AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI దెబ్బకు అమెరికాలో పెరగనున్న నిరుద్యోగం.. నోబెల్ ఆర్థికవేత్త హెచ్చరిక

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. ఒకప్పుడు మనుషులు గంటల తరబడి చేసే పనులను ఇప్పుడు AI కొన్ని నిమిషాల్లో పూర్తి చేస్తోంది. దీంతో ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. ఇదే అంశంపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారన్ అసెమోగ్లు చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా ప్రస్తుతం కొనసాగుతున్న AI మార్గాన్నే అనుసరిస్తే.. వచ్చే పదేళ్లలో అక్కడ నిరుద్యోగం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

AI దెబ్బకు అమెరికాలో పెరగనున్న నిరుద్యోగం.. నోబెల్ ఆర్థికవేత్త హెచ్చరిక
Unemployment May Triple In Us Warns Economist Daron Acemoglu
Sharada V
|

Updated on: Oct 06, 2026 | 5:26 AM

Share

AI మార్పులో వేగం గురించి CBS న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డారెన్ అసెమోగ్లు ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం తొలి దశలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి దాదాపు 80 ఏళ్లు పట్టాయనీ కానీ ఇప్పుడు AI కారణంగా ఇలాంటి మార్పులు ఒకటి లేదా రెండేళ్లలోనే జరుగుతున్నాయని చెప్పారు. ‘AIతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఆటోమేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. AI రంగంలో కొత్త ఉద్యోగాలు ఏర్పడుతున్నా అవి కోల్పోయే ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ. భాషా నమూనాలకు శిక్షణ ఇచ్చే కొత్త AI ఉద్యోగాల్లో కొంత మందిని కంపెనీలు నియమిస్తున్నాయి. కానీ AI కారణంగా భర్తీ అయ్యే ఉద్యోగాల సంఖ్యతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ’ అన్నారు. మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయించడం వల్ల కంపెనీలకు తక్కువ మంది సిబ్బందితో పని చేసే అవకాశం లభిస్తుందని అన్నారు.

అమెరికన్లలోనూ పెరుగుతున్న భయం

AI వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన, భయం సాధారణ అమెరికన్లలోనూ పెరుగుతున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. అమెరికాలో దాదాపు నాలుగింట మూడు వంతుల మంది AI తమ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్లు Pew Research అధ్యయనంలో తెలిసింది.   AI కారణంగా 2035 నాటికి సుమారు 1.1 కోట్ల మంది అమెరికన్ ఉద్యోగులు కొత్త వృత్తుల్లోకి మారాల్సిన పరిస్థితి రావచ్చని మెకిన్సీ గ్లోబల్ అంచనా వేసింది.

‘ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు’

Salesforce, Meta  సంస్థల్లో AI విభాగానికి నాయకత్వం వహిస్తున్న క్లారా షిహ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. AI ప్రభావం ఒక ఉద్యోగం పోవడంతో మాత్రమే ముగియదని ఆమె అన్నారు. ఉద్యోగం అనేది కేవలం ఆదాయానికి సంబంధించిన విషయం కాదని.. అది వ్యక్తి ఆత్మవిశ్వాసం, నమ్మకం, కుటుంబాలు, సమాజాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. గతంలో ఫ్యాక్టరీ ఉద్యోగాలు తగ్గిపోవడంతో తన కుటుంబం హాంకాంగ్ నుంచి అమెరికాలోని ఒహాయోకు రావలసి వచ్చిందని షిహ్ గుర్తుచేశారు. అప్పటి గ్లోబలైజేషన్, ఆటోమేషన్ వల్ల వచ్చిన మార్పులకు.. ఇప్పుడు వైట్‌కాలర్ ఉద్యోగాలపై AI చూపించే ప్రభావానికి కొన్ని పోలికలు ఉన్నాయని అన్నారు. AI వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రజలకు ముందుగానే స్పష్టంగా చెప్పాలని తెలిపారు. AIతో ప్రయోజనాలు అందరికీ పూర్తిగా అందేలోపు.. మధ్యలో చాలా మంది ఉద్యోగాలు, ఆదాయం కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆమె హెచ్చరించారు.

పరిష్కారం టెక్నాలజీని ఆపడం కాదు

AI విషయంలో ఉద్యోగాలను కాపాడే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు ఆర్థికవేత్త డారెన్ అసెమోగ్లు. కంపెనీలు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కాకుండా.. వారి సామర్థ్యాలను పెంచేందుకు ఉపయోగించేలా AI ని రూపొందించవచ్చని సూచించారు. ఉద్యోగులను నియమించుకునే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం పన్ను విధానాల్లో మార్పులు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. AI ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అనే దానికంటే.. ఆ మార్పు వల్ల మనుషులకు ఎలాంటి భవిష్యత్తు ఉండబోతోంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు AI ఉత్పాదకతను పెంచుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తుంటే.. మరోవైపు పాత ఉద్యోగాల్లో కొన్ని ఆటోమేషన్‌కు గురవుతున్నాయి.

Follow Us