AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Boycott: కులాంతర వివాహం చేసుకున్నారనీ.. మూగ- చెవిటి దంపతుల గ్రామ బహిష్కరణ!

నోరు తెరిచి ఒక్కమాట కూడా మాట్లాడలేరు. ఎదుటి వాళ్లు చెప్పేది వినలేరు. కానీ వాళ్ల మనసులు మాట్లాడుకున్నాయి. ఆ ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. తమ ప్రేమను మూడు ముళ్ల బంధంతో పండించుకోవాలనుకున్నారు. కులం అడ్డొచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. పెద్దలను ఎదిరించి, ఊరి కట్టుబాట్లను కాదని పెళ్లి చేసుకున్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయినా వారి ప్రేమను ఆ గ్రామం నిరాకరించింది. ఊరి నుంచి నిర్ధాక్షిణ్యంగా వెలివేసింది. ఈ ఘటన కర్ణాటకలోని..

Social Boycott: కులాంతర వివాహం చేసుకున్నారనీ.. మూగ- చెవిటి దంపతుల గ్రామ బహిష్కరణ!
Deaf And Mute Couple
Srilakshmi C
|

Updated on: Sep 29, 2023 | 7:11 AM

Share

చిత్రదుర్గ, సెప్టెంబర్‌ 29: నోరు తెరిచి ఒక్కమాట కూడా మాట్లాడలేరు. ఎదుటి వాళ్లు చెప్పేది వినలేరు. కానీ వాళ్ల మనసులు మాట్లాడుకున్నాయి. ఆ ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. తమ ప్రేమను మూడు ముళ్ల బంధంతో పండించుకోవాలనుకున్నారు. కులం అడ్డొచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. పెద్దలను ఎదిరించి, ఊరి కట్టుబాట్లను కాదని పెళ్లి చేసుకున్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయినా వారి ప్రేమను ఆ గ్రామం నిరాకరించింది. ఊరి నుంచి నిర్ధాక్షిణ్యంగా వెలివేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా నాయకనహట్టి ఠాణా పరిధిలోని ఎన్‌ దేవరహళ్లిలో బుధవారం (సెప్టెంబర్ 27) వెలుగు చూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ఎన్‌.దేవరహళ్లి చెందిన సావిత్రమ్మ అనే యువతి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మణికంఠ అనే యువకుడిని మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇద్దరూ పుట్టుకతోనే మూగ, చెవిటి వారు. 2021లో బెంగళూరులోని ఓ ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరూ కలిశారు. వివాహం చేసుకుని ఆమె మణికంఠను గ్రామానికి తీసుకెళ్లగా, గ్రామ ప్రజలు అభ్యంతరం చెప్పారు. కులాంతర వివాహం కూడదని రూ.30 వేల జరిమానా కూడా విధించారు. పెద్దలు అంగీకరించకపోవడంతో వారిద్దరూ మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సావిత్రమ్మ గర్భందాల్చింది.

ఇటీవలే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన ఆమె నెల రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. సావిత్రమ్మ తిరిగివచ్చిన విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు బుధవారం పంచాయితీ పెట్టి ఊరి నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించారు. దంపతులిద్దరినీ ఊరి నుంచి పంపించకపోతే సావిత్రమ్మ తల్లిదండ్రులను ఊరి నుంచి శాశ్వతంగా వెలివేస్తామని బెదిరించారు. దీంతో ఆ ఇద్దరూ సాయంత్రం సమీప పట్టణం చెళ్లకెరె చేరుకుని అక్కడ ఓ బధిరుల పాఠశాలలో తలదాచుకున్నారు. అక్కడి ఉద్యోగులు వారి పరిస్థితిని తెలుసుకుని మహిళా పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి ఘటనపై తహసీల్దార్‌కు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

తహసీల్దార్‌ రెహాన్‌ పాషాకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి చిత్రదుర్గలోని స్వాధార (సంరక్షణ) కేంద్రానికి తరలించి, అక్కడ ఆశ్రయం కల్పించారు. ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తహసీల్దార్ రహన్ పాషా పునరావాస కేంద్రానికి చేరుకుని ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని దంపతులకు హామీ ఇచ్చారు.ఈ ఘటనపై సంఘం సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు గ్రామంలో అవగాహన ప్రచారం చేపట్టాలని యంత్రాంగం ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.