INDIA Alliance: కండిషన్స్ అప్లై.. ఎక్కడైనా మిత్రులే.. కానీ, ఇక్కడ మాత్రం కాదు.. దేశ రాజకీయాల్లో సరికొత్త స్నేహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ (BJP)ని గద్దె దించడమే వారి ఉమ్మడి లక్ష్యం. అందుకే విబేధాలు పక్కనపెట్టి మరీ ఏకతాటిపైకి వచ్చారు. భారతదేశానికి ఉన్న ఆంగ్లనామం I.N.D.I.A అని వచ్చేలా ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అంటూ తమ కూటమికి నామకరణం చేశారు. చాలా వేదికలపై కూటమి పార్టీల నేతలంతా చేతులు కలిపి ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు.

INDIA Alliance: కండిషన్స్ అప్లై.. ఎక్కడైనా మిత్రులే.. కానీ, ఇక్కడ మాత్రం కాదు.. దేశ రాజకీయాల్లో సరికొత్త స్నేహం
INDIA Alliance
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 28, 2024 | 5:29 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ (BJP)ని గద్దె దించడమే వారి ఉమ్మడి లక్ష్యం. అందుకే విబేధాలు పక్కనపెట్టి మరీ ఏకతాటిపైకి వచ్చారు. భారతదేశానికి ఉన్న ఆంగ్లనామం I.N.D.I.A అని వచ్చేలా ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అంటూ తమ కూటమికి నామకరణం చేశారు. చాలా వేదికలపై కూటమి పార్టీల నేతలంతా చేతులు కలిపి ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు. ఎన్నికల రాజకీయాల్లో ఒక్క ఓటుతో నేతలు, పార్టీల భవితవ్యం తలకిందులయ్యే పరిస్థితుల్లో… ఇదంతా చూసిన ఎవరికైనా సరే.. విపక్షాల ఓట్లన్నీ కలిస్తే ఇక కమలదళానికి కష్టకాలమే అన్న అభిప్రాయం కలిగింది. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 543 సీట్లున్న లోక్‌సభలో సొంతంగానే 303 సీట్లు గెలుపొందగలిగిన బీజేపీ.. దేశవ్యాప్తంగా సాధించిన ఓట్లు కనీసం సగానికి దగ్గరగా కూడా లేవు. కేవలం 37.36% ఓట్లతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ సహా మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవకుండానే బీజేపీ ఈ సీట్లు సాధించింది. అంటే బీజేపీకి ఓటేయని ప్రజలు 60 శాతానికి పైగానే ఉన్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. కాకపోతే వారంతా వేర్వేరు పార్టీలకు ఓట్లేయడం వల్ల వ్యతిరేక ఓటు చీలిపోయి బీజేపీ ఇంత భారీ విజయం నమోదు చేసిందని చూసేవారికి ఎవరికైనా అర్థమవుతుంది. నాడు చీలిపోయిన వ్యతిరేక ఓట్లను ఒక గంప కిందకు తీసుకొస్తే చాలు బీజేపీ ఖేల్ ఖతం అన్నది విపక్ష పార్టీల ఆలోచన. ఆ క్రమంలోనే 30కి పైగా పార్టీలతో విపక్ష (I.N.D.I.A) కూటమి ఏర్పడింది. ఇదంతా అందరికీ తెలిసిన కథే. కానీ అసలు ట్విస్టులు ఆ తర్వాతే మొదలయ్యాయి.

ఎక్కడైనా మిత్రులే.. ఇక్కడ మాత్రం కాదు

విపక్ష కూటమి పార్టీల్లో కాంగ్రెస్ (INC) – కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు – తృణమూల్ కాంగ్రెస్ (TMC), తృణమూల్ కాంగ్రెస్ – కాంగ్రెస్ మధ్య ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ వైరం గురించి దేశమంతటా తెలుసు. దేశమంతా కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కేరళలో మాత్రం బద్ధ శత్రువుల్లా వ్యవహరించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడ్‌లోనే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తన సతీమణి అన్నీ రాజాను బరిలోకి దించారు. ఉమ్మడిగా ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేసినా.. కేరళలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ – కమ్యూనిస్టుల మధ్యనే ఉంది కాబట్టి ఎన్నికల సమయంలో పరస్పర విమర్శలు, దూషణలు కూడా తప్పలేదు.

ఇక పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే.. అప్పటి వరకు కూటమిలో చురుకైన పాత్ర పోషించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.. తీరా ఎన్నికలు సమీపించేసరికి ప్లేటు ఫిరాయించారు. ఇంకా చెప్పాలంటే.. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్‌లోకి ప్రవేశించే సమయానికే కాంగ్రెస్ – టీఎంసీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలయ్యాక.. కాంగ్రెస్‌ కోరినన్ని సీట్లు ఇవ్వడం కుదరదంటూ మమత తేల్చి చెప్పారు. బెంగాల్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామంటూ ప్రకటన కూడా ఇచ్చేశారు. దాంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓవైపు, టీఎంసీ ఇంకోవైపు, ఈ రెండింటికి మధ్యన కాంగ్రెస్-కమ్యూనిస్టులు కలిసి మూడోవైపు అన్నట్టుగా ఎన్నికల్లో ముక్కోణపు పోటీకి తెరలేపి తలపడ్డాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ – టీఎంసీ మధ్యనే సాగిందన్నది అందరికీ తెలిసిన విషయమే. మమత బెనర్జీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లింలలో కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమి చీల్చే ప్రతి ఓటూ పరోక్షంగా బీజేపీకి ప్రయోజనం కల్గించేదే. రెండు పిల్లుల తగువులాట తీర్చిన కోతి లాభపడ్డ చందంగా ఎక్కడైనా మిత్రులే కానీ ఇక్కడ మిత్రులు కాదు అన్న రీతిలో విపక్ష కూటమి భాగస్వాముల మధ్య నెలకొన్న అనైక్యత ఎంతో కొంత బీజేపీకి లాభించింది.

విశ్వసనీయత లేని విపక్ష కూటమి

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే 6 దశలు పూర్తయి, చివరి విడత కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా ఎక్కడైనా స్నేహితులమే.. ఇక్కడ కాదు అన్నట్టుగా వ్యవహరించింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఈ పార్టీ.. దేశమంతటా కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంది.. కానీ పంజాబ్‌లో మాత్రం నై చెప్పి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించింది. ఢిల్లీ, గుజరాత్, గోవా, అస్సాం, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు.. పంజాబ్‌లో పరస్పరం తలపడుతున్నాయి.

ఢిల్లీలో ఏకంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా పొత్తుల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతికి ఓటేశారు. తద్వారా ఒక బలమైన సందేశాన్ని దేశమంతటా చాటాలని చూశారు. కానీ 6వ విడత పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఈ రెండు పార్టీలు మాటల యుద్ధం మొదలుపెట్టాయి. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ జలంధర్‌ అభ్యర్థి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. సోమవారం జలంధర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన చన్నీ, నిరుపేద మహిళలకు రూ.1,000 పంటలపై రూ.20,000 వార్షికాదాయం సహా పంజాబ్‌ ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలను అమలు చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్స్ విష సంస్కృతి నుంచి విముక్తి కల్పిస్తూ అవినీతిరహితంగా, పారదర్శకంగా పాలన అందించాల్సిన పార్టీ.. అక్రమ మైనింగులో కూరుకుని వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు.

ఈ తరహా పరిస్థితిని కమలదళం నేతలు ముందు నుంచీ ఊహిస్తూనే ఉన్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీయే ఉన్నప్పటికీ, బీజేపీ కంటే ఎక్కువ నష్టం కల్గిస్తున్నది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీయే. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పర భిన్నమైన సిద్ధాంతాలతో భిన్నమైన ఓటుబ్యాంకులు కలిగి ఉన్నాయి. అయితే సెక్యులర్ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓటుబ్యాంకును కాజేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది. ఢిల్లీలో, పంజాబ్‌లో అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించి మరీ అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తున్న ప్రతి చోటా కాంగ్రెస్ ఆ మేరకు నష్టపోతోంది. అంటే కాంగ్రెస్ ఓటుబ్యాంకులోకి ఆమ్ ఆద్మీ పార్టీ చొరబడి, ఆక్రమించుకుంటోందని అర్థమవుతోంది.

మొత్తంగా రోజుకో మాట, రాష్ట్రానికొక నీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయి. ఉమ్మడిగా మోదీని ఎదుర్కోవాలన్న ఉద్దేశాన్ని ప్రదర్శించడమే తప్ప ఆచరణలో అమలు చేయలేకపోయాయి. ఇదంతా ఒకెత్తయితే.. మోదీని దించడమే ఎజెండాగా జనాల్లోకి వెళ్లిన ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ మాత్రమే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగల్గుతోంది కానీ మిగతా పార్టీలకు ఒక ప్రత్యేక మేనిఫెస్టో అంటూ ఏమీ కనిపించలేదు. ఇలా విపక్ష కూటమి పార్టీల స్నేహం షరతులు వర్తిస్తాయి అని చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..