Congress Party: కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం..ఇలా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఉనికిలో నిలిచేనా?
Congress Party: మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని. అసలే నాయకత్వలేమితో అష్టకష్టాలు పడి పార్టీని బ్రతికుంచుకోవడానికి తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికలు గట్టి దెబ్బే కొట్టాయి.

Congress Party: మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని. అసలే నాయకత్వలేమితో అష్టకష్టాలు పడి పార్టీని బ్రతికుంచుకోవడానికి తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు జరిగిన ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికలు గట్టి దెబ్బే కొట్టాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, మరీ ఇంత ఘోరంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే, పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఆ పార్టీ కనీస స్థానాలైనా గెలుస్తుందని భావించారు. కానీ సింగిల్ డిజిట్ దాటలేదు. బీజేపీ ఇప్పుడు ఆ ప్లేస్ ఆక్రమించేసింది. ఇక పుదుచ్చేరిలో పూర్తిగా చతికిల పడింది. అసోంలో కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కేరళలో ఈసారి కచ్చితంగా యూడీఎఫ్ కూటమి గెలుస్తుందని అనుకున్నారు. కానీ, అక్కడా కాంగ్రెస్ కు గట్టి దెబ్బే పడింది. ఎటొచ్చీ ఒక్క తమిళనాడులో మాత్రం తన మిత్ర పక్షం డీఎంకే గెలుపు మాత్రమే ఆ పార్టీకి కాస్త ఊరట.
స్వయంకృతాపరాధం కావచ్చు.. వంశపారంపర్యం మీద పెట్టుకున్న అతి ఆశలు కావచ్చు.. అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీ మెల్లగా కనుమరుగు అయిపోయేలా కనిపిస్తోంది. 150 ఏళ్ల చరిత్ర.. 60 ఏళ్ళపాటు దేశాన్ని ఏలిన ఘనతా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి కారణాలు వెతికే పని కూడా అనవసరం అనే స్థాయిలో పార్టీ పనితీరు ఉంది. ఇప్పటికే పార్టీలో లుకలుకలు బయట పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఘోర పరాభవంతో.. కాంగ్రెస్ పార్టీ బీటలు వారడం ఖాయం అనిపిస్తోంది. ఎదో నయానో భయానో అప్పట్లో తలెత్తిన అసమ్మతిని అడ్డుకోగలిగిన పార్టీ అధినాయకత్వం ఇప్పుడు పార్టీ పగుళ్ళను ఆపగలదా?
ఉత్తరాదిన మూడు రాష్ట్రాలు.. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇక దక్షిణాదిన ఆ పార్టీ ప్రభావం దాదాపు శూన్యం. ఎదో ఒకటీ అరా సీట్లు తప్ప దక్షిణాదిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో పక్కన పెట్టేశారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఉనికిలో కూడా లేదు. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల కంటె, నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ కావడం కాంగ్రెస్ దుస్థితిని బయటపెడుతోంది. ఇక తెలంగాణలో మొన్నటి వరకూ ప్రధాన ప్రతిపక్షంగా అనుకున్నా..ఇప్పుడు మూడో పార్టీగా మారిపోయింది. ఇదే ఎన్నికలతో పాటు జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇది ఆలోచించవలసిన విషయం.
కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి ఏకైక కారణం నాయకత్వ లోపంగానే విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికీ పార్టీ అధునాతన పరిస్థితులకు అనుకూలంగా మారకపోవడమూ ఒక కారణంగా వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు కళ్ళు తెరవకపోతే రేపు సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీల ముందు సాగిలపడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వారు అంటున్నారు.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామరూపాల్లేకుండాపోయింది. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. ఇక కేరళలో కమ్యూనిస్టులతో కలిసి యూడీఎఫ్‌గా ఉన్న కాంగ్రెస్ మరోసారి ఓటమిని చవిచూసింది. ఒక్క తమిళనాడులో తన మిత్రపక్షం డీఎంకే విజయం పొందడం కొంత సానుకూల పరిణామం. పుదుచ్చేరిలో చేదు ఫలితాలు పొందింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో కూడా అదే ఫలితాలను చవిచూసింది.
Also Read: Etela Rajender: మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్



