PM Modi: హలో.. నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నా.. బీజేపీ బూత్ వర్కర్లకు పెద్ద నేతల ఫోన్లు. ఎందుకో తెలుసా?
పేరుకు రాజకీయ పార్టీయే కానీ వ్యవస్థ ఓ కార్పొరేట్ కంపెనీని మించి ఉంటుంది. మోదీ-షా తరం మొదలయ్యాక పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. జాతీయ ప్రధాన కార్యాలయ భవనాలతో పాటు ప్రతి జిల్లాలో పార్టీకి కార్యాలయం ఉండేలా చర్యలు చేపట్టారు. గతంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే ఈ తరహా వ్యవస్థ ఉండేది. బీజేపీ ఒక అడుగు ముందుకేసి అన్ని హంగులు, వసతులతో కార్యాలయాలను తీర్చిదిద్దడంతో పాటు పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త సమాచారాన్ని నిక్షిప్తం చేసే ప్రక్రియ ప్రారంభించింది.

సంఖ్యాపరంగా అది ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ. పార్టీలో సభ్యులుగా నమోదు చేసుకున్నవారే 17 కోట్ల మంది ఉన్నారు. రాజకీయమే జీవితంగా పనిచేస్తున్న కార్యకర్తలు, క్షేత్రస్థాయి నేతల సంఖ్య కూడా కోట్లలోనే ఉంటుంది. అంత పెద్ద పార్టీలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి నుంచి ఓ బూత్ స్థాయి కార్యకర్తకు నేరుగా ఫోన్ వస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. వారికి జిల్లా అధ్యక్షుడిని కలవడం, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఫొటో దిగడమే గొప్ప అవకాశంగా మురిసిపోతుంటారు. అలాంటివారికి ఏకంగా జాతీయ స్థాయి నేత నుంచి ఫోన్ వచ్చిందంటే ఎగిరి గంతేస్తారు. ఇది నిజమేనా.. లేక కలా అనుకునే అవకాశం కూడా లేకపోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు, క్షేత్రస్థాయిలో సాధకబాధకాలను తెలుసుకునేందుకు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కార్పొరేట్ వ్యవస్థను తలపించేలా
పేరుకు రాజకీయ పార్టీయే కానీ వ్యవస్థ ఓ కార్పొరేట్ కంపెనీని మించి ఉంటుంది. మోదీ-షా తరం మొదలయ్యాక పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. జాతీయ ప్రధాన కార్యాలయ భవనాలతో పాటు ప్రతి జిల్లాలో పార్టీకి కార్యాలయం ఉండేలా చర్యలు చేపట్టారు. గతంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే ఈ తరహా వ్యవస్థ ఉండేది. బీజేపీ ఒక అడుగు ముందుకేసి అన్ని హంగులు, వసతులతో కార్యాలయాలను తీర్చిదిద్దడంతో పాటు పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త సమాచారాన్ని నిక్షిప్తం చేసే ప్రక్రియ ప్రారంభించింది. ‘సరళ్’ పేరుతో జాతీయ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ బూత్ స్థాయి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడు, ప్రధాన మంత్రి వరకు ప్రతి ఒక్కరి బయోడాటా ఉంటుంది. కేవలం డాటా మాత్రమే కాదు, రోజువారీగా వారు పార్టీ కోసం చేస్తున్న పనులు, కార్యక్రమాలన్నీ అందులో ఎప్పటికప్పుడు నమోదవుతూనే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలో హ్యూమన్ రీసోర్స్ (HR) డిపార్ట్‌మెంట్ తరహాలో ఉంటుందని చెప్పొచ్చు.




‘పన్నా ప్రముఖ్’
ఏ పార్టీలోనూ లేని విధంగా బీజేపీలో బూత్ స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే అతి సూక్ష్మ స్థాయి వరకు కూడా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓటర్ల జాబితాలో ప్రతి పేజికి 30 మంది ఓటర్ల వివరాలుంటాయి. అలాంటి ప్రతి పేజికి ఒక ఇంఛార్జిని పార్టీ నియమించింది. వారిని ‘పన్నా ప్రముఖ్’గా వ్యవహరిస్తారు. ఇక్కడ పన్నా అంటే పేజి అని అర్థం. తన పరిధిలోని 30 మంది ఓటర్లను ఆ ‘పన్నా ప్రముఖ్’ నిరంతరం కలుస్తూ ఉండాలి. వారి సాధకబాధకాలు తెలుసుకుంటూ, వీలైనంత వరకు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఎన్నికల వేళ ఆ ఓటర్లు బీజేపీకి ఓటేసేలా చూడాలి. 30 మందిలో కనీసం 15 మందితో పార్టీకి అనుకూలంగా ఓటు వేయించగల్గినా చాలు. మిగతా 15 ఓట్లు ఒకే ప్రత్యర్థికి వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి బీజేపీ సునాయాసంగా విజయం సాధించగల్గుతుంది. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ సహా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ ఈ తరహా అతిసూక్ష్మస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ప్రజా సమూహంలో పార్టీకి అనుకూలం ఉన్న ఓటర్లను తయారు చేసుకున్నంత మాత్రాన గెలుపు వరించదు. వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించినప్పుడు మాత్రమే విజయం సాధ్యం. ఈ సూత్రాన్ని బీజేపీ బాగా నమ్ముతుంది. ఎన్నికల సమయంలో ‘మైక్రో మేనేజ్‌మెంట్’ చేయడంలో ‘పన్నా ప్రముఖ్’ పాత్ర చాలా కీలకంగా మారుతుంది.
పనికి తగిన గుర్తింపు కుటుంబ, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే ‘భారతీయ జనతా పార్టీ’లో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు, పదవులు మిగతా పార్టీల కంటే మెరుగ్గా లభిస్తాయన్న అభిప్రాయం ఉంది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాన మంత్రి వరకు ఎదిగిన నరేంద్ర మోదీయే ఇందుకు ఉదాహరణగా ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. తెలుగు ప్రజల కళ్ల ముందు కనిపించే మరో ఉదాహరణ కూడా ఉంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం వరకు కరీంనగర్ పట్టణంలో కార్పొరేటర్‌గా సుపరిచితుడైన బండి సంజయ్.. ఇప్పుడు ఏకంగా పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఐదేళ్ల వ్యవధిలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు ప్రయత్నించి విఫలమైనా, ఎంపీగా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో దశ తిరిగింది. ఎంపీగా, ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇప్పుడు ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఎదుగుదల పరమపద సోపానంలో నిచ్చెన మెట్లు ఎక్కినట్టుగా సాగింది. కానీ అంతకంటే ముందు పార్టీ కోసం ప్రాణాలకు తెగించి సాగించిన దశాబ్దాల పోరాటం ఈ ఎదుగుదలకు పునాదిగా మారింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న 8 మందిలో బండి సంజయ్ ఒకరు. యావత్ దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ప్రధాన కార్యదర్శి కూడా ఆయనొక్కరే. సాధారణంగా ఈ స్థాయికి చేరుకోడానికి కొన్ని దశాబ్దాల శ్రమ పడుతుంది. కొన్ని పార్టీల్లో అత్యున్నత స్థాయి పదవులు వారసత్వంగానే కొనసాగుతూ ఉంటాయి. కానీ బీజేపీలో ఈ తరహా ఉదాహరణలు మిగతా కార్యకర్తల్లో భవిష్యత్తుపై ఆశను, భరోసాను కల్గిస్తాయి. కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు గుర్తింపుతో పాటు తగిన పదవి, బాధ్యత వరిస్తాయన్న నమ్మకాన్ని కల్గిస్తాయి.
బూత్ లెవెల్ ఔట్ రీచ్ ఏ పార్టీలోనైనా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల శ్రమే ఎక్కువ. వారి శ్రమతో నేతలు పల్లకి ఎక్కుతుంటారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించేది కార్యకర్తలే. ప్రత్యర్థులతో తలపడేది కార్యకర్తలే. ఈ క్రమంలో ఒక్కోసారి చెలరేగే ఘర్షణల్లో దెబ్బలు తినేది కార్యకర్తలే. అధికార పార్టీలు పెట్టే కేసులను ఎదుర్కొని జైలుపాలయ్యేది కూడా కార్యకర్తలే. అలాంటి అందరికీ పదవులు, బాధ్యతలు ఇవ్వడం సాధ్యం కాదు. ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ చేసే పనికి తగిన గుర్తింపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ గుర్తింపు అందించే ప్రయత్నాల్లో బీజేపీ వినూత్న రీతిలో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ సంపాదించుకున్న అతికొద్ది మంది నేతల్లో ఒకరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఓ బూత్ స్థాయి కార్యకర్తకు ఫోన్ చేసి బాగోగులు, సాధకబాధకాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అలాగే జరిగాయి కూడా. ప్రధాని నేరుగా కార్యకర్తలతో మాట్లాడడం, వీలుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేయడం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్టీ ఆఫీస్ బేరర్లు ప్రతిరోజూ, కనీసం నలుగురు కార్యకర్తలతో మాట్లాడే సరికొత్త కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ఆ ప్రకారం జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా సహా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ప్రతిరోజూ నలుగురు కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.
రాష్ట్ర స్థాయిలోనూ ఈ కార్యక్రమం అమలవుతోంది. బూత్ స్థాయి కార్యకర్తకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ కాల్ రావడం కచ్చితంగా వారిలో స్థైర్యాన్ని, మనోబలాన్ని పెంచుతుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో జాతీయ నాయకత్వానికి తెలుస్తుంది. అప్పగించిన ఈ పని ఎలా జరుగుతుంది అనేది మొబైల్ ఫోన్ యాప్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ కూడా జరుగుతుంది. ఉదయాన్నే సదరు నేతకు బూత్ స్థాయి కార్యకర్తల పేర్లు, నెంబర్లు వస్తాయి. రోజులో ఏదో ఒక సమయంలో తీరిక చేసుకుని ఆ నలుగురితో ఆ నేత మాట్లాడాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ‘యాప్’లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆ కార్యకర్తకు నేత నుంచి ఫోన్ వెళ్లిందో లేదో బ్యాక్ ఆఫీస్ వ్యవస్థ తెలుసుకుంటుంది. ఇలా మొత్తంగా పార్టీ చేపట్టిన ‘బూత్ లెవెల్ ఔట్ రీచ్’తో ఎంతోకొంత సానుకూల ఫలితం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
