AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Story: ఇచ్చినప్పుడే పొందగలం.. ఓ బిచ్చగాడిని కోటీశ్వరుడిగా మార్చిన కథ

మన పరిస్థితులను మార్చే శక్తి మన ఆలోచనల్లోనే ఉంటుంది. మనల్ని మనమే తక్కువగా భావిస్తే ఎదగలేం. మనలోని సామర్థ్యాన్ని గుర్తించి, ఇతరులకు విలువను అందిస్తూ ముందుకు సాగితే జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. ముందుగా మన ఆలోచనలను మార్చుకుంటే.. మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పండి..

Motivational Story: ఇచ్చినప్పుడే పొందగలం.. ఓ బిచ్చగాడిని కోటీశ్వరుడిగా మార్చిన కథ
Inspiring Story Of A Beggar
Srilakshmi C
|

Updated on: Oct 02, 2026 | 5:22 PM

Share

ఓ నగరంలోని రైల్వే స్టేషన్‌ వద్ద ఓ బిచ్చగాడు జీవించేవాడు. ప్రతిరోజూ రైళ్లలో తిరుగుతూ ప్రయాణికులను యాచించి వచ్చిన డబ్బుతో తన కడుపు నింపుకునేవాడు. తన జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన అతనికి ఎప్పుడూ రాలేదు. ఓ రోజు రైలులో సూటు, బూటు వేసుకున్న ఓ పొడవాటి వ్యక్తిని చూశాడు. అతడు బాగా ధనవంతుడిలా కనిపించడంతో తనకు మంచి డబ్బు ఇస్తాడని భావించి అతని వద్దకు వెళ్లి భిక్ష అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఓ ప్రశ్న అడిగాడు. ‘నువ్వు ఎప్పుడూ ఇతరులను అడుగుతూనే ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా?’ బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు.

‘సార్.. నేను బిచ్చగాడిని. ఇతరుల దగ్గర అడుక్కుని జీవిస్తాను. నేను ఎవరికీ ఏం ఇవ్వగలను?’ అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి ‘నువ్వు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు, నువ్వు అడిగిన ప్రతిసారీ వారు ఎందుకు ఇవ్వాలి? నేను వ్యాపారవేత్తను. లావాదేవీలను నమ్ముతాను. నువ్వు నాకు ఏదైనా ఇస్తే, దానికి ప్రతిఫలంగా నేను కూడా నీకు ఏదైనా ఇస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాటలు బిచ్చగాడి మనసులో బలంగా నాటుకున్నాయి. ‘నేను ఇతరులకు ఏమీ ఇవ్వకపోవడం వల్లేనా నాకు తక్కువ భిక్ష వస్తోంది?’ అని ఆలోచించడం మొదలుపెట్టాడు. రెండు రోజుల పాటు ఇదే విషయం గురించి ఆలోచించినా అతనికి సమాధానం దొరకలేదు. మూడో రోజు స్టేషన్‌ చుట్టూ ఉన్న మొక్కలపై పూసిన పూలను చూసి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ‘నాకు డబ్బులు లేకపోయినా పూలు ఉన్నాయి. ఎవరైనా నాకు డబ్బు ఇస్తే వారికి ఈ పూలను ఇస్తే ఎలా ఉంటుంది?’ అనుకున్నాడు. ఆ ఆలోచనను వెంటనే అమల్లో పెట్టాడు.

ఆ రోజు నుంచి ఎవరైనా అతనికి భిక్ష ఇస్తే, వారికి కొన్ని పూలను ఇచ్చేవాడు. పూలు తీసుకున్న ప్రయాణికులు సంతోషంగా వాటిని స్వీకరించేవారు. కొద్దిరోజుల్లోనే అతనికి ఎక్కువ మంది భిక్ష ఇవ్వడం ప్రారంభించారు. అతను స్టేషన్‌ చుట్టూ ఉన్న పూలను సేకరించి ప్రయాణికులకు పంచేవాడు. అయితే పూలు అయిపోయిన వెంటనే అతనికి వచ్చే డబ్బు కూడా తగ్గిపోయేది. ఓ రోజు అతను మళ్లీ అదే రైలులో ఆ పొడవాటి వ్యక్తిని చూశాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి ‘మీకు ఇవ్వడానికి నా దగ్గర కొన్ని పూలున్నాయి. మీరు నాకు కొంత డబ్బు ఇస్తే, బదులుగా ఈ పూలను మీకు ఇస్తాను’ అన్నాడు. ఆ వ్యక్తి డబ్బు ఇచ్చాడు. బిచ్చగాడు పూలను ఇచ్చాడు. ఆ లావాదేవీ చూసి వ్యాపారవేత్త చిరునవ్వుతో ‘అద్భుతం! ఈరోజు నువ్వు కూడా నాలాగే వ్యాపారవేత్త అయ్యావు’ అన్నాడు. ఆ మాటలు బిచ్చగాడి జీవితాన్నే మార్చేశాయి.

‘నేను బిచ్చగాడిని కాదు.. నేను వ్యాపారవేత్తను!’ అతనిలో ఓ కొత్త ఆత్మవిశ్వాసం పుట్టింది. తన చేతిలో ఏదో ఒక వస్తువు ఉందని, దాన్ని ఉపయోగించి సంపాదించవచ్చని అతనికి అర్థమైంది. అక్కడితో ఆగిపోలేదు. పూలు పంచుతూ వచ్చిన డబ్బును దాచుకున్నాడు. ఆ డబ్బుతో మరిన్ని పూలు కొనడం ప్రారంభించాడు. క్రమంగా పూల వ్యాపారాన్ని విస్తరించాడు. ఆరు నెలల తర్వాత.. అదే రైల్వే స్టేషన్‌లో సూటు, బూటు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఎదురుపడ్డారు. ఒకరు మరొకరిని గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు అతడు నవ్వుతూ ‘నన్ను గుర్తుపట్టలేదా? మనం ఇంతకుముందు రెండుసార్లు కలిశాం’ అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యాపారవేత్తకు విషయం అర్థమైంది. ‘అరే.. నువ్వేనా ఆ బిచ్చగాడు?’ అని ఆశ్చర్యపోయాడు.

‘అవును. ఒకప్పుడు నేను బిచ్చగాడిని. కానీ ఇప్పుడు నేను పెద్ద పూల వ్యాపారిని. నా వ్యాపారం కోసం మరో నగరానికి వెళ్తున్నాను’ అని అతడు చెప్పాడు. తన జీవితాన్ని మార్చిన విషయాన్ని కూడా వివరించాడు. మొదటిసారి మీరు నాకు ‘ఇచ్చినప్పుడే పొందగలం’ అనే విషయాన్ని చెప్పారు. రెండోసారి నేను పూలు ఇచ్చినప్పుడు ‘నువ్వు కూడా వ్యాపారవేత్తవే’ అన్నారు. ఆ రోజు నుంచి నేను నన్ను నేను బిచ్చగాడిగా చూడటం మానేశాను. ప్రజలు నాకు భిక్ష ఇవ్వడం లేదని, నా పూలకు డబ్బు చెల్లిస్తున్నారని అర్థం చేసుకున్నాను. ఆ ఆలోచనే నా జీవితాన్ని మార్చింది’ అని చెప్పాడు. వ్యాపారవేత్త అతని మాటలు విని సంతోషించాడు.

నీతి

ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. మన పరిస్థితులను మార్చుకునే ముందు మన ఆలోచనలను మార్చుకోవాలి. మనల్ని మనమే చిన్నగా భావిస్తే, మన సామర్థ్యాలు కూడా చిన్నగానే కనిపిస్తాయి. కానీ మనలో ఉన్న విలువను గుర్తించి, దాన్ని ఇతరులకు ఉపయోగపడేలా మార్చగలిగితే అవకాశాలు మన ముందుకు వస్తాయి. జీవితంలో ఏదైనా పొందాలంటే ముందుగా ఏదో ఒక విలువను ఇవ్వాలి. డబ్బు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు. మన సమయం, ప్రతిభ, జ్ఞానం, శ్రమ లేదా సేవ.. ఏదైనా కావచ్చు. విజయం బయట ఎక్కడో లేదు.. ముందుగా మన ఆలోచనల్లోనే పుడుతుంది.

Follow Us