Prashant Kishore: ప్రశాంత్ కిషోర్ యూనిసెఫ్ నుంచి పొలిటికల్ గేమ్ చేంజర్ దాకా..రాజకీయ చాణక్యుడిగా పదేళ్ళ ప్రస్థానం..

Prashant Kishore: రాజకీయాల్లో ఎందరో వచ్చారు.. వెళ్ళారు.. కానీ, ప్రశాంత్ రూటే సపరేటు. కింగ్ మేకర్ అవ్వాలని చాలా మంది కలలు కంటారు.. ప్రశాంత్ మాత్రమే అలా ఎనిమిది సార్లు భారత రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు.

  • Updated On - 7:19 pm, Sun, 2 May 21
Prashant Kishore: ప్రశాంత్ కిషోర్ యూనిసెఫ్ నుంచి పొలిటికల్ గేమ్ చేంజర్ దాకా..రాజకీయ చాణక్యుడిగా పదేళ్ళ ప్రస్థానం..
Prashant Kishore The Political Chanakya

Prashant Kishore: ప్రశాంత్ కిషోర్.. దేశవ్యాప్తంగా ఈ పేరు తెలీని ఓటరు లేడు. రాజకీయాల్లో ఎందరో వచ్చారు.. వెళ్ళారు.. కానీ, ప్రశాంత్ రూటే సపరేటు. కింగ్ మేకర్ అవ్వాలని చాలా మంది కలలు కంటారు.. ప్రశాంత్ మాత్రమే అలా ఎనిమిది సార్లు భారత రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ప్రజల వేడి.. ఓటరు నాడి ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు అనడం అతిశయోక్తి కాబోదు. రాజకీయ యుద్ధం చేయాలంటే ఎన్నో పావులు కదపాలి.. మరెన్నో పావులని కూల్చాలి. రాజకీయ వైకుంఠ పాళీలో ఏ అంకె వేస్తె నిచ్చెన ఎక్కొచ్చో.. ఏ అంకె వేస్తె పాము బారిన పడకుండా తప్పించుకోవచ్చో ప్రశాంత్ కిషోర్ చెప్పగలిగినట్టు ఎవరూ చెప్పలేరేమో.

తానే రాష్ట్రంలో ఏ పార్టీకి కొమ్ముకాసినా ఆ పార్టీకి విజయం ఖాయం. ప్రశాంత్ రాజకీయ పరిశీలనలో ఉత్తరం..దక్షిణం.. ఈశాన్యం..పశ్చిమం అనేమీ లేదు.. దేశం నలుమూలలా ఓటరు ఎక్కడ నొక్కితే పడతాడో.. ఎక్కడ ఓటరు ఏ నాయకుడికి జై కొడతాడో పసిగట్టగల నేర్పరి. పదేళ్ళలో 9 ఎన్నికల్లో 8 సార్లు ప్రశాంత్ చెప్పిన పార్టీ గెలిచింది. కాదు.. కాదు ప్రశాంత్ కిషోర్ మాట విని పనిచేసిన పార్టీ మాత్రమే గెలిచింది. ఒకే ఒక్కసారి ప్రశాంత్ లెక్క తప్పింది. అదికూడా ముందే చెప్పినట్టు పూర్తిగా ఆయన చెప్పినట్టు వినకుండా..సొంత పైత్యాలు చేసినందుకే అని చెబుతారు. ఎప్పుడు జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ దీదీ మమతా బెనర్జీ వెనుక నిలబడ్డారు. అలా అనేకంటే.. ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముందుండి విజయాల బాటను పరిచారు అందం కరెక్ట్. ఈ అపర రాజకీయ చాణుక్యుని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మీకోసం..

హైదరాబాద్ లో ఇంజనీరింగ్..

Prashant Kishore నిజానికి రాజకీయ నాయకుడు కాదు. పెద్ద డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినవాడూ కాదు. ఆయన తండ్రి ఒక డాక్టర్. 44 ఏళ్ల ప్రశాంత్ కిషోర్ మొదట బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలోని కోనార్ గ్రామానికి చెందినవాడు. తరువాత, ఆయన కుటుంబం యుపి-బీహార్ సరిహద్దులో ఉన్న బక్సర్ జిల్లాకు మారింది. బీహార్‌లో ఇంటర్మీడియట్ వరకూ చదివిన తరువాత ఆయన హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ప్రారంభించడానికి ముందు ప్రశాంత్ యునిసెఫ్‌లో పనిచేసేవారు. యూనిసెఫ్ బ్రాండింగ్ చేసే బాధ్యతను ఆయన నిర్వర్తించారు. ప్రశాంత్ కిషోర్ 8 సంవత్సరాలు ఐక్యరాజ్యసమితితో పనిచేశారు.ఆయన ఆఫ్రికాలో యుఎన్ మిషన్ కు చీఫ్ గా వ్యవహరించారు.

రాజకీయ చాణక్యం..

ఈయన ఇండియా తిరిగి వచ్చాకా ఇక్కడి రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ పార్టీ ఎన్నికలలో ఎలా పోటీ చేయాలో చూపించడమే అతని పని. ఎన్నికలు గెలవడానికి రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి, తద్వారా వారి సంస్థ వీలైనంత వరకు పనిచేస్తుంది. అయితే, పార్టీ ఎన్నికల విజయం వ్యూహంపై మాత్రమే ఆధారపడి ఉండదని ప్రశాంత్ చెప్పారు. దానికి పార్టీ పేరు.. దాని అధినేత ఇవన్నీ అవసరం లేదని ఆయన అంటారు.

పదేళ్ళ ప్రస్థానం..

సంవత్సరం: 2012

ఎన్నికలు: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీ బీజేపీ.. పార్టీ పరిస్థితి.. నరేంద్ర మోడీ ఆ ఎన్నికల సమయంలో కొంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. ఒకవేళ అయన కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే, బీజేపీ ప్రధాని అభ్యర్థి ఆయనే అవుతారనే ప్రచారమూ వినిపిస్తున్న సమయం. సహజంగానే పార్టీ రాజకీయాల్లో మోడీ పట్ల ఉన్న వ్యతిరేకత అప్పటి గుజరాత్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యూహకర్తగా వచ్చారు. అంతే సీన్ మారిపోయింది. నరేంద్ర మోడీ పేరు.. ఆ ఎన్నికల్లో ఒక్క గుజరాత్ లోనే కాదు దేశమంతా మోగిపోయింది. 2011 లో ‘వైబ్రంట్ గుజరాత్’ నిర్మాణాన్ని ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) రూపొందించారు. అప్పుడు, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బెజేపీ తరపున ప్రచారం చేసే బాధ్యతను స్వీకరించారు, తరువాత నరేంద్ర మోడీ 182 స్థానాల్లో 115 సీట్లను గెలుచుకోవడం ద్వారా వరుసగా మూడవసారి ముఖ్యమంత్రిగా వచ్చారు.

సంవత్సరం: 2014  ఎన్నికలు: 16 వ లోక్ సభ ఎన్నికలు..

గుజరాత్ ఎన్నికలు విజయవంతం అయిన తరువాత, 2014 లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేసే బాధ్యతను ప్రశాంత్‌కు బీజేపీ అప్పగించింది. అప్పుడు ఏకంగా 282 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ‘టీపై చర్చ’, ‘3 డి-నరేంద్ర మోడీ’ అనే భావనను కూడా ప్రశాంత్ తయారు చేశారు. అప్పటి నుండి, ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా పెద్ద పేరు అలాగే బ్రాండ్‌గా అవతరించాడు.

సంవత్సరం: 2015  ఎన్నికలు: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ జెడియు, ఆర్జెడి, కాంగ్రెస్ గ్రాండ్ అలయన్స్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన ఒక వ్యూహాన్ని రూపొందించారు. ‘బీహార్ అక్కడ ఉంది, నితీషే కుమార్’ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో జెడియు, ఆర్జెడి, కాంగ్రెస్ గ్రాండ్ అలయన్స్ 243 లో 178 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే ను కేవలం 58 సీట్లకు పరిమితం చేశారు.

సంవత్సరం: 2017  ఎన్నికలు: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు

2017 లో, ప్రశాంత్ కిషోర్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్, కాంగ్రెస్ కోసం ఒక వ్యూహాన్ని రూపొందించారు. ఈయన వ్యూహంతో 117 స్థానాల్లో 77 స్థానాలను గెలిచి అమరీందర్ సింగ్ సీఎం అయ్యారు.

సంవత్సరం: 2017  ఎన్నికలు: యుపి అసెంబ్లీ ఎన్నికలు

అప్పుడు 2017 యుపి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ తరఫున నిలిచారు. కాని, ఆయన తొలిసారిగా ఓటమిని చాలా ఘోరంగా ఎదుర్కోవలసి వచ్చింది. 403 సీట్లలో కాంగ్రెస్ 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకుంది.

ప్రశాంత్ కెరీర్‌లో ఇదే మొదటిసారి.. ఆయన ఎన్నికల వ్యూహం పనిచేయలేదు. అయితే, ఈ ఓటమిపై, ఆయన రాహుల్, ప్రియాంక గాంధీలను కారణంగా చెబుతారు. యుపిలో ఉన్నతాధికారులు ఆయనను బహిరంగంగా పనిచేయడానికి అనుమతించలేదు, దాని ఫలితం ఇలా వచ్చిందని ఆయన అంటారు.

సంవత్సరం: 2019 ఎన్నికలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

ప్రశాంత్ కిషోర్‌ను 2019 లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఎలక్టోరల్ కన్సల్టెంట్‌గా నియమించారు. ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ కోసం ప్రచారాలను రూపొందించారు. ఆయన వ్యూహంలో దేశంలోనే రాజకీయాల్లో చక్రం తిప్పగల ఉద్ధండుడిగా పేరుపొందిన చంద్రబాబు చిక్కుకుపోయారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ 175 సీట్లలో 151 గెలిచి అఖండ విజయం సొంతం చేసుకుంది.

సంవత్సరం: 2020 ఎన్నికలు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

2020 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రశాంత్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త పాత్ర పోషించి, ‘లగే రహో కేజ్రీవాల్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లలో 62 స్థానాలను గెలుచుకుంది.

ప్రస్తుతం..2021.. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు..

బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ 200 సీట్లు దాటి సాస్తుంది అంటూ ప్రచారం చేసింది. కానీ తృణమూల్ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రెండంకెల స్కోరు బీజేపీ దాటితే నేను ఎన్నికల్ వ్యూహకర్తగా ఇక పనిచేయను అని కరాఖండిగా చెప్పారు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. ఇక్కడ 90 సీట్లను దాటి బీజేపీ గెలుచుకోలేక పోయింది. ఈ ఎన్నికల ఫలితాలు ప్రశాంత్ వ్యూహాలకు ఉన్న పదునును నిరూపిస్తున్నాయి.

అదేవిధంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) వ్యూహాలే పనిచేశాయి. ఇక్కడ కూడా స్టాలిన్ కచ్చితంగా మంచి మెజార్టీ తో గెలుస్తారంటూ ప్రశాంత్ పదే పదే చెబుతూ వచ్చారు. ఆయన అన్నట్టుగానే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులేస్తున్నారు.

ఇదీ భారతదేశ రాజకీయాల్లో ప్రశాంత ముద్ర. ఒకసారి వ్యూహం పనిచేయవచ్చు.. రెండుసార్లు పనిచేయవచ్చు.. విభిన్న ప్రాంతాలు.. భిన్న రుచుల ప్రజలు.. వీరందరి నాడిని పట్టడంలో ప్రశాంత్ దిట్ట. ఈయన వెనుక అలుపెరుగకుండా పనిచేసే ఆయన సైన్యం ఉంది.

Also Read: Nandigram Election Result 2021: నందిగ్రామ్‌లో సుభేందు అధికారికి ఝలక్.. సవాల్ విసిరి మరీ నెగ్గిన దీదీ..

భవిష్యత్తులో ఇక పోటీ చేయను.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అసాధారణ నిర్ణయం