అగ్నిప్రమాదాలు.. మంటల్లో కలుస్తున్న ప్రాణాలు.. బాధ్యులెవరు? లోపం ఎక్కడ?

ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మేల్కునేవారిని "చేతులు కాలాక ఆకులు పట్టుకున్నచందంగా" అంటూ విమర్శిస్తూ ఉంటాం. నవజాత శిశువులు సహా పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్న అగ్నిప్రమాదాలను చూశాక.. ఈ సామెత కూడా పనికిరాదు అనిపిస్తోంది. ఒక ప్రమాదం జరిగి, కొందరి ప్రాణాలు బలిగొన్న తర్వాత స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కొన్నాళ్లపాటు హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్లీ షరా మామూలే అన్నట్టుగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం.

అగ్నిప్రమాదాలు.. మంటల్లో కలుస్తున్న ప్రాణాలు.. బాధ్యులెవరు? లోపం ఎక్కడ?
Fire Accidents
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Srikar T

Updated on: May 27, 2024 | 10:36 AM

ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మేల్కునేవారిని “చేతులు కాలాక ఆకులు పట్టుకున్నచందంగా” అంటూ విమర్శిస్తూ ఉంటాం. నవజాత శిశువులు సహా పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్న అగ్నిప్రమాదాలను చూశాక.. ఈ సామెత కూడా పనికిరాదు అనిపిస్తోంది. ఒక ప్రమాదం జరిగి, కొందరి ప్రాణాలు బలిగొన్న తర్వాత స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కొన్నాళ్లపాటు హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్లీ షరా మామూలే అన్నట్టుగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. శని, ఆదివారాల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో పసికూనలు సహా 40 మందికి పైగా సజీవ దహనమయ్యారు.

గుజరాత్ రాష్ట్రంలో రాజ్‌కోట్ పట్టణంలో టీఆర్పీ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలోనే ఏకంగా 33 మంది అగ్నికి ఆహుతవగా, ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు మరికొందరున్నారు. దేశ రాజధానిలో బెబీ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం హృదయవిదారకం. లోకం పోకడ తెలియని పసికందులు ప్రాణాలు కోల్పోయాయి. అగ్నిప్రమాదాల్లో మంటల్లో కాలిపోవడం వల్ల చనిపోయేవారి కంటే అక్కడ దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక చనిపోయేవారే ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుంచి తప్పించుకునేలా ఏర్పాట్లు లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది. ‘ఫైర్ సేఫ్టీ’ అనుమతులతో పనిలేకుండా దేశంలో ఏదైనా చేయవచ్చని జరుగుతున్న ప్రమాదాలను చూస్తే అర్థమవుతోంది. నిజానికి ఫైర్ సేఫ్టీ అంటే ఏంటి? ఆ నిబంధనలను అమలు చేయాల్సింది ఎవరు?

ఫైర్ సేఫ్టీ నిబంధనలు – మార్గదర్శకాలు..

భారత రాజ్యాంగంలోని 243 (W)వ అధికరణంలో 12వ షెడ్యూల్ ప్రకారం అగ్నిమాపక విభాగం స్థానిక సంస్థల పరిధిలో ఉంది. అంటే పట్టణాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో గ్రామ పంచాయితీలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతమాత్రాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేదని కాదు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా – 2016లో “ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ” పేరుతో మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని భవన నిర్మాణం, నిర్వహణ విషయంలో అమలు చేయాల్సి ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ మార్గదర్శకాలను ప్రచురించింది. అయితే ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఆదేశాలు కావు, కేవలం సిఫార్సులు మాత్రమే. ఆ సిఫార్సులను స్థానిక సంస్థలు తమ నిబంధనలు, నిమయావళిలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి తప్పనిసరి నిబంధనలుగా మారతాయి.

ఇవి కూడా చదవండి

వీటికి తోడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) కూడా కొన్ని ఫైర్ సేఫ్టీ నిబంధనలు, కనీస జాగ్రత్తలను ప్రతిపాదించింది. ముఖ్యంగా ఆస్పత్రుల వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఎలాంటి కనీస జాగ్రత్తలు ఉండాలో ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ప్రకారం అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక మార్గం నుంచి ప్రజలను తప్పించి బయటకు తీసుకొచ్చే ఏర్పాటు ఉండాలి. బయటకు కనిపించేలా మెట్లు ఉండాలి. అలాగే ఏదైనా అగ్నిప్రమాదం లేదా మరేదైనా విపత్తు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయంపై సిబ్బందికి తర్ఫీదునిచ్చేలా తరచుగా డ్రిల్స్ నిర్వహించాలి. సాధారణంగా ఉపయోగించే మెట్లు అగ్నిప్రమాద సమయంలో దట్టమైన పొగతో కమ్ముకుపోతాయి. వాటి ద్వారా కిందికి చేరేలోపే ఊపిరాడక చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. విదేశాల్లో లోహంతో చేసిన మెట్లు (External Staircase) బయటికి కనిపించేలా ఏర్పాటు చేస్తుంటారు. మంటలు, పొగలు వ్యాపించినప్పుడు ఈ మెట్లను వినియోగించడం ద్వారా పొగలో ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు.

కానీ ఇలాంటి ఏర్పాట్లు లేకుండా నిర్మాణాలు జరుపుకుంటున్న భవంతులు అనేకం ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) అధ్యయనం ప్రకారం భవంతుల నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం, నిబంధనలను సరిగా అమలు చేయకపోవడమే అగ్నిప్రమాదాలకు, వాటి కారణంగా సంభవిస్తున్న మరణాలకు కారణాలవుతున్నాయి. అక్రమంగా వెలుస్తున్న కాలనీలు, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా వాటిని చూసీచూడనట్టుగా వదిలేస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలు కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వంటి నగరాల్లో చెరువులు, వర్షపు నీటి నాళాలను ఆక్రమించి అడ్డగోలుగా కట్టిన అక్రమ నిర్మాణాలకు ఆ తర్వాత బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పేరుతో పెనాల్టీలు వసూలు చేసి అధికారిక ముద్ర వేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. మొత్తంగా శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామాల నుంచి పెరుగుతున్న వలసలు.. ఈ క్రమంలో ప్రణాళిక అన్నది లేకుండా విస్తరిస్తున్న నగరాలు వెరసి అగ్నిప్రమాదాలు లేదంటే చిన్నపాటి వర్షాలకే నీటమునిగే పరిస్థితులకు కారణాలుగా మారుతున్నాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి.?

దేశంలో జరుగుతున్న అగ్నిప్రమాదాలు కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ అనేక ప్రమాదాలు ఎంతో మందిని బలి తీసుకున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో 3,375 అగ్నిప్రమాద ఘటనలు నమోదయ్యాయి. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఘటనలే ఈ రికార్డుల్లోకి చేరతాయన్నది గమనార్హం. 2019లో జరిగిన అగ్నిప్రమాదాల్లో వాణిజ్య భవనాల్లో జరిగినవాటిలో 330 మంది ప్రాణాలు కోల్పోగా, నివాస భవనాల్లో జరిగిన ప్రమాదాల్లో 6,329 మంది చనిపోయారు. రాష్ట్రాలవారీగా గణాంకాలను విశ్లేషిస్తే.. దేశంలో నమోదయ్యే అగ్నిప్రమాద మరణాల్లో 30 శాతం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయి. అలాగే అత్యధిక అగ్నిప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో పాటు మానవ నిర్లక్ష్యం కారణమవుతున్నాయి.

మంటలు చెలరేగినప్పుడు ఎలా వ్యవహరించాలి?

  • అగ్నిప్రమాదం సంభవించగానే అక్కడున్నవారంతా గందరగోళానికి, తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరంగా మారుతుంది. వీలైనంత సంయమనం పాటిస్తూ.. రెస్క్యూ సిబ్బంది సూచనలు అమలు చేయాలి.
  • ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను ఎలా ఉపయోగించాలన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండడం మంచిది. అలాగే ఎక్కడైనా మంటలు చెలరేగినట్టు గుర్తించిన వెంటనే ఫైర్ అలార్మ్ యాక్టివేట్ చేయడం కూడా తెలుసుకుని ఉండాలి.
  • మంటల సమయంలో తమ విలువైన వస్తువులను కాపాడుకోవాలన్న తాపత్రయంలో తమ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అగ్నిప్రమాదం సంభవిస్తే ముందు ప్రాణాలు ముఖ్యం, ఆస్తులు కాదు అన్న స్పృహతో వ్యవహరించాలి.
  • ఇంట్లో మంటలకు ఆస్కారం కల్గించే పదార్థాలు, చెత్త లేకుండా చూసుకోవాలి. సాధారణంగా అవే మంటల తీవ్రతను పెంచి, క్షణాల్లో శరవేగంగా మంటలు వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తాయి.
  • మంటలు, పొగలు వ్యాపించిన సమయంలో ఎట్టిపరిస్థితుల్లో లిఫ్ట్ జోలికి వెళ్లకుండా మెట్ల మార్గం ద్వారానే కిందికి వచ్చేందుకు ప్రయత్నించాలి.
  • అగ్నిప్రమాదం జరిగిన చోట జనం ఎగబడి చూస్తూ అగ్నిమాపక సిబ్బందికి అడ్డుతగులుతూ ఉంటారు. ఇది సహాయ చర్యలకు విఘాతం కల్గిస్తుంది.
  • పొగ అలుముకున్న చోట నిలబడడం కంటే భూమ్మీద పడుకున్నట్టయితే పొగ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఊపిరి తీసుకోడానికి కొంతైనా ఆస్కారం ఉంటుంది.
  • విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగితే.. నీటిని ఉపయోగించకూడదు.
  • బహుళ అంతస్తుల నివాస భవనాల్లో తరచుగా ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్ల పనితీరును తనిఖీ చేస్తుండాలి. అలాగే తగినంత నీటి నిల్వ ఉండేలా చూసుకోవాలి. అలాగే భవంతిలో ఉండే అందరికీ సూచనలు ఇచ్చేందుకు వీలుగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి.

ఫైర్ సేఫ్టీలో సవాళ్లు..

జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు రూపొందించి అమలు చేయడంలో ఏకరూపత లేకపోవడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది. కొన్ని రాష్ట్రాలు ఆ నిబంధనలను అమలు చేస్తుంటే, మరికొన్ని రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. లేదంటే రాజకీయ కారణాలతో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో పాటు ఫైర్ సర్వీసెస్ విభాగానికి ఆధునిక పరికరాల సరఫరా లేకపోవడం కూడా అగ్నిప్రమాదాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కేవలం నీటిని వెదజల్లడం మినహా వేగంగా మంటలను ఆర్పే ఇతర ఆధునిక పద్ధతులపై అవగాహన, శిక్షణ కూడా దేశంలోని చాలా ఫైర్ సర్వీసెస్‌ విభాగాల్లో లేవు. వీటన్నింటికీ తోడు.. భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం మరో పెద్ద కారణం. నిజానికి ఫైర్ సర్వీసెస్ విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఉంటే తప్ప భవన నిర్మాణానికి తదుపరి అనుమతులు ఇవ్వకూడదు. కానీ NOC ఉన్నా, లేకున్నా అడిగిన లంచం ఇస్తే చాలు అనుమతులు మంజూరైపోతున్నాయి. వీటన్నింటికీ తోడు ఫైర్ సేఫ్టీ ఆడిట్ అన్నది ఎక్కడా జరగడం లేదు.

కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేవారు, ఆ మేరకు ఫైర్ సేఫ్టీ విషయంపై దృష్టి పెట్టడం లేదు. అది అదనపు ఖర్చుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత యావత్ వ్యాపార సామ్రాజ్యమే కుప్పకూలిపోయేంత ఆస్తి, ప్రాణ, పరువు నష్టాలకు గురవుతున్నారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. గేమింగ్ జోన్ యాజమాన్యం నిబంధనలు పాటించలేదు. స్వయంగా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోలేదు. పైగా చిన్న నిప్పు రవ్వ తగిలితే చాలు పెద్ద ప్రమాదాన్ని సృష్టించగల పెట్రోల్, డీజిల్ నిల్వ చేసి పెట్టుకున్నారు. టైర్లు, చెక్కతో చేసిన ఫర్నిచర్ ఎక్కువగా ఉండే గేమింగ్ జోన్‌ భవనాలను సిమెంట్, కాంక్రీట్‌తో నిర్మించకుండా చెక్క, పల్చని టిన్ రేకులతో నిర్మించారు. ఇవి కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచేందుకు, మంటలు శరవేగంగా వ్యాప్తి చెందేందుకు దోహదపడ్డాయి. వీటన్నింటికీ తోడు గేమింగ్ జోన్లోకి ప్రవేశించడానికి, బయటకు వచ్చేందుకు కూడా ఒకే మార్గం ఉంది. సాధారణంగా ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరుగా ఉండాలి. వాటికి అదనంగా ఫైర్ ఎగ్జిట్ కూడా ఉండాలి. ఇవేవీ లేకపోవడం వల్ల గేమింగ్ జోన్లోకి వెళ్లినవారు ప్రమాదం సంభింవించినప్పుడు బయటకు రాలేక, లోపల ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు.

ఒక దుర్ఘటన జరిగిన తర్వాత మేల్కొని కొన్నాళ్లు హడావుడి చేస్తున్న ప్రభుత్వాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా ప్రభుత్వంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం తీసుకొస్తూ.. అనుమతులు, NOCల విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలి. జాతీయస్థాయిలో రూపొందించిన మార్గదర్శకాలు, సిఫార్సుల ప్రకారం ప్రతి రాష్ట్రం, స్థానిక యంత్రాంగం నియమ, నిబంధనలు రూపొందించాలి. వాటిని కఠినంగా అమలు చేయాలి. బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించేలా చట్టాల్లో తగిన సవరణలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్లక్ష్యానికి తగిన మందు వేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..