Maharashtra Election 2024: మహా సమరం.. 3 దశాబ్దాల తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదు.. దేనికి సంకేతం?

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సహా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఈనెల 23న (శనివారం) వాటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్నింటిలో మహారాష్ట్ర ఎన్నికలనే యావద్దేశం ఆసక్తిగా గమనిస్తోంది.

Maharashtra Election 2024: మహా సమరం.. 3 దశాబ్దాల తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదు.. దేనికి సంకేతం?
Maharashtra Elections
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 21, 2024 | 12:28 PM

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సహా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఈనెల 23న (శనివారం) వాటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్నింటిలో మహారాష్ట్ర ఎన్నికలనే యావద్దేశం ఆసక్తిగా గమనిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరం ఈ రాష్ట్రంలోనే ఉండడం ఒకెత్తయితే, ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత అత్యధిక జనాభా, పార్లమెంట్ స్థానాలు కల్గిన రాష్ట్రం కూడా ఇదే కావడం మరో ఎత్తు. పైగా కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనే అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కి ఎదురుదెబ్బ తలిగింది. దీంతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కోల్పోయి మిత్రక్షాలతో కలిపి “నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్” (NDA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మొత్తం 48 పార్లమెంట్ స్థానాల్లో విపక్ష ఇండి కూటమి 30 స్థానాలు గెలుచుకోగా, ఎన్డీఏ కూటమి కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. కొద్ది నెలల వ్యవధిలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు నాడి ఎలా ఉందన్నదే ఇప్పుడు అందరికీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

పెరిగిన పోలింగ్ శాతంపై విశ్లేషణలు

ఎన్నికలు ముగిశాయో లేదో ఎగ్జిట్ పోల్ అంచనాలు అంటూ విశ్లేషణలు మొదలవుతాయి. మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై కూడా అనేక సర్వే సంస్థలు తమ అంచనాలు విడుదల చేశాయి. వాటిలో ఒకట్రెండు తప్ప దాదాపు అన్నీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ (మహాయుతి) గెలుపొందుతుందని వెల్లడించాయి. ఏ విశ్లేషణకైనా గణాంకాలు కీలకం. అందులో పోలింగ్ శాతం ఒకటి. గత ఎన్నికల కంటే ఎక్కువగా నమోదైతే.. దాన్ని సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకతగా విశ్లేషిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ విశ్లేషణలు తప్పు అని రుజువయ్యాయి. మరి మహారాష్ట్రలో ఈసారి నమోదైన పోలింగ్ శాతం గతం కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 61.44 శాతం పోలింగ్ నమోదవగా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అది 65.02గా నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పెరిగిన ఓట్ల శాతం ఎవరి విజయావకాశాలను ఎలా ప్రభావితం చేస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.

మహారాష్ట్రలో 1995లో నమోదైన 71.7 శాతం ఓట్లే గత మూడు దశాబ్దాల్లో అత్యధిక పోలింగ్ శాతం. మళ్లీ 30 ఏళ్ల తర్వాత భారీ పోలింగ్ శాతం నమోదైంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా ఉన్న ముంబైలో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు తరలివచ్చి ఓటు వేయడంతో పాటు మిగతావారికి స్ఫూర్తినిచ్చారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద అసౌకర్యానికి తావు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు కూడా పోలింగ్ శాతం స్వల్పంగా పెరగడానికి దోహదపడ్డాయని భావిస్తున్నారు.

ప్రాంతాలవారిగా చూస్తే రాష్ట్రంలోని 36 జిల్లాల్లో కొల్హాపూర్ జిల్లాలో అత్యధికంగా 76.25 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో మావోయిస్టుల ప్రాబల్య గడ్చిరోలి (73.68%) నిలవగా, 72.30 శాతంతో జాల్నా 3వ స్థానంలో నిలిచింది. ముంబై మహానగరంలో అత్యల్పంగా 52.07 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాలవారిగా చూస్తే ముంబైలోని కొలాబా నియోజకవర్గం 44.49 శాతంతో అత్యల్పంగా నిలిచింది. సహజంగానే పట్టణ ప్రాంత ప్రజలు ఓటు వేయడానికి నిరాసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో పట్టణ జనాభా అధికం. దాదాపు 5.1 కోట్ల మంది అంటే రాష్ట్ర జనాభాలో 45 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోంది.

విశ్లేషణకు అందని రెండు పార్టీల్లో చీలికలు

మహారాష్ట్రలో ఐదేళ్ల కాలంలో రాజకీయంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లు రెండుగా చీలిపోయాయి. శివసేనలో చీలిక వర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం వహిస్తుంటే, మరోవర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. ఉద్ధవ్ కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (MVA)లో ఉండగా, ఏక్‌నాథ్ షిండే ‘మహాయుతి’ (NDA)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం కాంగ్రెస్‌తో కలిసి సాగుతుండగా, అజిత్ పవార్ వర్గం ఎన్డీఏలో భాగంగా ఉంది. చీలిక పార్టీలే అసలైన పార్టీలని, పార్టీ ఎన్నికల గుర్తులు వారికే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఎన్నికల గుర్తు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోలేదు. గుర్తులు మారకపోయినా సరే.. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించినన్ని స్థానాలు గెలుపొందలేకపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు చీలిక వర్గాల ప్రభావం ఎంతమేర ఉంటుందన్నది ఎవరి ఊహకు అందడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..