Doctors: కొవిడ్ తో మరణిస్తున్న వైద్యులు.. ఇప్పటివరకు 1000కి పైగా మరణాలు.. రెండో వేవ్ రెండు నెలల్లో పెరిగిన మరణాలు!

Doctors: ప్రపంచమంతా భయంతో దాక్కోవలసి వచ్చింది. కానీ, వారు ఆ భయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కోరల్ చాస్తున్న కరోనానుంచి కాపాడుకోవడానికి ఎవరికి వారు ఇంట్లోనే బందీలుగా బిక్కు బిక్కు మంటూ గడుపుతుంటే..

Doctors: కొవిడ్ తో మరణిస్తున్న వైద్యులు.. ఇప్పటివరకు 1000కి పైగా మరణాలు.. రెండో వేవ్ రెండు నెలల్లో పెరిగిన మరణాలు!
Doctors
Follow us
KVD Varma

|

Updated on: May 19, 2021 | 2:33 PM

Doctors: ప్రపంచమంతా భయంతో దాక్కోవలసి వచ్చింది. కానీ, వారు ఆ భయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కోరల్ చాస్తున్న కరోనానుంచి కాపాడుకోవడానికి ఎవరికి వారు ఇంట్లోనే బందీలుగా బిక్కు బిక్కు మంటూ గడుపుతుంటే.. వారు మాత్రం ఆ మహమ్మారి బారిన పడి బ్రతుకు కోసం బాధపడుతున్న వారికి సేవలు చేశారు. వారు కరోనాను లెక్కచేయలేదు..తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు.. నిరంతరం కొవిడ్ రోగులకు చికిత్స అందించారు.. అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేవుడు ఎవరో తెలియకపోయినా కరోనా బాధితుల పాలిటి ప్రత్యక్ష దైవాలు మాత్రం వైద్యులే. వైద్యో నారాయనో హరీ అనే నానుడిని ప్రత్యక్షం నిజం చేసి చూపించారు. వారు అలా సేవలు చేయడానికి వారికేమీ అన్నీ సమకూరి లేవు.

ఒకవైపు రోగులకు చికిత్స నందిస్తూ పోరాటం.. మరోవైపు బెడ్లు తక్కువగా ఉండటంతో.. ఆసుపత్రుల గేట్ల వద్ద కొత్త రోగులకు బెడ్లు కేటాయింపులో సంఘర్షణ ఎదుర్కుంటూ.. తమ కళ్ళ ముందే ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తూ వారికోసం ప్రత్యామ్నాయాలను వెదకటానికి పరితపిస్తూ ఉన్నారు. ఇన్ని చేసి.. ఇంత మందిని బ్రతికించడం కోసం పరితపిస్తున్న వారినీ కరోనా భూతం వదల లేదు. వారిలో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

కరోనా పై నిరంతరం పోరాడుతూ.. కొవిడ్ బారిన పడి మరణించిన వైద్యుల సంఖ్య పెరుగుతోందని ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ చెబుతోంది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా వైద్యులు కరోనా సోకి మృతి చెందారని చెబుతున్నారు. ఇతర వైద్య సిబ్బంది లెక్కలకు మించి మృత్యువాత పడినట్టు అసోసియేషన్ పేర్కొంది. కరోనా చికిత్సలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు వైద్యులు, సిబ్బంది.ఎక్కడన్నా పేషెంట్లు మరణిస్తే.. వారి కుటుంబీకులు చేతిలో వైద్యులు దాడులకు గురవుతున్న సందర్భాలు ఎన్నో. కొవిడ్ పీడితులకు చికిత్స చేస్తూ.. తీరికలేకుండా వైద్యులు పని చేస్తున్నారు. కొవిడ్ సోకి మరణించిన వైద్యులకు సంబంధించి ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్(ఐఎంఏ) వెలువరించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.

  • 2020లో కొవిడ్ సోకి మరణించిన వైద్యులు 748.
  • 2021లో ఇప్పటివరకు మరణించిన వైద్యులు 269. ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్న ఐఎంఏ
  • డాక్టర్ల అసోసియేషన్ లో నమోదైన వైద్యుల సంఖ్య 3.5 లక్షలు.
  • దేశంలో 12 లక్షలకుపైగా వైద్యులున్నారు.
  • డాక్టర్ల అసోసియేషన్లో నమోదు చేసుకోని వైద్యుల మరణాలపై అంచనా వేయడం కష్టమని ఐఎంఏ చెబుతోంది.
  • కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న వైద్యులు మరణించడంతో అనాథలైన కుటుంబాల పరిస్థితిని అంచనా వేయడం కష్టం. వైద్యుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరిన ఐఎంఏ.
  • ఇప్పటివరకు దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు పూర్తి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఆరోగ్య శాఖ సిబ్బంది 66 శాతం.

ఈ నెల17తేదీన ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వాక్సిన్లతో వైద్యులకు భద్రత కలిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 90శాతంమంది వైద్యులు, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బందికి తొలి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని ప్రకటించారు. కాగా అదే రోజు (17న) ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కెకె అగర్వాల్ కొవిడ్ సోకి మృతి చెందారు.

కొవిడ్ వేళ వైద్యుల కొరత..

తక్కువ సిబ్బంది, వైద్యుల కొరతను ఎదుర్కొంటున్న భారత్. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డబ్ల్యుహెచ్ఓ గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతీ 10వేలమంది ప్రజలకు ఉన్నక్రియాశీల ఆరోగ్య సిబ్బంది(వైద్యులు, నర్సులు, మంత్రసానులు) సంఖ్య 17 మాత్రమే. డబ్ల్యుహెచ్ఓ ప్రకారం ఈ నిష్ఫత్తి 10,000మందికి 44.5గా ఉండాలి. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది 40 శాతం ఉండగా// అదే పట్టణాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది 60 శాతం. దేశంలో 70 శాతం ప్రజలు గ్రామాల్లో ఉంటున్నారు. ఈలెక్కన గ్రామాల్లో ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి ఉన్న నిష్పత్తిలో భారీ అంతరం. కొవిడ్ నేపథ్యంలో ఎంబీబీఎస్ చదువుతున్న ఫైనలియర్ విద్యార్థులను కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ బృందంలో చేరాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ఐఎంఏ ప్రకారం సెకండ్ వేవ్ లో మృతి చెందిన వైద్యుల సంఖ్యా రాష్ట్రాల వారీగా ఇలా ఉన్నాయి.

  • బీహార్ లో అత్యధికంగా.. 78 మంది వైద్యులు మృతి చెందారు.
  • ఆంధ్ర ప్రదేశ్ …22
  • తెలంగాణ..19
  • అస్సాం…3
  • చత్తీస్ గఢ్.. 3
  • ఢిల్లీలో.. 28
  • గుజరాత్… 2
  • గోవా.. 1
  • హర్యానా.. 2
  • జమ్ము, కశ్మీర్.. 3
  • కర్నాటక….8
  • కేరళ..2
  • మధ్యప్రదేశ్..5
  • మహారాష్ట్ర 14
  • ఒడిశా…10
  • పాండిచ్చేరి…1
  • తమిళనాడు..11
  • త్రిపుర 2.
  • యూపీలో.. 37
  • ఉత్తరాఖండ్..2
  • పశ్చిమబెంగాల్..14
  • వివరాలు అందనివారి సంఖ్య..2 మొత్తం…269

Also Read: India Corona Cases: దేశంలో కొత్త‌గా 2,67,334 క‌రోనా పాజిటివ్ కేసులు.. రికార్డు స్థాయిలో మ‌ర‌ణాలు..

Home Quarantine Rules: కాలు బయటపెడితే రూ. 2000 ఫైన్… కొత్త రూల్ తీసుకొచ్చిన కార్పోరేషన్..