ఆ గ్రామాన్ని వణికిస్తున్న మాయరోగం, 27 రోజుల వ్యవధిలో 36 మంది మృతి.. కరోనా కాదట..!

Bihar Rare Disease: ఓ వైపు కరోనా మహమ్మారి...మరోవైపు మాయరోగం వణికిస్తోంది. మాయరోగం బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వరుస మరణాలతో ఆ గ్రామ ప్రజలు తమ ఇళ్లలోనే బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. 

ఆ గ్రామాన్ని వణికిస్తున్న మాయరోగం, 27 రోజుల వ్యవధిలో 36 మంది మృతి.. కరోనా కాదట..!
ప్రతీకాత్మక చిత్రం
Follow us

|

Updated on: May 19, 2021 | 3:10 PM

ఓ వైపు కరోనా మహమ్మారి…మరోవైపు మాయరోగం వారిని వణికిస్తోంది. ఈ మాయరోగం బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వరుస మరణాలతో ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.  బీహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలోని సక్రా బ్లాక్‌‌లోని సరమస్తపూర్ గ్రామంలో ప్రతి రోజూ ఒకరిద్దరు మృత్యువాతపడుతున్నారు. గత 27 రోజుల వ్యవధిలో ఆ గ్రామంలో ఒక్కరు కాదు…ఇద్దరు కాదు ఏకంగా 36 మంది మరణించారు. జ్వరం, దగ్గు వ్యాధితో బాధపడుతూ వీరందరూ హఠాన్మరణం చెందారు. కరోనా కారణంగా వీరు మరణించినట్లు తొలుత స్థానికులు భావించగా…జిల్లా ఆరోగ్య అధికారులు మాత్రం వీరి మరణానికి కరోనా కారణంకాదని చెబుతున్నారు.

వరుస మరణాల నేపథ్యంలో ఆ గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణభయంతో ఇంటి గడప దాటేందుకు సాహసించడం లేదు. ఇతర పనులు సైతం మానుకుని రోజంతా తమతమ ఇళ్లలోనే గడుపుతున్నారు. ఎవరూ ఇంటి భయటకు రాకపోవడంతో రోజంతా ఆ గ్రామం నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది.

నెల కంటే తక్కువ రోజుల వ్యవధిలో 36 మంది చనిపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు అస్వస్థతతో బాధపడుతుండటంతో ముందుముందు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులను తెలిపినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది కేవలం దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుల్లో కొందరు వృద్ధాప్య అనారోగ్య కారణాలతో చనిపోయినవారు కూడా ఉన్నట్లు గ్రామ సర్పంచ్ ప్రమోద్ కుమార్ గుప్తా ఏఎన్ఐకి తెలిపారు. అయితే చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం కారణాలతోనే చనిపోయినట్లు చెప్పారు.

గ్రామంలో ఒక్కసారిగా మరణాల సంఖ్య పెరగడంపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరణాలకు కారణాలు ఏంటో నిర్థారించాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఆ మేరకు గ్రామంలో కొందరు బాధితుల నుంచి శ్యాంపిల్స్ సేకరించి పరీక్షించినట్లు తెలిపారు.  దీనిపై స్పందించిన సక్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఇంఛార్జి సంజీవ్ కుమార్…ఆ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో చాలా మంది మరణించినట్లు ధృవీకరించారు. అయితే వీరందరు కరోనాతో మృతి చెందలేదని చెప్పుకొచ్చారు. ఇతర వ్యాధుల కారణంగా వారు మరణిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఏ వ్యాధి కారణంగా వారు మరణించారో మాత్రం వెల్లడించలేదు. వరుస మరణాలపై జిల్లా పై అధికారులు ఆరా తీస్తున్నారు.

గ్రామస్థుల మరణాలకు కరోనా కారణమైతే తగిన పరీక్షలు చేసి చికిత్స కల్పించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. కరోనా కారణం కానిపక్షంలో గ్రామస్థుల మరణాలకు కారణమైన ఆ మాయరోగం ఏంటో గుర్తించి, తమను రక్షించాలని కోరుతున్నారు.

బీహార్‌లో కోవిడ్ మరణమృదంగం మోగిస్తోంది. మంగళవారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో ఏకంగా 111 మంది కరోనా కాటుకు మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4 వేల పైకి చేరింది.

ఇది కూడా చదవండి..గేటు దాటితే అంతే.. మా ఊరికి రావద్దు.. మేము బయటకు రాము.. శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు..!

నవ్వితే శరీరంలో ఆక్సిజన్ పెరుగుతుందా..? లాఫింగ్ థెరపీ వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..!