Pan Card: ఈ లింకులు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ప్రజలకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి హెచ్చరిక
ఇటీవల పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి అని నకిలీ లింక్‌లు, మెయిల్స్ పంపించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. ఫేక్ లింకుల ద్వారా బ్యాంక్ వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది.

ఇటీవల సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. తరచూ ఎక్కడో ఒకచోట సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పొగోట్టుకున్నవారి గురించి మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం. చాలా తెలివితో ఎవరికి ఎలాంటి అనుమానం అనేదే రాకుండా డబ్బులు దోచేస్తున్నారు. చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తూ అందినకాడికి కాజేస్తున్నారు. చదువులేనివారి కంటే చదువుకున్నవారే వీరి ఉచ్చులో ఎక్కువమంది పడి లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రజలను అలర్ట్ చేస్తున్నా మోసాలు ఆగడం లేదు. ఏదోక వినూత్న పద్దతిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పాన్ కార్డ్‌ను తమ మోసాలకు సైబర్ క్రిమినల్స్ ఎంచుకున్నారు.
పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ ఫేక్ మెయిల్స్, లింకులు పంపుతున్నారు. వీటికి క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు అడుగుతున్నారు. ఈ రకంగా బ్యాంకింగ్ వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా కొంతమంది ఇలాంటి మెయిల్స్ వల్ల మోసపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇన్‌కమ్ ట్యాక్స్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ప్రజలను హెచ్చరిస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ వచ్చే ఫేక్ మెయిల్స్, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటివాటిని క్లిక్ చేయవద్దని తెలిపింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి తాము అలాంటి మెయిల్స్ అసలు పంపించమని స్పష్టం చేసింది. తాము ఈమెయిల్ ద్వారా ఎలాంటి వ్యక్తిగత, సున్నితమైన వివరాలు సేకరించమని స్పష్టం చేసింది. మీరు అలాంటి ఫేక్ మెయిల్స్ క్లిక్ చేస్తే ప్రమాదకరమైన వైరస్‌లు చేరి ఫోన్ హ్యాక్ అవుతుందని ఇన్‌కమ్ ట్యాక్స్ పేర్కొంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో వచ్చే ఫేక్ మెస్సేజులపై తమకు సమాచారం అందించాలని తెలిపింది. webmanager@incometax.gov.in, incident@cert-in.org.inకి ఫిర్యాదులు పంపించాలని సూచించింది. దీంతో తాము వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఫిషింగ్ మెయిల్స్‌తో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, యాంటీ స్పైవేర్‌లను ఫోన్లలో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. నకిలీ లింక్‌లకు అసలు స్పందించవద్దని హెచ్చరించింది.




