పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో చిన్నపాటి యుద్ధం!
తన భార్య శుభ్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని టర్కీలో ఓ వ్యక్తి ఆరోపించాడు. భార్య టాయిలెట్‌ను శుభ్రం చేసిన వెంటనే దాన్ని తాను ఉపయోగించేందుకు అనుమతించేది కాదనీ, మంచంపై తన వెంట్రుకలు కనిపించినా ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతుందనీ, సాధారణ జీవితం తరచూ కలతలకు దారితీసేదని తెలిపాడు. ఆమెకు శుభ్రతపై ఉన్న అతి శ్రద్ధే సమస్యకు కారణమంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.

తన భార్య శుభ్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని టర్కీలో ఓ వ్యక్తి ఆరోపించాడు. ఆమెకు శుభ్రతపై ఉన్న అతి శ్రద్ధే సమస్యకు కారణమంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. వంటగది ఉపయోగిస్తే శుభ్రం చేయాల్సి వస్తుందనే కారణంతో ఇద్దరూ బయట నుంచి ఆహారం తెప్పించుకుని తింటామనీ వివాహ బంధంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదనకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. దాదాపు 2.5 లక్షల డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ కోర్టును కోరాడు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.2 కోట్లకు పై మాటే. ఒక వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేంత భయానక పరిస్థితికి మానసిక సమస్యలు దారి తీస్తాయని, సకాలంలో చికిత్స తీసుకోవడం అవసరమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన దేశం విషయానికొస్తే.. భర్త స్నానం చేయడం లేదని ఓ మహిళ విడాకులు కోరగా.. తనకు రోజూ లడ్డూలే పెడుతోందంటూ మరో భర్త కోర్టును ఆశ్రయించాడు. ఇలాంటి విచిత్ర ఘటనలు గతంలో వార్తల్లో నిలిచాయి. ఆగ్రాలో ఓ మహిళ పెళ్లయిన 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కోరుతూ కుటుంబ సలహా కేంద్రాన్ని ఆశ్రయించింది.
40 రోజులకే విడాకులు.. భర్త స్నానం చేయడం లేదని భార్య ఫిర్యాదు!
తన భర్త వ్యక్తిగత పరిశుభ్రతను పట్టించుకోవడం లేదని, అతని శరీరం నుంచి దుర్వాసన వస్తోందని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరినీ పిలిపించిన కౌన్సెలింగ్ కేంద్రం అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. భర్త చెప్పిన విషయం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాను నెలలో ఒకటి, రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తానని, వారానికి ఒకసారి గంగాజలం చల్లుకుంటానని అతడు చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి, మరోసారి మాట్లాడుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఆ మహిళ విడాకులు తీసుకోవడానికే కట్టుబడింది.
రోజూ మ్యాగీనే వంటకం.. చివరకు విడాకులు!
సాధారణంగా ఇంట్లో వంట చేయడం భార్యాభర్తల మధ్య పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఓ జంట విషయంలో మాత్రం అదే వివాదానికి కారణమైంది. తన భార్యకు రుచికరమైన వంటలు చేయడం రాదని భర్త ఆరోపించాడు. ఆమె ప్రతిరోజూ మ్యాగీ తయారు చేసి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంగా వడ్డించేదని ఫిర్యాదు చేసాడు. ఒకే రకమైన ఆహారం తినాల్సి రావడంతో తాను తీవ్ర అసంతృప్తికి గురై తమ మధ్య విభేదాలు పెరిగినట్లు చెప్పాడు. చివరకు ఇద్దరూ కలిసి తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ఈ ఘటనకు సంబంధించిన కథనాలు వెల్లడించాయి.
రోజూ లడ్డూలే తినాలంటూ భర్తకు షరతు!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విచిత్ర వివాదం వెలుగులోకి వచ్చింది. తన భార్య ఓ తాంత్రికుడి మాటలు విని, అతడు చెప్పినట్లుగానే నడుచుకుంటోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. తాంత్రికుడి సూచనల పేరుతో తన ఆహారపు అలవాట్లపై భార్య ఆంక్షలు విధిస్తోందనీ, రోజూ ఉదయం నాలుగు లడ్డూలు, సాయంత్రం మరో నాలుగు లడ్డూలు మాత్రమే తనకు ఇస్తోందని ఆరోపించాడు. ఇతర ఆహార పదార్థాలు తినడానికి అనుమతించడం లేదని వాపోయాడు. దాదాపు పదేళ్ల పాటు కొనసాగిన తమ వివాహ జీవితంలో ఈ పరిస్థితులతో విసిగిపోయిన భర్త, ఇక కలిసి జీవించడం సాధ్యం కాదని విడాకులు తీసుకున్నాడు.