Kamal Haasan : పార్టీని వీడుతున్నవారిపై కమల్‌హాసన్ కారాలు మిరియాలు
పాపం కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మక్కల్ నీది మయ్యంలో...
Kamal Haasan : పాపం కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మక్కల్ నీది మయ్యంలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న కారణంగా ఇప్పటికే చాలా మంది పార్టీని వీడారు. ఇప్పుడు పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ కూడా రాజీనామా ఇచ్చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ఓ సుదీర్ఘ లేఖ రాశారు. అందులో పార్టీని ఎందుకు వీడాల్సి వస్తున్నదో వివరంగా చెప్పారు. రాజీనామా లేఖలో మహేంద్రన్ పలు ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు వ్యక్తులు అర్థంపర్థం లేని సలహాలు ఇస్తూ కమల్‌ను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కమల్‌హాసన్ పార్టీని సరిగ్గా నడపలేకపోతున్నారని, ఆయన వ్యవహారశైలి కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదని మహేంద్రన్ తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు.
అయితే మహేంద్రన్ రాజీనామా చేయడం కమల్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై విరుచుకుపడ్డారు. ఏకంగా ఆయనను ద్రోహిగా అభివర్ణించారు. రాజీనామా చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే తామే పార్టీ నుంచి బయటకు పంపేవారమని కమల్ వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఓ కలుపు మొక్క బయటకు వెళ్లినందుకు తాము సంతోషిస్తున్నామని చెప్పారు. పార్టీలో ధైర్యవంతులకే చోటు ఉంటుందని, పిరికివారిలా పార్టీని వీడేవారి గురించి అసలు ఆలోచించమని తెలిపారు. ఎవరో కొందరు రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, పార్టీ లక్ష్యం దెబ్బ తినదని కమల్‌హాసన్ అన్నారు. మహేంద్రన్ కంటే ముందు పార్టీలో కీలకనేతలైన ఏ.జి.మౌర్య, మురుగనందమ్, సి.కె.కుమరావెల్, ఉమాదేవిలు కూడా పార్టీని వదిలిపెట్టారు.