Thorn bed: పదునైన ముళ్ల కంచెతో పడక.. దానిపై నాట్యం చేస్తూ.. వినూత్న ఆచారం..
ముళ్లే భయంకరంగా కనిపిస్తాయి… కానీ ఈ ఆలయంలో అవే దైవానుభూతికి మార్గం. తమిళనాడులోని పూంగావనం ముత్తుమారియమ్మన్ ఆలయంలో 63 ఏళ్ల నాగరాణి అమ్మవారు ఏడు అడుగుల ఎత్తైన ముళ్ల పడకపై కూర్చుని, నిలబడి, నాట్యం చేస్తూ భక్తులకు దైవ వాక్కు చెబుతారు. 49వ మండల పూజలో ఈ విభిన్న ఆచారాన్ని ప్రత్యక్షంగా చూడటానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

ఇప్పుడు మీకు విభిన్న ఆచారం ఉన్న ఓ టెంపుల్ గురించి తెలియజేయబోతున్నాం. తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని గ్రామంలో పూంగావనం ముత్తుమారియమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 63 ఏళ్ల నాగరాణి అమ్మవారు నిర్వాహకురాలిగా ఉన్నారు. ప్రతి మండల పూజ సమయంలో 48 రోజులు ఉపవాసం పాటిస్తూ ప్రజలకు దైవ వాక్కు చెప్పడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఏడు అడుగుల ఎత్తులో ఉడై ముళ్లు, కరువేలు చెట్టు ముళ్లు వంటి వాటితో ముళ్ల పడకను సిద్ధం చేశారు. నాగరాణి అమ్మవారు ఆ ముళ్ల పడకపై ఎక్కి కూర్చుని, నిలబడి, నాట్యం చేస్తూ భక్తులకు ఆశీర్వాదాలు ఇవ్వడం ఆమెకు అలవాటు.
ఈ సంవత్సరం 49వ మండల పూజా ఉత్సవంలో భాగంగా అమ్మవారికి శంఖాభిషేకం జరిగింది. అనంతరం అమ్మవారికి దీపారాధన నిర్వహించారు. దీనిని కొనసాగిస్తూ, మధ్యాహ్నం నాగరాణి అమ్మవారు ముళ్ల పడకపై కూర్చుని ఆశీర్వాదాలు అందించేందుకు ఆలయం ముందు ఉన్న మైదానంలో ఉడై ముళ్లు, ఇలంతై ముళ్లు, కత్తాళి ముళ్లు వంటి వివిధ రకాల ముళ్లతో 7 అడుగుల ఎత్తులో ముళ్ల పడకను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులు మేళతాళాలతో వేడుకని ప్రారభించారు.దీనిని అనుసరించి నాగరాణి అమ్మవారు ముళ్ల పడకపై కూర్చుని, నిలబడి, పడుకుని, నాట్యం చేస్తూ ఆగ్రహంగా భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ వారికీ దైవ వాక్కు చెప్పింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు భారీగా పాల్గొన్నారు.
