Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు

Subhash Goud

Subhash Goud |

Updated on: Jul 06, 2021 | 6:44 AM

Covid-19 Bone death: కరోనా మహమ్మారితో ఏర్పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వైరస్‌ ఎఫెక్ట్‌తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వైరస్‌ రకరకాలుగా..

Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు

Covid-19 Bone death: కరోనా మహమ్మారితో ఏర్పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వైరస్‌ ఎఫెక్ట్‌తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వైరస్‌ రకరకాలుగా రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరో అంశం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగులకు బోన్‌డెత్‌ రూపంలో కొత్త ప్రమాదం తలెత్తడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాస్కులార్‌ నెక్రోసిస్‌ (Avascular necrosis- AVN)లేదా బోన్‌ టిష్యూ డెత్‌గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పటివరకు ముగ్గురు కరోనా వచ్చి తగ్గినవారిలో గుర్తించినట్లు ముబైకి చెందిన హిందూజా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా రోగులకు బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో వచ్చి ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా అనంతరం ఏవీఎన్‌ ముప్పు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌ రోగులకు వాడే స్టిరాయిడ్లే ఈ ఏవీఎన్‌ వచ్చేందుకు ప్రాథమికంగా కారణమై ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఇది ఎలా బయట పడిందంటే..

ఫీమర్‌ ఎముక వద్ద మొదలైన నొప్పితో ముగ్గురు ఆస్పత్రికి వచ్చారని, కరోనా తగ్గిన రెండు నెలలకు వీరిలో ఈ సమస్య బయట పడిందని డా. సంజయ్‌ అగర్వాల్‌ చెప్పారు. కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌లో దీర్ఘకాలం పాటు కార్టికోస్టిరాయిడ్లు వాడడంతో ఏవీఎన్‌ కేసులు పెరుగుతున్నాయని బీఎంజే కేస్‌ స్టడీస్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో డాక్టర్‌ సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పాటు కరోనాతో పోరాటం చేసినవారిలో ఈ బోన్‌డెత్‌ లక్షణాలు గుర్తించామని మరి కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇలాంటి కేసులు పెరిగే అవకాశం ఉందని, స్టిరాయిడ్ల వాడకమైన 5-6 నెలలకు ఈ వ్యాధి బయటపడుతుంటుందని వైద్యులు తెలిపారు.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో గరిష్టాలకు చేరిందని, అప్పుడు వైద్యం చేయించుకున్నవారిలో బోన్‌డెత్‌ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పట్టవచ్చని వారు అంచనా వేశారు. అయితే సంజయ్‌ అభిప్రాయం ప్రకారం త్వరలోనే ఏవీఎన్‌ కేసులు పెరుగుతాయి. సాధారణంగా ఏవీఎన్‌ లక్షణాలు బయటపడేందుకు చాలా నెలలు పడుతుందని, కానీ ఇప్పుడు స్వల్పకాలంలోనే ఈ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకినవాళ్లను తొలినాళ్లలో గుర్తిస్తే వైద్యం అందించి నయం చేయవచ్చని, తొలిదశలో ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్నారు. కోవిడ్‌ వచ్చి తగ్గినవాళ్లు తొడలు, హిప్‌ జాయింట్‌ వద్ద నొప్పి కొనసాగుతుంటే ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు వెళ్లడం తప్పనిసరి అని, అనంతరం ఏవీఎన్‌ వ్యాధి సోకిందేమో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే తొలిదశలో బిస్‌ఫాస్ఫోనేట్‌ థెరపీ ద్వారా దీన్ని తగ్గించవచ్చన్నారు.

జాన్స్‌ హిప్కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రకారం.. ఈ వ్యాధి లక్షణాలు ఇతర వ్యాధి లక్షణాలున్నట్లుగానే కనిపిస్తాయని, ఎముకల సమస్య ఉన్నట్లు కనిపిస్తాయని యూనివర్సిటీ తెలిపింది. ముందుగా కీళ్ల నొప్పులు రావడం, ఎముక, కీళ్లలో కుళ్లిపోవడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని పేర్కొంది. నిర్లక్ష్యం చేస్తే నొప్పి పెరిగి ప్రాణాంతకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి

Coronavirus: వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. 99 శాతం కోవిడ్‌ మరణాలు.. అసలు కారణం అదే..!

ఆంక్షలు ఎత్తేస్తాం.. కోవిద్ వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోండి.. ప్రజలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హితవు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu