AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jallikattu: మరో 4 నెలల్లో ఎన్నికలు.. జల్లికట్టును క్యాష్ చేసుకోవాలనుకుంటున్న బీజేపీ

సంక్రాంతి పండుగతో పాటు దక్షిణాదిలో సందడి మొదలైంది. ఏపీలో కోళ్ల పందేలు సాగుతుండగా, తమిళనాట జల్లికట్టు పోటీలు హీట్ పెంచుతున్నాయి. శనివారం నుంచి తమిళనాడులో జల్లికట్టు పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి జల్లికట్టు కేవలం సంప్రదాయ క్రీడగానే కాకుండా, రాజకీయ రంగు కూడా పులుముకుంది.

Jallikattu: మరో 4 నెలల్లో ఎన్నికలు.. జల్లికట్టును క్యాష్ చేసుకోవాలనుకుంటున్న బీజేపీ
Jallikattu
Ch Murali
| Edited By: |

Updated on: Jan 02, 2026 | 6:24 PM

Share

వందల ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతున్న జల్లికట్టు తమిళనాడులో మాటల్లో చెప్పలేని భావోద్వేగాలతో ముడిపడిన క్రీడ. సుప్రీంకోర్టు ఒక దశలో నిషేధం విధించినా, ప్రజా ఉద్యమాల తర్వాత యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి జల్లికట్టు తమిళుల సెంటిమెంట్‌కు ప్రతీకగా మారింది. ఇలాంటి ఎమోషనల్ గేమ్‌ను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జల్లికట్టు పోటీలకు హాజరవ్వడం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్–డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు మరో నాలుగు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తోంది. తమిళనాడులో పెద్దగా పట్టు లేని బీజేపీ, ఈసారి ఏడీఎంకేతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. “తమిళుల వ్యతిరేకి” అనే ముద్రను తొలగించుకునేందుకు, సంక్రాంతి జల్లికట్టు పోటీలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకే సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగే కీలక జల్లికట్టు పోటీలు అలంగనల్లూర్, అవనియాపురం, పాలమేడు ప్రాంతాల వేదికగా బీజేపీ అగ్రనేతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు హాజరయ్యేలా టూర్ ప్లానింగ్ చేసినట్లు సమాచారం. తమిళ సంప్రదాయాలను గౌరవిస్తున్నామన్న మెసేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశంగా చెబుతున్నారు.

అయితే, కాంగ్రెస్ గతంలో అనుసరించిన ఈ ఫార్ములా బీజేపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. అయినప్పటికీ, జాతీయ పార్టీలు స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తున్నామన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక పోటీల విషయానికి వస్తే.. శనివారం నుంచి తమిళనాడులో ఈ సీజన్ తొలి జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. పుదుకోట్టై జిల్లా తట్టంకురుచి గ్రామంలో మొదటి జల్లికట్టు జరగనుండగా, ఇందుకోసం భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోటీల్లో పాల్గొనే యువకులు, ఎద్దులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అధికారులు అనుమతి ఇచ్చారు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై జిల్లా జల్లికట్టు పోటీలకూ సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 15న అవనియాపురం, 16న పాలమేడు, 17న అలంగనల్లూర్‌లో జల్లికట్టు పోటీలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సంక్రాంతి పండుగతో పాటు తమిళనాట జల్లికట్టు హీట్.. సంప్రదాయం, రాజకీయాలు కలిసి ఈసారి మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.