోగులు ఇతర ఉద్యోగులతో పోలిస్తే భిన్నమైన ప్రాధాన్యతలను కలిగి ఉన్నారని నివేదిక వెల్లడించింది. 73 శాతం మంది డిజిటల్ నిపుణులు మంచి జీతాన్ని ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. 55 శాతం మంది డిజిటల్ ఉద్యోగులు కెరీర్ పురోగతికి అవకాశాలు లేకపోతే ఉద్యోగం మారతామని తెలిపారు. కొత్త తరం ఉద్యోగులు జీతంతో పాటు వేగవంతమైన కెరీర్ వృద్ధి, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు, మంచి పని సంస్కృతిని కోరుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం జీతాలు మాత్రమే కాదు. ఉద్యోగుల అనుభవం, అభివృద్ధి అవకాశాలు, సమతుల్యమైన పని వాతావరణం కూడా కీలకంగా మారాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో గూగుల్, టాటా గ్రూప్, అమెజాన్ వంటి సంస్థలు ఉద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంటూ అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.




