AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lesson: నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. బుద్ధుడి ఈ కథ మీ జీవితాన్ని మార్చేస్తుంది!

మీ జీవితంలోని చీకటిని తొలగించాలంటే ముందుగా మీ సొంత దీపాన్ని వెలిగించండి. మీ ప్రయాణం మీది. మీ దారి మీది. ఆ దారిలో నడవాల్సింది కూడా మీరే. ఇతరులను అనుసరించడం తప్పు కాదు. కానీ మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఎప్పటికీ ఇతరులపై వదిలేయకండి. వారి అనుభవం నుంచి నేర్చుకోండి.. వారి సలహాలను తీసుకోండి.. కానీ మీ అడుగు మాత్రం మీ ఆలోచనతో వేయండి. ఎందుకంటే చివరికి.. నీ దారికి నువ్వే వెలుగవ్వాలి..

Life Lesson: నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. బుద్ధుడి ఈ కథ మీ జీవితాన్ని మార్చేస్తుంది!
Powerful Story On Self Reliance
Srilakshmi C
|

Updated on: Oct 02, 2026 | 7:38 PM

Share

ఒక ప్రశాంతమైన సాయంత్రం. బుద్ధుడు ఓ పెద్ద మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ శిష్యులు నిశ్శబ్దంగా కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత ఓ యువ శిష్యుడు చేతులు జోడించి బుద్ధుడిని అడిగాడు. ‘గురువుగారూ.. ఒకరోజు మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు. ఆ రోజు తర్వాత మేము సరైన మార్గాన్ని ఎలా కనుగొనాలి? మాకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు?’ బుద్ధుడు ఆ శిష్యుడి వైపు చిరునవ్వుతో చూశాడు. నేరుగా సమాధానం చెప్పకుండా ఓ కథ చెప్పడం ప్రారంభించాడు.

ఒకప్పుడు ఇద్దరు ప్రయాణికులు చాలా రోజుల పాటు కలిసి ప్రయాణించారు. ఓ రోజు సూర్యాస్తమయం సమీపిస్తున్న సమయంలో వారు అడవి పక్కన ఉన్న ఓ చిన్న సత్రానికి చేరుకున్నారు. సత్రం యజమాని వారిని ఆప్యాయంగా ఆహ్వానించాడు. వారు విశ్రాంతి తీసుకుంటుండగా ఓ వృద్ధ వ్యాపారి అక్కడికి వచ్చాడు. అతని దగ్గర అందంగా తయారు చేసిన నూనె దీపాలు ఉన్నాయి. ‘రాత్రి కాబోతోంది. మీరు వెళ్లాల్సిన దారి అడవి గుండా ఉంటుంది. అక్కడ చీకటి ఎక్కువగా ఉంటుంది. మీ ప్రయాణానికి ఈ దీపం ఎంతో ఉపయోగపడుతుంది’ అని చెప్పాడు. మొదటి ప్రయాణికుడు వెంటనే ఓ దీపం కొనుక్కున్నాడు. రెండో ప్రయాణికుడు మాత్రం దీపం కొనలేదు. ‘నేను ఎందుకు డబ్బు ఖర్చు చేయాలి? నా స్నేహితుడి దగ్గర ఇప్పటికే దీపం ఉంది కదా! అతని వెనుక నడిస్తే నాకు కూడా వెలుతురు ఉంటుంది’ అని అనుకున్నాడు. కొద్దిసేపటికే చీకటి కమ్ముకుంది.

మొదటి ప్రయాణికుడు తన దీపాన్ని వెలిగించాడు. ఇద్దరూ కలిసి అడవిలో ప్రయాణం ప్రారంభించారు. దీపం వెలుతురు వారి ముందున్న దారిని స్పష్టంగా చూపించింది. దీంతో ప్రయాణం సురక్షితంగా సాగింది. రెండో ప్రయాణికుడు తన నిర్ణయానికి సంతోషించాడు. ‘నేను డబ్బు ఖర్చు చేయలేదు. అయినా నాకు వెలుతురు దొరికింది’ అని అనుకున్నాడు. కొంతసేపటి తర్వాత వారు రెండు దారులు విడిపోయే ప్రదేశానికి చేరుకున్నారు. మొదటి ప్రయాణికుడు ఎడమవైపు ఉన్న దారిని చూపిస్తూ ‘నా గ్రామం ఈ దారిలో ఉంది’ అన్నాడు. రెండో ప్రయాణికుడు మరో దారిని చూపిస్తూ ‘నా గమ్యం అటువైపు ఉంది’ అని చెప్పాడు. ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని తమ తమ దారుల్లో వెళ్లిపోయారు. మొదటి ప్రయాణికుడి దీపం క్రమంగా దూరమై కనిపించకుండా పోయింది. అంతే.. రెండో ప్రయాణికుడు ఒక్కసారిగా పూర్తిగా చీకటిలో చిక్కుకున్నాడు. అతనికి ముందున్న దారి కనిపించలేదు. అడవిలో వినిపిస్తున్న ప్రతి శబ్దం అతనిలో భయాన్ని పెంచింది. కొంతదూరం వెళ్లడానికి ప్రయత్నించినా దిశ అర్థం కాలేదు.

చివరకు ప్రమాదం జరుగుతుందేమోనని భయపడి ఓ చెట్టు ఎక్కాడు. తెల్లవారే వరకు అక్కడే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి ఓ విషయం అర్థమైంది. తన ప్రయాణం మొత్తం మరొకరి దీపంపై ఆధారపడటం తన తప్పు అని గ్రహించాడు.

బుద్ధుడి సందేశం

కథ చెప్పడం ముగించిన బుద్ధుడు తన శిష్యుల వైపు చూశాడు. ‘నా పిల్లలారా.. చాలా మంది మనుషులు కూడా ఇలాగే జీవిస్తారు. తమ జీవితానికి దారి చూపించడానికి ఎవరైనా వస్తారని ఎదురుచూస్తారు. తమ సమస్యలను మరొకరు పరిష్కరిస్తారని ఆశిస్తారు. ఇతరుల జ్ఞానం, అనుభవం తమను గమ్యానికి చేర్చుతుందని నమ్ముతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఒక గురువు మీకు దారి చూపగలడు. తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించగలరు. స్నేహితులు మీకు స్ఫూర్తినివ్వగలరు. కానీ మీ జీవితంలో అడుగులు వేయాల్సింది మాత్రం మీరే. ఇతరుల వెలుగును కొంతకాలం ఉపయోగించుకోవచ్చు. కానీ ఎప్పటికీ దానిపైనే ఆధారపడలేరు. ఒక దశలో మీ దారి మీకు మీరు కనుక్కోవాల్సిందే. అందుకే మీ జీవితంలోని చీకటిని తొలగించాలంటే ముందుగా మీ సొంత దీపాన్ని వెలిగించండి. మీ ప్రయాణం మీది. మీ దారి మీది. ఆ దారిలో నడవాల్సింది కూడా మీరే. ఇతరులను అనుసరించడం తప్పు కాదు. కానీ మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఎప్పటికీ ఇతరులపై వదిలేయకండి. వారి అనుభవం నుంచి నేర్చుకోండి.. వారి సలహాలను తీసుకోండి.. కానీ మీ అడుగు మాత్రం మీ ఆలోచనతో వేయండి. ఎందుకంటే చివరికి.. నీ దారికి నువ్వే వెలుగవ్వాలి’.

Follow Us