BEGGAR HAS HUGE MONEY: యాచకురాలి వద్ద రూ. 2.58 లక్షల సొమ్ము.. షాక్ అయిన అధికారులు..!
BEGGAR HAS HUGE MONEY: రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్న ఓ మహిళ వద్ద రూ. 2.58 లక్షలు లభించాయి.
BEGGAR HAS HUGE MONEY: రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్న ఓ మహిళ వద్ద రూ. 2.58 లక్షలు లభించాయి. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకెళితే.. రాజౌరీలోని ఓ బస్ స్టాండ్ సమీపంలో గత మూడు దశాబ్దాలుగా ఓ యాచకురాలు(65) బిచ్చమెత్తుకుంటూ జీవనం గడుపుతోంది. అయితే, నిరాశ్రయులకు మెరుగైన జీవనం కల్పించడానికి ఉద్దేశించిన సంరక్షణ గృహానికి ఆమెను తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నాడు అధికారులు ఆమెను సంరక్షణాలయానికి తరలిస్తుండగా.. ఆమె వద్ద రూ. 2.58 లక్షలకు పైగా సొమ్మును గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ నౌషెరా సుఖ్ దేవ్ సింగ్ సమ్యాల్ తెలిపారు.
సదరు యాచకురాలిని సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లిన తరువాత, ఆమె వస్తులు, దుస్తులు శుభ్రం చేస్తుండగా.. పాలిథిన్ కవర్లతో గట్టిగా కట్టబడిన మూడు ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించాయి. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది. అందులో నోట్లతో పాటు.. భారీ మొత్తంలో చిల్లర ఉంది. అధికారుల సమక్షంలో వీటిని లెక్కించగా.. రూ. 2,58,507 ఉన్నాయని సమ్యాల్ తెలిపారు. ఈ సొమ్మును తిరిగి ఆమెకే అప్పగిస్తామని ఆయన తెలిపారు. బిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న మహిళ.. తనకు వచ్చిన డబ్బును ప్లాస్టిక్ బాక్స్‌లో దాచుకుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఆమె ఎవరు అనేది గుర్తించడానికి కావాల్సిన సమాచారం తెలియడం లేదని, ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు కూడా లేవని అధికారులు తెలిపారు. గత 30 ఏళ్లుగా వెటర్నరీ హాస్పిటల్, బస్‌స్టాండ్ పరిసరాల్లో తిరుగుతోందని అధికారులు తెలిపారు.
Also read:
Andhrapradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. అనాథ పిల్లలకు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం