Telangana: కోట్ల ఆస్తి ఉన్న పేదపిల్లలతోనే కలిసి భోజనం.. ఈ వ్యక్తి గురించి తెలిస్తే ఎవరైనా సలాం కొట్టాల్సిందే!
ఏ స్వార్థం లేని మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యపోవడంలో తప్పు లేదు. నేను సంపాదించుకున్నానా.. నేను తిన్నానా.. నేను సంతోషంగా ఉన్నానా అని తప్ప పక్కవాళ్ల ఆకలి గురించి ఆలోచించే మనుషుల్లో ఎక్కడ ఉంటారు చెప్పండి? పది మంది కడుపు నింపి తాను సంతోషంగా ఉండాలంటే దానికి ఎంతో గొప్ప మనసు కావాలి. ఖచ్చితంగా మీరూ ఇదే మాట అంటారు మహ్మద్ ఖురేషి అనే మహానుభావుడి గురించి తెలిస్తే.. అతను ఎవరో.. ఎందుకు ఇలా చేస్తున్నాడో.. అసలేంటి ఇతని కథ అనేది తెలుసుకుందాం రండి.
హైదరాబాద్ నగరం పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతంలో మహ్మద్ ఖురేషి నివసిస్తున్నాడు. ఖురేషి పెద్ద వ్యాపారస్తుడు.. వ్యాపారంలో బాగా కష్టపడి బాగానే సంపాదించాడు. అతని కుటుంబంలోని ఎక్కువ శాతం మంది బంధువులు విదేశాల్లో ఉంటున్నారు. సంపాదించిన దాంట్లో బాగా లగ్జరీగా బతికే అవకాశం ఉన్నప్పటికీ, దేవుడు కోట్లాది రూపాయలు ఇచ్చినప్పటికీ బస్తీల్లో గల్లీలో ఉన్న పేద పిల్లలతో కలిసి భోజనం చేయడమే ఇతనికి బాగా అలవాటు. సంపాదించిన ఆస్తి అంతా అనుభవించాలి.. పెద్ద పెద్ద కార్లలో తిరగాలి.. చుట్టూ ఉన్నవాళ్లని శాసించాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఎంత డబ్బు ఉన్నా.. ఏం చేయాలి.. మానవసేవే మాధవసేవ అంటున్నాడు ఈ ఖురేషి. మన కోసం కాకుండా పది మంది కోసం బతకడంలోనే సంతోషం ఉందని అంటున్నాడు. ఇంత సంపాదించి కూడా గర్వం అనేదే లేకుండా పేదవాళ్లకు పెట్టాలనే ఆలోచన ఉన్నందుకు మనందరం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఆస్పత్రుల వద్ద కష్టాల్లో ఉన్న పేదవాళ్లను ఆదుకోవడం, వాళ్లకి భోజనాలు పెట్టించడం, ఇష్టానుసారంగా పేదలకు డబ్బులు పంచడం ఇతనికి బాగా అలవాటు. అవసరంలో ఉన్నవాళ్లకు బియ్యం బస్తాలు అందించడం, డబ్బులు ఇవ్వడం చేస్తూ ఉంటాడు. మూడు పూటలా నాన్ వెజ్ వంటకాలతో పిల్లలకు, పేదవాళ్లకు భోజనాలు పెట్టించి తను కూడా కలిసి వాళ్లతో భోజనం చేస్తాడు. పసి పిల్లలతో కలిసి ఆడతాడు. వాళ్ల ముఖాల్లో నవ్వులు చూస్తాడు. పిల్లలతో పాటు తాను ఓ చిన్న పిల్లాడు అయిపోతాడు. పిల్లలు కూడా ఖురేషి చూపించే ప్రేమకు అంతే ప్రేమను అందిస్తారు. ఖురేషి అంటే చాలా ఇష్టం చూపిస్తారు. ఇతని ఇంటికి ఎవరు ఎప్పుడు వెళ్లినా అరబ్, హైదరాబాద్ నాన్ వెజ్ ప్రత్యేక వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేస్తుంటాడు. ఎప్పుడూ నాన్ వెజ్ భోజనాలతో ఇతని ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఒక మనిషి ఆకలి తీర్చడంలో ఉండే సంతృప్తి ఇంకా ఎందులో దొరుకుతుంది చెప్పండి. తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వారి గురించి వెతికి, వారి కడుపు నింపే ప్రయత్నాలు చేస్తే తనకు ఎంతో సంతోషం కలుగుతుందని మహ్మద్ ఖురేషి చెబుతున్నాడు. ఇలాంటి గొప్ప పనులు చేస్తూ.. పది మంది ఆకలి తీరుస్తూ కడుపు నింపుతున్న మహోన్నత వ్యక్తి గురించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి