UPSC సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో బిర్యానీపై ప్రశ్న.. టాపర్ IAS అఖిల్ బుద్ధి సమాధానం వింటే షాక్
UPSC సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అంటే కేవలం పుస్తకాల్లోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మాత్రమే కాదు.. అభ్యర్థి ఆలోచనా విధానం, సమయస్ఫూర్తి, వ్యక్తిత్వం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. తెలంగాణకు చెందిన IAS అధికారి అఖిల్ బుద్ధి తన ఇంటర్వ్యూ అనుభవాలను ‘సిగ్నేచర్ స్టూడియోస్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన ఇంటర్వ్యూలో హాబీలు, క్రికెట్, కాకతీయుల చరిత్ర వంటి అంశాలపై బోర్డు సభ్యులు ప్రశ్నలు సంధించారు..

UPSC ఇంటర్వ్యూలో IAS అఖిల్ బుద్ధి తన హాబీగా ‘క్రియేటివ్ విజువలైజేషన్’ను పేర్కొన్నారు. దీంతో బోర్డు సభ్యుడు వెంటనే దాని నిర్వచనం చెప్పమని అడిగారు. అయితే నిర్వచనం వినడానికి పెద్దగా ఆసక్తి చూపకుండా.. ‘బయట కూర్చొని ఏం విజువలైజేషన్ చేశావో చెప్పు’ అని ప్రశ్నించారు. ఆ సమయంలో అఖిల్ బోర్డు సభ్యులతో లక్నో బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ గురించి సరదాగా మాట్లాడుతున్నారని తెలిపారు. అంతేకాదు.. ‘మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను మంచి బిర్యానీ తినిపిస్తాను’ అంటూ వారిని ఆహ్వానించానని చెప్పారు. అదే సమయంలో UPSC పరీక్షలను ఎలాంటి వాయిదాలు, పేపర్ లీకులు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నానని అఖిల్ వివరించారు. దీనిపై బోర్డు సభ్యుడు తాము చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తామని చెప్పినట్లు తెలిపారు.
‘నిన్న ఏం విజువలైజ్ చేశావ్?’
ఇంటర్వ్యూలో మరోసారి తన హాబీ గురించి ప్రశ్నిస్తూ.. ‘నిన్న కూడా విజువలైజేషన్ చేసి ఉంటావు కదా.. ఏం చేశావు?’ అని బోర్డు సభ్యుడు అడిగారు. దీనికి అఖిల్ తనకు కొంత ఎమోషనల్ స్వభావం ఉందని, కొన్నిసార్లు తాను ఏడుస్తానని చెప్పారు. తాను విజువలైజేషన్ చేసుకునేటప్పుడు ‘వాళ్లు నిన్ను తిట్టినా ఏడవకూడదు అఖిల్’ అని తనకు తానే చెప్పుకుంటానని వివరించారు. ఇదే సమయంలో బోర్డులోని మరో సభ్యుడు అఖిల్ వెనుక ఉన్న రెండు కుండలను గమనించారు. ఆ కుండల్లో చెట్లు ఉండగా.. మధ్యలో ఒక రాక్షసి వంటి ఆకృతి కనిపించింది. దానిని చూపిస్తూ ‘దీన్ని ఒక్క లైన్‌లో సమ్మరైజ్ చేయి’ అని అడిగారు. కొంత ఆలోచించిన అఖిల్.. ‘Contrasting creates beauty’ అని సమాధానమిచ్చారు. దానిని వివరించమని అడగడంతో.. రెండు వైపులా ఉన్న చెట్లు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటున్నాయని, మధ్యలో ఉన్న ఆకృతి మాత్రం భయపెట్టే విధంగా ఉందని చెప్పారు. ఒకటి ప్రశాంతతను ఇస్తే.. మరొకటి భయాన్ని కలిగిస్తుందని, ఈ రెండింటి కలయికే ఆ దృశ్యానికి అందాన్ని తీసుకొచ్చిందని వివరించారు.
సచిన్ లేదా కోహ్లీ?.. అఖిల్ సమాధానం సచిన్
ఇంటర్వ్యూలో క్రికెట్‌పై కూడా బోర్డు సభ్యులు అనేక ప్రశ్నలు అడిగారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో ఎవరు గొప్ప ఆటగాడు అని ప్రశ్నించగా.. అఖిల్ సచిన్ టెండూల్కర్‌ను ఎంచుకున్నారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడే అయినప్పటికీ.. సచిన్ టెక్నిక్ తనకు సాటిలేనిదిగా అనిపిస్తుందని చెప్పారు. అక్కడితో ప్రశ్న ఆగలేదు. సచిన్, ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌లో ఎవరు గొప్ప అని అడిగారు. దీనికీ అఖిల్ సచిన్ వైపే నిలిచారు. అయితే బ్రాడ్‌మన్ ఆటను పూర్తిగా విశ్లేషించేందుకు తన వద్ద తగినంత వీడియో క్లిప్స్ లేవని నిజాయితీగా అంగీకరించారు.
భారత్ ప్రపంచకప్‌లో ఎందుకు ఓడింది?
‘ఇంతగా క్రికెట్‌ను విశ్లేషిస్తున్నావు కదా.. భారత్ ప్రపంచకప్‌లో ఎందుకు ఓడిపోయింది?’ అని బోర్డు ప్రశ్నించింది. దీనికి అఖిల్ ఇచ్చిన సమాధానం కూడా భిన్నంగా ఉంది. ‘భారత్ ఎందుకు ఓడిపోయిందన్నదానికంటే.. ఆస్ట్రేలియా ఎందుకు గెలిచిందో చర్చించాలి’ అని అన్నారు. ఫైనల్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నాడో ఆయన వివరించారు. ప్రారంభంలో భారత బౌలర్ల ఒత్తిడిని గమనిస్తూ.. పరిస్థితికి తగ్గట్టుగా ఆడాడని, ఒకసారి క్రీజులో సౌకర్యంగా స్థిరపడిన తర్వాత భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడని చెప్పారు. భారత్ జట్టులో అలాంటి ఆటగాడు, అలాంటి దృక్పథం లోపించిందని అఖిల్ అభిప్రాయపడ్డారు. ఒత్తిడిని ఎదుర్కొని, పరిస్థితులకు అనుగుణంగా దూకుడుగా ఆడే వైఖరిని మనం కూడా అలవర్చుకోవాలని సూచించారు.
‘పాకిస్థాన్ క్రికెట్‌పై మీ కామెంట్?’
ఇంటర్వ్యూలో ఒక సరదా ప్రశ్నగా పాకిస్థాన్ క్రికెట్‌పై వ్యాఖ్య చెప్పమని అడిగినప్పుడు.. అఖిల్ ఒక్క మాటలో ‘Unpredictable’ అని సమాధానమిచ్చారు. దీంతో బోర్డు సభ్యుడు నవ్వినప్పటికీ.. ఇంటర్వ్యూ మొత్తం మాత్రం గ్రిల్లింగ్ మోడ్‌లోనే సాగిందని అఖిల్ చెప్పారు. ఇంటర్వ్యూ చివర్లో తెలంగాణకు సంబంధించిన ప్రశ్న కూడా ఎదురైంది. ‘తెలంగాణలో ఒక రాజ్యం అవతరించింది, అభివృద్ధి చెందింది, చివరకు అంతరించింది. ఆ రాజ్యం పేరు ఏమిటి?’ అని మహిళా బోర్డు సభ్యురాలు ప్రశ్నించగా.. అఖిల్ కాకతీయులు అని సమాధానమిచ్చారు. అఖిల్ వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో చదివిన విషయాన్ని గమనించిన ఆ సభ్యురాలు.. కాకతీయుల గురించి మరింత వివరించమని అడిగారు. అప్పుడు అఖిల్ కాకతీయుల పాలనను అడ్మినిస్ట్రేషన్‌తో అనుసంధానిస్తూ సమాధానం ఇచ్చారు. తెలంగాణ కరువు ప్రభావిత ప్రాంతమని, వర్షాలు సక్రమంగా లేకపోవడంతో నీటి సమస్య ఉండేదని చెప్పారు. ఈ సమస్యను గుర్తించిన కాకతీయులు అందుబాటులో ఉన్న వనరులను విశ్లేషించి, ప్రాంతానికి సరిపోయే పరిష్కారాన్ని రూపొందించారని వివరించారు. అందులో భాగంగానే గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారని, ఆ నీటి నిర్వహణ విధానం ఇప్పటికీ ఉపయోగపడుతోందని చెప్పారు.
‘ఒక జిల్లాకు వెళ్లిన అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి?’
కాకతీయుల ఉదాహరణ నుంచి అఖిల్ పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఒక అడ్మినిస్ట్రేటర్ కొత్త జిల్లాకు వెళ్లినప్పుడు ముందుగా అక్కడి సమస్యలను గుర్తించాలి, అందుబాటులో ఉన్న అవకాశాలు, వనరులను అంచనా వేయాలి, ఆ ప్రాంతానికి సరిపోయే పరిష్కారాలను కనుగొనాలి అని వివరించారు. ఇతర జిల్లాలో పనిచేసిన ఒక పరిష్కారాన్ని యథాతథంగా మరో జిల్లాలో అమలు చేయడం సరైన విధానం కాదని చెప్పారు. ‘‘ఇక్కడి సమస్యకు ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగానే పరిష్కారం వెతకాలి’’ అనే ఆలోచనను ఆయన తన సమాధానంలో వ్యక్తం చేశారు.
కోట్ వేసుకోవాలా? ఇంటర్వ్యూ డ్రెస్‌పై అఖిల్ సూచనలు
ఇంటర్వ్యూకు కోట్ వేసుకుని వెళ్లాలా అనే అంశంపైనా అఖిల్ మాట్లాడారు. తాను జనవరిలో ఢిల్లీలో ఇంటర్వ్యూకు హాజరయ్యానని, ఆ సమయంలో తీవ్రమైన చలి ఉండటంతో కోట్ వేసుకున్నప్పటికీ హీటర్ దగ్గర కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే మార్చి, ఏప్రిల్ వంటి వేడి నెలల్లో ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులకు కోట్ కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చని తెలిపారు. అయినప్పటికీ దాదాపు 99.99 శాతం మంది అభ్యర్థులు కోట్ ధరించి ఇంటర్వ్యూకు హాజరవుతారని, అందరూ కోట్ వేసుకుంటుంటే తాను మాత్రమే షర్ట్‌లో వెళ్తే ఎలా ఉంటుందనే FOMO అభ్యర్థుల్లో ఉండవచ్చని అఖిల్ అభిప్రాయపడ్డారు.
అఖిల్ బుద్ధి ఇంటర్వ్యూ అనుభవం చూస్తే.. UPSC బోర్డు ప్రశ్నలకు కేవలం పుస్తకాల పరిజ్ఞానంతో సమాధానం చెప్పడం కంటే సమయస్ఫూర్తి, నిజాయితీ, తార్కిక ఆలోచన, సమతుల్యమైన అభిప్రాయం, సమస్యలకు స్థానిక పరిష్కారాలను గుర్తించే సామర్థ్యం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.




