పేపర్‌వెయిట్ అనుకుని కొన్నేళ్లు వాడాడు.. బాంబు అని తెలిసి షాకయ్యాడు
ఇంట్లో టేబుల్‌పై ఉన్న ఓ పాత వస్తువు.. ఎన్నో ఏళ్లుగా అతడికి సాధారణ పేపర్‌వెయిట్‌లాగే కనిపించింది. ఇంటికి వచ్చిన అతిథులు కూడా దాన్ని చేతిలోకి తీసుకుని ఆసక్తిగా చూసేవారు. కానీ అదే వస్తువు అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థమని తెలిస్తే? అమెరికాలోని టెక్సాస్‌లో ఓ వ్యక్తికి ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది.

తన ఇంట్లో ఏళ్ల తరబడి పేపర్‌వెయిట్‌గా ఉపయోగించిన 20 పౌండ్ల ( 9 కిలోల) బరువున్న వస్తువు.. అమెరికా అంతర్యుద్ధం కాలం నాటి పేలగలిగే ఫిరంగి గుండు అని తెలిసి షాకయ్యాడు. టెక్సాస్‌లోని అటాస్కోసా కౌంటీకి చెందిన స్టీవ్ మార్టిన్ వద్ద ఈ పురాతన వస్తువు ఉండేది. ఆయన కుమారుడు చేపలు పడుతున్న సమయంలో దీనిని గుర్తించి ఇంటికి తీసుకొచ్చాడు. మార్టిన్‌కు అది ప్రమాదకరం కాదని అనిపించింది. అది కేవలం పాత సైనిక వస్తువు లేదా పేలని డమ్మీ గుండు అయి ఉంటుందని భావించాడు. దాంతో ఇంట్లోని టేబుల్‌పై పేపర్లు ఎగిరిపోకుండా ఉంచే పేపర్‌వెయిట్‌గా ఉపయోగించడం ప్రారంభించాడు. ఏళ్ల తరబడి ఆ వస్తువు మార్టిన్ ఇంట్లోనే ఉంది. ఇంటికి వచ్చిన వారు దాన్ని చూసి ఆసక్తిగా చేతిలోకి తీసుకుని పరిశీలించేవారు. మార్టిన్‌తో పాటు అతిథులు కూడా అది ప్రమాదకరమైన వస్తువు అని ఎప్పుడూ అనుకోలేదు. అది కేవలం చరిత్రకు సంబంధించిన ఓ పాత సైనిక వస్తువేనని భావించారు.
అయితే ఓ రోజు ఇంటికి వచ్చిన సైనిక అనుభవం ఉన్న ఓ వ్యక్తి ఆ వస్తువును చూసి అనుమానం వ్యక్తం చేశాడు. ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తికి సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. వస్తువును జాగ్రత్తగా పరిశీలించిన అతడు..అది సాధారణ డమ్మీ గుండు లాగా లేదని గుర్తించాడు. ఆకారం నిజమైన ఫిరంగి గుండును పోలి ఉందని, అందులో ఇప్పటికీ పేలుడు పదార్థం ఉండే అవకాశం ఉందని మార్టిన్‌ను హెచ్చరించాడు. అప్పుడే మార్టిన్‌కు అనుమానం వచ్చింది.
రంగంలోకి బాంబ్ డిస్పోజల్ టీమ్
వెంటనే మార్టిన్ అటాస్కోసా కౌంటీ షెరీఫ్ కార్యాలయాన్ని సంప్రదించాడు. షెరీఫ్ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందాన్ని రప్పించారు. నిపుణులు ఆ వస్తువును పరిశీలించి.. అది నిజంగానే లైవ్ పారట్ రౌండ్ బాంబుగా నిర్ధారించారు. అంటే 160 ఏళ్ల పాతదైనా అది ఇప్పటికీ పేలే సామర్థ్యం ఉన్న ఫిరంగి గుండే.
160 ఏళ్ల తర్వాత కూడా ప్రమాదమే!
అధికారులు ఆ వస్తువును సాధారణ చారిత్రక వస్తువుగా కాకుండా ప్రమాదకరమైన పేలుడు పదార్థంగా పరిగణించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా దాన్ని టెక్సాస్‌లోని పేలుడు పదార్థాల శిక్షణా ప్రాంతానికి తరలించారు. అక్కడ నిపుణులు దాన్ని సురక్షితంగా పేల్చి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 160 ఏళ్లు గడిచినా ఆ ఫిరంగి గుండు పేలే స్థితిలో ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చరిత్రకు సంబంధించిన పాత ఆయుధాలు, ఫిరంగి గుండ్లు కనిపించినప్పుడు వాటిని చేతిలోకి తీసుకోవడం లేదా ఇంట్లో భద్రపరచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.