Child Marriage: బాల్యవివాహాలను అరికట్టేందుకు ఆ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం!.. పదేళ్ల వరకు జైలు శిక్ష
బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఆ వివాహాలు చేయకూడదని ప్రభుత్వాలు, ఎంతోమంది ఎంతోమంది మేధావులు చెప్పినప్పటికీ మన దేశంలో ఇంకా ఎక్కడో ఓ చోట బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ అంశంపై అస్సాం ప్రభుత్వం నడుం బిగించింది. బాల్యవివాహలపై కఠిన చట్టాలు అమలు చేసేందుకు సిద్ధమైంది.

బాల్య వివాహాలు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తీవ్ర సామాజిక రుగ్మతగా మారింది. దీన్ని అరికట్టేందుకు ఆ రాష్ట్ర సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని మాసాల వ్యవధిలో బాల్య వివాహాలు నిర్వహిస్తున్న వారిని వందల సంఖ్యలో అరెస్టు చేసింది. దీనికి కొనసాగింపుగా బాల్యవివాహలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎవరైవ బాల్యవివాహాలు జరిపిస్తే వారికి దాదాపు పది సంవత్సరాల జైలు శిక్ష అమలు చేసేలా చట్టాన్ని తీసుకురావాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు. బుధవారం రోజున అస్సాం అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ మోషన్ ఆఫ్ థాంక్స్ చెప్పే సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బాల్య వివాహలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ముస్లీం మతాన్ని లక్ష్యంగా చేసుకుని కఠినంగా వ్యవహిస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలన్నింటినీ హిమంత బిశ్వ శర్మ ఖండించారు. రాష్ట్రంలో శిశువులు, తల్లుల మరణాలు తగ్గించేందుకు ప్రచారాలు అవసరమని పేర్కొన్నారు. బాల్యవివాహాలు కచ్చితంగా ఆపాలని.. తమ కూతుర్ల కోసం మేము చేయగలిగింది చేస్తామని వెల్లడించారు.
బాల్యవివాహలకు సంబంధించి నమోదైన కేసులకు పోక్సో చట్టం వర్తించే అంశంపై గత నెలలోనే గౌహతి హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అధికార వినియోగం ప్రజల వ్యక్తిగత జీవితాలను విధ్యంసం చేస్తోందని తెలిపింది. అత్యాచారం, లైంగిక దాడుల ఫిర్యాదులు లేకుండానే పోక్సో కేసులు పెట్టారని తెలిపింది. మరోవైపు తాము ప్రత్యేకంగా ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, మేము చర్యలు తీసుకున్న కేసులలో 55:45 నిష్పత్తిలో ముస్లీంలు, హిందువులు ఉన్నట్లు పేర్కొన్నారు. బాల్యవివాహాలపై వ్యతిరేకంగా తాము చేపట్టిన డ్రైవ్ పై హైకోర్టు ఎటువంటి నెగిటీవ్ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన 1000 మందికి బెయిల్ కూడా రాలేదని పేర్కొన్నారు. బాల్యవివాహాలు రూపుమాపడానికి తాము చేయగలిగింది చేస్తామన్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 4650 బాల్యవివాహాలు జరిగాయని… ఇప్పటివరకు 3483 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ బాల్యవివాహాలు చేసే ఆచారం అంతమయ్యేవరకు తాము చేపట్టిన ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




