గేటు దాటితే అంతే.. మా ఊరికి రావద్దు.. మేము బయటకు రాము.. శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు..!

కరోనా మహమ్మారిపై పోరుకు పల్లెలు కదులుతున్నాయి. స్వీయ నియంత్రణయే శ్రీరామరక్షగా భావిస్తున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛందంగా కట్టుబాట్లు అమలు చేస్తున్నాయి.

గేటు దాటితే అంతే.. మా ఊరికి రావద్దు.. మేము బయటకు రాము.. శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు..!
Fishermen Variety Covid Restrictions In The Village
Follow us
Balaraju Goud

|

Updated on: May 19, 2021 | 2:57 PM

Fishermen Variety Covid Restrictions: కరోనా మహమ్మారిపై పోరుకు పల్లెలు కదులుతున్నాయి. స్వీయ నియంత్రణయే శ్రీరామరక్షగా భావిస్తున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛందంగా కట్టుబాట్లు అమలు చేస్తున్నాయి. వైరస్‌ రెండో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు గ్రామాలు ప్రభుత్వ ఆంక్షలతో పాటు స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగుతుండగా, మరికొన్ని చోట్ల గ్రామ అభివృద్ధి కమిటీలు, సంఘాలు, కులపెద్దలు కట్టుబాట్లు విధిస్తున్నారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. తమ ఊరిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అలాగే గ్రామస్థులు ఎవరూ బయటి గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు.

జనసంచారాన్ని నివారించి.. కరోనా గొలుసును తెంచేందుకు పల్లెలు కంకణం కట్టుకుంటున్నాయి. కనీసం 14 రోజుల నియంత్రణ పాటిస్తే వైరస్‌ బారి నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నాయి. ఇదేక్రమంలో ప్రకాశంజిల్లా కొత్తపట్నంలోని పల్లెపాలెం గ్రామ పెద్దలు వినూత్న రీతిలో కట్టడిని అమల్లోకి తెచ్చారు. గ్రామంలో పలువురు వైరస్‌ బారిన పడుతుండటం, ఇరుగు పొరుగు గ్రామాల వారు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో తమ గ్రామంలోకి బయటివ్యక్తులు రాకుండా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి కాపలా ఉంచారు.

సముద్రతీరంలో ఉన్న కొత్తపట్నం పల్లెపాలెంలో చేపల కోసం పలు గ్రామాల ప్రజలు నిత్యం వచ్చిపోతుంటారు. దీంతో కేసులు ప్రబలకుండా ఈ కట్టడి విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏఫ్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటఫై ప్రభుత్వం నిషేధం విధించడంతో పనులు లేక మత్య్సకారులు కొంతమంది చుట్టుపక్కల గ్రామాలకు పనులకోసం వెళుతున్నారు. అక్కడ పనిచేసే క్రమంలో కరోనా సోకే ప్రమాదం ఉందని భావించిన గ్రామ పెద్దలు పల్లెపాలెంకు చెందిన మత్స్యకారులతో పాటు ఇతర గ్రామస్థులు ఎవరూ పక్క గ్రామాలకు పనుల నిమిత్తం వెళ్లకూడదని చాటింపు వేయించారు. ఈ కట్టుబాటును మత్స్యకార కాపుపెద్దలతో పాటు ఇతర గ్రామ పెద్దలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.

పల్లెపాలెం గ్రామ కాపులు, పెద్దల కట్టుబాటులో భాగంగా గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి శివారులో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్ట్‌ దగ్గర కొంతమంది గ్రామస్తులను కాపలా ఉంచారు. ఇతర గ్రామాల నుంచి వచ్చేవారిని అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు. అలాగే గ్రామానికి చెందిన వారు ఎవరు బయటకు వెళ్లాలన్న అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఊరి శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ దగ్గర కాపలా కాస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ఊరిబాగుకోసం, కరోనా కట్టడికోసం కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నారు.

కాగా, గ్రామస్థుల క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న కట్టబాట్లు స్థానికుల సైతం సమర్ధించుకుంటున్నారు. ప్రజారోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

Read Also…  మధురమైన గాత్రం.. గమ్మత్తైన గమకాలతో పాటకు ప్రాణం పోస్తాడు.. మ్యూజిక్ లవర్స్‏కు మోస్ట్ వాంటెడ్ సింగర్‏గా సిధ్ శ్రీరామ్