Lockdown: దేశవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక పరిస్థితిమేంటి..?
దేశవ్యాప్తంగా కరోనా రాకాసి విజృంభణ రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. మరోసారి మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
Strict Lockdown in India: దేశవ్యాప్తంగా కరోనా రాకాసి విజృంభణ రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. మరోసారి మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల్లోనూ అదే ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 3,449 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. గురువారం నాటి బులెటిన్ ప్రకారం దేశంలో 4,12,262 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,980 మంది మరణించారు. రోజువారీ మరణాల్లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మళ్లీ మొదటికొస్తాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. కేంద్రం మాత్రం లాక్‌డౌన్ విధించడంలేదని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే సంకేతాలు ఇచ్చారు. దీనితో ఒక్కో రాష్ట్రం.. లాక్‌డౌన్‌లోకి జారిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పాక్షికంగా ఆంక్షలు అమలు చేస్తుంటే, మరి కొన్ని సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.
మరోవైపు, దేశవ్యాప్తంగా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బెడ్లు సరిపోక తిప్పిపంపిచాల్సిన పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. శ్మశానవాటికలు చనిపోయినవారి అంత్యక్రియలు నిర్వహించేందుకు క్యూలో ఉండాల్సిన వస్తుంది. కరోనావైరస్ కేసులు ఇంకా రికార్డు స్థాయికి చేరుకుంటున్న తరుణంలో రాష్ట్రాలు విధించిన ఆంక్షలు సరిపోతాయా అనే చర్చల మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కఠినమైన లాక్‌డౌన్ విధించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. చాలా మంది వైద్య నిపుణులు, ప్రతిపక్ష నాయకులు, కొంతమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం వైరస్ కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ మాత్రమే సరియైన నిర్ణయం అని సూచిస్తున్నారు.
గత ఏడాది కరోనా మొదట దశ కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు నెలల కఠినమైన లాక్‌డౌన్ విధించారు. ఇది కోట్లాది మంది వలస కార్మికులు ఉపాధి వదిలి గ్రామాలకు వెళ్లిపోయారు. ఈ నిర్ణయం వైరస్ నియంత్రణకు ఎంతోకొంత సహాయపడిందని నిపుణులు అంటున్నారు. అ సమయంలో సౌకర్యాలు లేనప్పటికీ దాని నుంచి తేరుకోవడానికి ఉపయోగపడిందని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే, ఈసారి అసదుపాయాలు ఉన్నప్పటికీ వైరస్ రూపాంతరం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీన్ని అరికట్టాలంటే లాక్‌డౌన్ ఒక్కటే ఉత్తమ మార్గమని వైద్య నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఇదిలావుంటే, గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 23% కుదించుకుపోయింది. ఆంక్షలు సడలించడంతో భారత ఆర్థిక వ్యవస్థ కాస్త కోలుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రొజెక్షన్ ఏప్రిల్ నుండి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12.5% వృద్ధిని సాధించింది, మరోసారి కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మళ్లీ ఆర్థిక వ్యవస్త నష్టపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పై మోదీ విధానానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త వినీతా బాల్ సహా కొంతమంది నిపుణులు మద్దతు ఇస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వేర్వేరు అవసరాలు ఉన్నాయని, ఏదైనా విధానం పనిచేయడానికి స్థానిక ప్రత్యేకతలు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు.చాలా సందర్భాల్లో, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, నైపుణ్యం ఉన్న ప్రదేశాలలో, ఒక రాష్ట్రం లేదా ఒక జిల్లా స్థాయిలో స్థానికీకరించిన ఆంక్షలు అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి మంచి మార్గం అని బాల్ చెప్పారు. “కేంద్రీకృత తప్పనిసరి లాక్‌డౌన్ సరికాదు,” అని ఆమె చెప్పారు.
కాగా, ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. అటు జమ్మూ, కశ్మీర్, గుజరాత్ , పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య భారతంలో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతోంది. చాలా పట్టణాలలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. సభలు, సమావేశాలను బ్యాన్ చేశారు. గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం అక్కడ. మాస్కులు ధరించనివారికి జరిమానా విధిస్తున్నారు. ఇవాళ మరోసారి వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రెండువారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు. ఓ రకంగా ఇది మినీ లాక్‌డౌన్ కిందే లెక్క! తెలంగాణలో అయితే నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. మొత్తం మీద దేశంలో లాక్‌డౌన్ పరిస్థితులే ఉన్నాయి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెడితే కరోనా కంట్రోల్ కావచ్చునేమో కానీ, ఆర్ధిక వ్యవస్థ మాత్రం దెబ్బతింటుంది.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నది.