Parliament Winter Session 2025: లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ ప్రారంభించిన ప్రధాని
వందేమాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది..ఆ స్వరం మారుతున్నదీ అన్నాడో కవి. కానీ ఎవరెన్ని అపస్వరాలు పలుకుతున్నా.. తరాలుగా ఊరూవాడా ప్రతిధ్వనిస్తూనే ఉంది వందేమాతర గీతం. 150 వసంతాలు పూర్తిచేసుకున్న జాతీయ గీతంపై పార్లమెంట్ సాక్షిగా పదిగంటల ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఆ డీటేల్స్ ఈ కథనంలో ...
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇవాళ లోక్‌సభలో వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చను ప్రారంభించారు. ఈ అంశంపై సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చను ముగిస్తారు.
లోక్‌సభలో వందేమాతరంపై చర్చ కోసం మొత్తం 10 గంటల సమయాన్ని కేటాయించారు. అధికార ఎన్‌డీఏ కూటమికి 3 గంటల సమయాన్ని కేటాయించారు. గమనార్హం. లోక్‌సభలో ప్రత్యేక చర్చ సందర్భంగా వందేమాతరంతో ముడిపడిన కీలకమైన చారిత్రక అంశాలు ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. వందేమాతరంపై లోక్‌సభలో ప్రత్యేక చర్చలో కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ప్రసంగిస్తారు.
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అప్పట్లో భారతీయుల్ని ఏకం చేసిన ఉద్యమ ఘట్టాల్లో వందేమాతర గీతం ఒకటి. బంకిచంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం అప్పట్లో భారతీయుల్ని ఉర్రూతలూగించింది. అయితే గీతంలో హిందూ దేవతల్ని కీర్తిస్తూ ఉన్న చరణాలపై స్వాతంత్ర్యానంతరం కొన్ని అభ్యంతరాలు రావటంతో.. అప్పట్లో నెహ్రూ సర్కార్ దీన్ని కుదించింది. దేశవాసులంతా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పాడుకునేందుకు వీలుగా గీతంలో ఈ మార్పులు చేసింది.
2012లో కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా వందేమాతర గీతంపై పార్లమెంట్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి మన్మోహన్‌సింగ్ సర్కార్ రాజ్యసభలో అభ్యంతరకర వ్యాఖ్యల జాబితాలో వందేమాతరాన్ని కూడా చేర్చింది. దీంతో రాజ్యసభలో వందేమాతరం గీతం ఆలపించడానికి లేకుండా పోయింది. ఇప్పుడు వందేమాతరాన్ని నిషేధిత పదాల జాబితా నుంచి తొలగించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్‌లో స్వల్పకాలిక చర్చ తర్వాత దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అందుకే ఎంపీలందరూ కచ్చితంగా సభకు రావాలని బీజేపీ ఆదేశాలిచ్చింది.
వందేమాతరంపై మంగళవారం రాజ్యసభలోనూ ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆయన తర్వాత రాజ్యసభ అధికార పక్ష నేత జేపీ నడ్డా ప్రసంగిస్తారు. డిసెంబరు 1న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 19 వరకు కొనసాగుతాయి.




