Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్.. అసలు కారణం ఇదేనా?..
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు ఊరటిస్తూ కీలక ప్రకటన చేసింది.
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు ఊరటిస్తూ కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ. 5, రూ. 10 మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తగ్గించిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ విషయంలో రాష్ట్రాలను కూడా కదిలించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. కేంద్రం సూచన మేరకు రాష్ట్రాలు కూడా ఎంతో కొంత ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే.. వాహనదారులకు నిజంగా అది పెద్ద ఊరటే అవుతుంది.
అయితే, పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఇంతకాలం మొండి వైఖరి అవలంభిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉన్నపళంగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ప్రకటన చేయడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదంటూ ఏకంగా కేంద్ర ఇందన శాఖ మంత్రే ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు.. బీజేపీకి గట్టిగా తగిలింది. ఈ ఎఫెక్ట్ వల్లే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లపై కాస్త వెనక్కి తగ్గిందని చెబుతున్నారు విశ్లేషకులు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరగ్గా.. మంగళవారం నాడు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తంగా బీజేపీ కేవలం 7 అసెంబ్లీ సీట్లలో మాత్రమే గెలుపొందింది. చాలాచోట్ల సిట్టింగ్ స్థానాల్లోనూ దారుణ ఓటమిని చవిచూసింది. పైగా ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో బలం పుంజుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవానికి పెరుగుతున్న ధరలే కారణమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల ఎఫెక్ట్ ఎన్నికలపై గట్టిగానే పడిందంటున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ దరలు 30 రూపాయలకు పైగా పెరిగాయి. వంట గ్యాస్ ధర వెయ్యి పైగా అయ్యింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 2 వేలకు చేరింది. వంట నూనలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా విరామం లేకుండా పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన జనాలు.. ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం ఇచ్చారు అని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందులో భాగంగానే ప్రజలకు ఊరట కల్పించే యత్నం చేస్తూ కీలక ప్రకటన చేశారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తాము కొంత తగ్గించి.. తెలివిగా రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించేలా ఇరకాటంలో పడేసే విధంగా ప్రకటన చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే సూచనలు లేవని స్వయంగా కేంద్ర ఇంధన శాఖ మంత్రే గతంలో ప్రకటించారు. ఆ తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒకానొక సందర్భంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు ప్రస్తుతానికి లేవని అన్నారు. ఇలాంటి తరుణంలో తాజా ఎన్నికల ఫలితాల దెబ్బతో.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ ప్రకటన చేసింది.
Also read:
T20 World Cup 2021: టోర్నీ నుంచి టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ ఔట్.. ఎందుకో తెలుసా?
Diwali 2021: సుఖ సంతోషాల కోసం దీపావళి ముందురోజు ఈ 5 పనులు చేయాలి..!
Human Body: బల్లి తోక పెరిగినట్లే.. మనిషిలోనూ ఓ అవయవం పెరుగుతుంది.. అదెంటో మీకు తెలుసా?..