Asaduddin Owaisi: ‘బాబ్రీ తీర్పుతో ముస్లిం ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా మారాయి’.. అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలతో నిత్యం వార్తల్లో నిలిచే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీద్ తీర్పుతో ముస్లిం ప్రార్థన మందిరాలు కొందరికి లక్ష్యంగా మారాయంటూ ఆయన ధ్వజమెత్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు..

Asaduddin Owaisi: 'బాబ్రీ తీర్పుతో ముస్లిం ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా మారాయి'.. అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2024 | 12:59 PM

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న తిరుమల వ్యవహారంపై తీవ్రంగా వ్యవహరించిన అసదుద్దీన్‌ తాజాగా ఉత్తరప్రదేశ్ సంభాల్‌లోని చందౌసికి చెందిన షాహీ జామా మసీదు కేసుకు సంబంధించి ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. బాబ్రీ మసీదు తీర్పు భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకునేందుకు కొందరిని ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు.

ఈ విషయమై ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేస్తూ.. ‘మసీదును నిర్మించడానికి ఆలయాన్ని కూల్చివేశారంటూ పిటిషన్‌ వేసిన మూడు గంట్లోనే ప్రాథమిక సర్వేకు సివిల్‌ జడ్జి ఆదేశించారు. పిటిషన్‌ వేసిన లాయర్‌ యూపీ ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా ఉన్నారు. పిటిషన్‌ వేసిన రోజు సర్వే నిర్వహించారు. బాబ్రీ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. అవతలి వారి వాదన కూడా వినకుండానే కోర్టు ఆదేశాలిచ్చిన గంటలోపే బాబ్రీ తాళాలు తెరిచారంటూ’ అసదుద్దీన్‌ రాసుకొచ్చారు.

ఇంతటి వేగాన్ని సాధారణ కేసుల్లో ఎందుకు చూపించరంటూ అసదుద్దీ ప్రశ్నించారు. కోర్టులు ఇలా ఆదేశాలను ఇస్తూ పోతుంటే ప్రార్థనా స్థలాల చట్టం కేవలం చిత్తు కాగితంతో సమానమవుతుంది. ఇలాంటి వ్యాజ్యాలను వెంటనే కోర్టులకు చేరకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారని అసదుద్దీన్‌ గుర్తు చేశారు. వందల ఏళ్ల నుంచి ప్రార్థనల కోసం ఉపయోగిస్తున్న మసీదులపై.. మతపరమైన ప్రేరేతి వ్యాజ్యాలు వేస్తున్నారన్నారు. న్యాయస్థానాలు వీటిని మొదట్లోనే తుంచి వేయాలని అసదుద్దీన్‌ డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉంటే.. షాహీ జామా మసీదును సర్వే చేయాలని మంగళవారం కోర్టు ఆదేశించింది. 1526లో అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని మహంత్ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మసీదును నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చివేశారా లేదా అని తెలుసుకోవడానికి మసీదు స్థలంలో ప్రాథమిక సర్వే నిర్వహించాలని కమిషనర్‌గా నియమించిన రమేష్‌ చంద్‌ రాఘవ్‌ను సివిల్‌ జడ్జి ఆదిత్య సింగ్ ఆదేశించారు. నవంబర్ 29వ తేదీలోగా సర్వే నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..