HYDRA: మళ్లీ యాక్షన్‌లోకి హైడ్రా.. అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనం కూల్చివేత
మొన్నటిదాకా కాస్త సైలెంట్‌గా ఉన్న హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి. నోటీసుల పంపినా సదరు బిల్డింగ్ యజమాని లెక్క చేయకపోవడంతో... మాదాపూర్‌లో అక్రమంగా కట్టిన 5 అంతస్తుల భారీ భవనాన్ని కూల్చివేశారు అధికారులు దీంతో అక్రమ భవనాల యజమానుల్లో మళ్లీ గుబులు మొదలయింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
హైడ్రా మళ్లీ యాక్షన్‌లోకి దిగింది. మదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది. 100 ఫీట్ రోడ్‌కి ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. 684 గజాల్లో అక్రమంగా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చుట్టుపక్కల ఉన్న ప్లాట్లకు సంబంధించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఈ భవన నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ.. జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు చేశారు.
దీనిపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. నిబంధనలకు విరుద్దంగా కట్టడాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. పలుమార్లు యజమానిని హెచ్చరించినా వినకపోవడంతో.. కూల్చివేతలు చేపట్టారు. మెయిన్ రోడ్ పక్కనే భవనం ఉండటంతో పవర్ సప్లయ్ నిలిపివేశారు. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల భద్రత మధ్య కూల్చివేత పనులు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.