BJP: కమలదళంలో సంస్థాగత మార్పులు.. ఇకపై కేంద్రమంత్రులకే ఆ బాధ్యత.. అనివార్యమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆలోగా జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయుధాలు సిద్ధం చేస్తోంది. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాలతో

BJP: కమలదళంలో సంస్థాగత మార్పులు.. ఇకపై కేంద్రమంత్రులకే ఆ బాధ్యత.. అనివార్యమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!
BJP High Command
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jun 29, 2023 | 1:36 PM

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆలోగా జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయుధాలు సిద్ధం చేస్తోంది. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాలతో మిగతా రాష్ట్రాల్లో పకడ్బందీగా అడుగులు వేస్తోంది. కర్ణాటకలో రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌కు ధీటైన రాష్ట్ర స్థాయి నాయకత్వం లేకపోవడంతో కేంద్ర నాయకత్వమే ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి తలెత్తకుండా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కసరత్తు చేపట్టింది. ప్రధాన మంత్రి అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన సమయంలోనే బీజేపీ అగ్రనాయకత్వం సంస్థాగత మార్పులు, చేర్పులపై విస్తృత కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల నేతలను, ఆ రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులను కలిపి కూర్చోబెట్టి మంతనాలు సాగించింది. మార్పులు, చేర్పుల ప్రభావం, పర్యవసానాలపై కూలంకశంగా అధ్యయనం చేసి అంచనాలు రూపొందించింది.

ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక రైతులను ఆకట్టుకునే భారీ ప్యాకేజికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే రోజు రాత్రి ప్రధాని అధికారిక నివాసం 7 – లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా మరికొందరు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అర్థరాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుతో పాటు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రాల అధ్యక్షులుగా కేంద్ర మంత్రులను పంపాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన తెలంగాణ, ఈశాన్యాన మిజోరాం ఉన్నాయి. వీటితో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, హర్యానా రాష్ట్రాల నాయకత్వ మార్పు గురించి అధినేతలు చర్చించినట్టు సమాచారం.

రాష్ట్రాలకు మంత్రులే..

సంస్థాగత మార్పుల్లో భాగంగా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు పరోక్షంగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా కేంద్ర మంత్రులను పంపించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నచోట అక్కడి ముఖ్యమంత్రులకు పోటీ ఇవ్వగల నేతలను బరిలోకి దించినట్టవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. కర్ణాటకలో ఓటమి కారణాల్లో ఇది కూడా ఒకటని, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి బలమైన నేతలిద్దరు కనిపించగా.. బీజేపీ తరఫున సిట్టింగ్ సీఎం బస్వరాజ్ బొమ్మై తేలిపోయారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి కూడా ఆ స్థాయి లేకపోయింది. మాజీ సీఎం యెడ్యూరప్ప ఒక్కరే బలమైన నేతగా కనిపించగా.. ఆయన్ను గరిష్ట వయోపరిమితి కారణంగా పార్టీ క్రియాశీల రాజకీయాల నుంచి దూరం పెట్టిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థిత్తుల్లో ఆ రాష్ట్రంలో బొమ్మైకు బదులుగా కేంద్ర మంత్రులు ఎవరినైనా పరోక్షంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, స్థానిక నాయకత్వం బలంగా లేకపోవడమే ఓటమికి కారణమని పార్టీ విశ్లేషించుకుంది. ఈ పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో తలెత్తకుండా ఉండేందుకు రాజకీయానుభవంతో పాటు పాలనలో అనుభవం గడించిన నేతలకు రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర సింగ్ తోమర్, ఒడిశాకు ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ- కిషన్ రెడ్డి, రాజస్థాన్‌కు గజేంద్ర సింగ్ షెకావత్‌ను అధ్యక్షులుగా పంపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ కొత్త అధ్యక్షుడితో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత (ప్రతిపక్ష నేత)ను కూడా ఇదే కసరత్తులో భాగంగా ఖరారు చేయనున్నట్టు తెలిసింది.

తెలంగాణలో ఏం జరుగుతుంది..?

ఎన్నికలకు తేదీలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ వంటి రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనూహ్యం పరిణామమే అవుతుంది. రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని ఇప్పటికీ పలువురు నేతలు చెబుతున్నారు. కానీ బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో అగ్రనేతల మధ్య లుకలుకలు, విబేధాలు పార్టీలో వర్గపోరుకు దారితీశాయని అధిష్టానం గ్రహించింది. పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కొత్త నేతలకు, మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు మధ్య గ్యాప్ ఉందన్న విషయం బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో పాత – కొత్త నేతల మధ్య సమన్వయం సాధిస్తూ.. అందరినీ కలుపుకుపోయే నేత కోసం పార్టీ అన్వేషించింది. మృదుస్వభావి, వివాదరహితుడుగా పేరున్న కిషన్ రెడ్డే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్టు తెలిసింది. కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా సరే గురుతర బాధ్యతను ఆయనకు అప్పగిస్తూ రాష్ట్రానికి పంపించనున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ వార్తలను కిషన్ రెడ్డి ఖండిస్తున్నప్పటికీ.. కమలనాథులు రాష్ట్రాలకు మంత్రులను పార్టీ అధ్యక్షులుగా పంపే కసరత్తు చేస్తుండడంతో ఒకట్రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..