Harsh Vardhan: గ్రామీణ ప్రాంతంలో కరోనా పరీక్షలు పెంచుతాం.. దేశవ్యాప్తంగా రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులుః హర్షవర్ధన్
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బుధవారం మంత్రి కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు లేకపోవడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. రాబోయే రోజులు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో దేశంలో 20లక్షలకుపైగా నమూనాలను మంగళవారం పరీక్షించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. త్వరలోనే రోజు 25లక్షలు టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో రోజువారీ పరీక్షలు పెంచనున్నట్లు ప్రకటించారు.
Delhi: Union Health Minister Dr Harsh Vardhan inspects new Oxygen Concentrator Plant at Safdarjung Hospital. #COVID19 pic.twitter.com/1UucAdzGqj
— ANI (@ANI) May 19, 2021
ఇదిలావుంటే.. గతేడాదిలో కరోనా దేశంలో పట్టణాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందగా రెండోవేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా వైరస్ సోకుతోంది. గడిచిన వారం రోజులుగా దేశంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. బుధవారం కొత్త కేసులు 2,67,334 కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు మూడు లక్షల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4,529 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. నిన్న ఒకే రోజు 20,08,296 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా 32,03,01,177 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.
మరోవైపు, కేంద్రప్రభుత్వ వైరస్ కట్టడికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 18 కోట్ల 58 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. 18,58,09,302 మంది టీకాలతో లబ్ధి పొందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 13,12,155 మంది టీకాలు వేశారు.