AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్‌ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. అజెండా ఇదే..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) లో జూలై 2 నుంచి రెండు రోజులపాటు జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు బీజేపీ వెల్లడించింది.

BJP: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్‌ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. అజెండా ఇదే..!
Pm Modi
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 01, 2022 | 4:38 PM

Share

BJP National Executive Meeting 2022: భారతీయ జనతా పార్టీ.. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ అధిష్టానం సన్నాహాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్‌ వేదిక కానుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) లో జూలై 2 నుంచి రెండు రోజులపాటు జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు బీజేపీ వెల్లడించింది. సమావేశం జూలై 2వ తేదీన సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమై 3 జూలై 2022 సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అధ్యక్షత వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర సీనియర్ పదాధికారులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.

సమావేశం అజెండాలో గత సమావేశం నుంచి జరిగిన ప్రధాన కార్యకలాపాలు, సంస్థాగత సమస్యలపై, ప్రస్తుత అంశాలపై చర్చ నిర్వహించనున్నారు. దీంతోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై సన్నద్ధత, తీసుకోవాల్సిన వ్యూహాలపై, తీర్మానాలపై చర్చ నిర్వహించనున్నారు. పార్టీ నిర్వహించాల్సిన భవిష్యత్ కార్యక్రమాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ పేర్కొంది. ఈ కార్యవర్గ సమావేశానికి నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో బీజేపీ మూడో సారి కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. అంతకుముందు 2015లో కర్ణాటక రాజధాని బెంగళూరులో, 2016లో కేరళలోని కోజికోడ్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇదిలాఉంటే.. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. హైదరాబాద్‌లో ఈ సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి