IAS Dog Walk Row: ‘కుక్క వాకింగ్’తో ఐఏఎస్ కొలువుకు ఎసరు.. అథ్లెట్లను స్టేడియం బయటకు గెంటిన వివాదంలో వేటు!
ఆవిడ ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారిని. తన పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లేందుకు చేసిన ఒక్కపని ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. జాతీయస్థాయి క్రీడాకారులు సాధన చేసే ప్రభుత్వ స్టేడియంలో తన కుక్క వాకింగ్ కోసం అథ్లెట్లను స్టేడియం బయటకు పంపడం వివాదంగా మారింది. గతేడాది చోటుచేసుకున్న ఈ వివాదంలో సదరు మహిళా ఐఏఎస్ అధికారినిపై తాజాగా వేటు పడింది. స్టేడియం నుంచి అథ్లెట్లను బయటికి గెంటిన ఐఏఎస్ అధికారిణిని..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఆవిడ ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారిని. తన పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లేందుకు చేసిన ఒక్కపని ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. జాతీయస్థాయి క్రీడాకారులు సాధన చేసే ప్రభుత్వ స్టేడియంలో తన కుక్క వాకింగ్ కోసం అథ్లెట్లను స్టేడియం బయటకు పంపడం వివాదంగా మారింది. గతేడాది చోటుచేసుకున్న ఈ వివాదంలో సదరు మహిళా ఐఏఎస్ అధికారినిపై తాజాగా వేటు పడింది. స్టేడియం నుంచి అథ్లెట్లను బయటికి గెంటిన ఐఏఎస్ అధికారిణిని బలవంతపు రిటైర్మెంటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. వివరాల్లోకెళ్తే..
1994 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ క్యాడర్ అధికారిణి రింకూ దుగ్గా (54) ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో స్వదేశీ వ్యవహారాల ప్రన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గతేడాది ఆమె, ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్‌లు ఢిల్లీలోని త్యాగరాజ్ జాతీయ స్టేడియంలో తమ కుక్కను వాకింగ్ తీసుకెళ్లడానికి వెళ్లేవారు. అందుకు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న అథ్లెట్లను స్టేడియం నుంచి బయటికి పంపేవారు. సాధారణంగా సాయంత్రం 7 గంటల వరకూ స్టేడియంలో అథ్లెట్లు, శిక్షకులతో బిజీగా ఉంటుంది. అయితే ఈ ఐఏఎస్ జంట తమ కుక్క వాకింగ్ కోసమని స్టేడియంను ముందుగానే ఖాళీ చేయించేవారు. అనంతరం తాపీగా వాకింగ్ చేసేవారు. ఈ ఐఏఎస్ జంట వ్యవహారంపై పలు వార్తా కథనాలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అప్పట్లో WhereWillTheDogGo అనే హ్యష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అనంతరం భార్యభర్తలిరువురినీ గతేడాది మే నెలలో ప్రభుత్వం వేరు వేరు చోట్లకు బదిలీ చేసింది.
ఈ ఆరోపణలు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రింకూను బలవంతంగా ఉద్యోగం నుంచి సాగనంపింది. ఈ మేరకు పదవీ విరమణ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించినట్లు అధికారవర్గాలు బుధవారం (సెప్టెంబర్ 27) తెలిపాయి. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల్లోని 1972లోని 48 నిబంధన కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా ముందస్తుగా పదవీ విరమణ చేయించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందనేది ఈ నిబంధన సారాంశం. రింకూ ట్రాక్ రికార్డు ఆధారంగా ఆమెను పదవీవిరమణ చేయించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.