AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకెళ్లిన ఎన్డీయే.. చతికిలపడ్డ మహాఘట్ బంధన్‌.. ఓటమికి అసలు కారణం ఆ ఒక్క మాట..!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌.. మహా ఓటమి పాలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి హవా చూపించింది. RJD, కాంగ్రెస్‌ల అడ్రస్‌ గల్లంతయింది. దీనికి కారణం ఒకే ఒక మాట. ఆ మాట వింటే బీహారీల వెన్నులో వణుకు పుడుతుంది. అదే ఈసారి కూడా మహాఘట్ బంధన్‌ని అధికారానికి దూరంగా ఉంచిందా?

దూసుకెళ్లిన ఎన్డీయే.. చతికిలపడ్డ మహాఘట్ బంధన్‌.. ఓటమికి అసలు కారణం ఆ ఒక్క మాట..!
Mahagathbandhan
Balaraju Goud
|

Updated on: Nov 14, 2025 | 9:13 PM

Share

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌.. మహా ఓటమి పాలైంది. RJD, కాంగ్రెస్‌ల అడ్రస్‌ గల్లంతయింది. దీనికి కారణం ఒకే ఒక మాట. ఆ మాట వింటే బీహారీల వెన్నులో వణుకు పుడుతుంది. అదే ఈసారి కూడా మహాఘట్ బంధన్‌ని అధికారానికి దూరంగా ఉంచిందా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్లింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి హవా చూపించింది. ఇక విపక్ష కూటమి మహాఘట్ బంధన్ చతికిలపడింది. కంచుకోటల్లో కూడా ఖంగుతింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. 2015లో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వీ దాదాపు దశాబ్దానికి పైగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయంతో తేజస్వీ రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. 2015లో నితీష్‌తో కలిసి పోటీచేసి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కొంతకాలం తర్వాత నితీష్ తిరిగి బీజేపీతో జట్టు కట్టారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తేజస్వీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

బీహార్‌ ఎన్నికల్లో కులాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆర్జేడీకి సంప్రదాయక ఓటర్లైన యాదవ్‌-ముస్లింల కాంబినేషన్‌ అండగా ఉంది. అయితే మరో అత్యంత కీలకవర్గమైన ఎంబీసీలు అంటే మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ కమ్యూనిటీస్‌.. వీళ్లంతా నితీష్‌తోనే ఉన్నారు. కుర్మీ, కొయిరీ, కుశ్వాహా.. తదితర వర్గాలు సమీకృతమై ఎన్డీయేకు ఓటు వేశాయి. ఇక నితీష్ కుమార్‌ హయాంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చారు. ఈ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మహిళా రోజ్‌గార్‌ పథకం కింద దాదాపు 21 లక్షలమంది మహిళలకు వారి ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేశారు.

మహిళా సాధికారతకు సంబంధించి ఈ పథకాన్ని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి పథకంలో ప్రతిభ ప్రదర్శించిన వారికి రూ. 2 లక్షల చొప్పున రుణాలిస్తున్నారు. దీంతో మెజార్టీ మహిళలు ఎన్డీయేకు ఓటు వేశారు. అంతేకాకుండా ఈసారి బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. వారిలో అత్యధికులు ఎన్డీయే కూటమికి ఓటేశారని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఇక అగ్ర కులాలు కాంగ్రెస్‌కు పర్మనెంట్‌గా టాటా చెప్పి బీజేపీ వైపు వెళ్లిపోయాయి.

అయితే మహాఘట్ బంధన్‌ ఓటమికి అన్నింటికంటే ముఖ్యమైన కారణం మరొకటుంది అంటున్నారు విశ్లేషకులు. అదే జంగిల్‌ రాజ్‌. ఈ మాట విన్నప్పుడల్లా బీహారీల వెన్నులో వణుకు పుడుతుంది. 1990 నుంచి 2005 వరకు, మధ్యలో కొద్ది కాలాన్ని మినహాయిస్తే, బీహార్‌ని లాలూ యాదవ్‌ కుటుంబం ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది. ఆ సమయంలో జరిగిన కులాల సంకుల సమరంలో 566 మంది మృతి చెందారు. ఇక కిడ్నాపులు, బాంబులు, తుపాకుల తయారీ ఇవన్నీ కుటీర పరిశ్రమలుగా వర్ధిల్లాయి. ప్రభుత్వానికి సమాంతరంగా రౌడీ రాజ్యం, గూండాల రాజ్యం, ముఠా నాయకుల పాలన కూడా సాగాయి. ఇవన్నీ… సామాన్యులకు లాలూ ఫ్యామిలీ అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చాయి. అప్పటినుంచి లాలూ కుటుంబాన్ని, నిను వీడని నీడను నేనే అన్నట్లు.. ఈ జంగిల్‌ రాజ్ ముద్ర వదలడం లేదు.

తాజాగా ఎన్నికల్లో కూడా జంగిల్‌ రాజ్‌ అనే ఒకే ఒక్క మాట.. లాలూ కుటుంబాన్ని అధికారానికి ఆమడ దూరంలో నిలిపింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఆర్జేడీ గత పాలన నుంచి వచ్చిన జంగిల్‌రాజ్‌ పేరుకు తోడు.. తేజస్వీపై పలు కేసులు ఉండడం కూడా ప్రతికూలంగా మారింది. ఆయనపై 11 క్రిమినల్‌ కేసులు ఉండటంతోపాటు.. ఐఆర్‌సీటీసీ హోటల్‌ టెండర్‌ స్కాం, ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌లో కూడా ఆయన పేరు వచ్చింది. ఆర్జేడీ నేత శక్తిమాలిక్‌ హత్య కేసులో కూడా మృతుడి కుటుంబీకులు తేజస్వీ పైనే ఆరోపణలు చేయడం వంటివి ప్రతికూలంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..