ఇకపై మనుషుల ఆకారం, ఒకేలా ఉండబోతోందా ??

ఇకపై మనుషుల ఆకారం, ఒకేలా ఉండబోతోందా ??

Samatha J

| Edited By: Phani CH

Updated on: Jan 05, 2025 | 4:21 PM

మనిషి.. కోతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని చార్లెస్‌ డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం చెబుతుంది. ఆధునిక జీవశాస్త్రంలోనే ఈ సిద్ధాంతం చాలా మార్పులు తెచ్చింది. మూఢ నమ్మకాలతో విభేదించడంలో డార్విన్‌ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. కోతుల మాదిరిగానే మనుషులకు తోక ఉండేదని కాలక్రమేణా అది మాయం అయిందని శాస్త్రవేత్తల అంచనా.

ఈ క్రమంలో భవిష్యత్తులో మనుషులు ఇప్పుడున్నట్టు కనిపించరా? మనుషుల మధ్య రంగు, ఆకారంలో తేడాలు మాయమవుతాయా? అంటే అవుననే అభిప్రాయపడుతున్నారు జన్యు శాస్త్రవేత్తలు.మనుషుల్లో జన్యుపరమైన పరివర్తన రావడానికి 50 వేల ఏండ్లు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. 30 ఏండ్లకు ఒక తరంగా లెక్కిస్తే 50 వేల ఏండ్లలో 1,667 తరాలు మారతాయని, ఈ కాలంలో మనుషుల్లో శారీరకంగా చాలామార్పు సంభవించవచ్చని యూకేలోని ఆంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. రానున్న కాలంలో ప్రపంచ జనాభా మధ్య సారూప్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఒక ప్రాంతం వారు ఆ ప్రాంతానికి చెందిన వారినే పెళ్లి చేసుకుని పిల్లలను కంటుండటం వల్ల ప్రాంతాలను బట్టి మనుషుల రంగు, ఆకారంలో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. మనుషుల వలసలు పెరిగిపోవడం, భాగస్వామి ఎంపికలో వైవిధ్యం వల్ల మరో 50 వేల ఏండ్ల తర్వాత మనుషుల్లో ఏకరూపత కనిపించవచ్చని, రంగు, ఆకారంలో తేడా పెద్దగా ఉండదని అంచనా వేశారు.