IIT Dropped Outs: ‘ఐదేళ్లలో 13 వేల మంది IIT విద్యార్ధులు మధ్యలోనే చదువు మానేశారు’.. కేంద్ర మంత్రి వెల్లడి
దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుతోన్న దాదాపు 8 వేల మంది ఐఐటీ విద్యార్ధులు గత ఐదేళ్లలో డ్రాప్‌ఔట్లుగా ఉన్నట్లు కేంద్ర మంత్రి సుభాస్ సర్కార్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. ఐఐటీల్లో సీటు సంపాదించేందుకు ఏటా లక్షల్లో విద్యార్థులు..

న్యూఢిల్లీ, జులై 28: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుతోన్న దాదాపు 8 వేల మంది ఐఐటీ విద్యార్ధులు గత ఐదేళ్లలో డ్రాప్‌ఔట్లుగా ఉన్నట్లు కేంద్ర మంత్రి సుభాస్ సర్కార్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. ఐఐటీల్లో సీటు సంపాదించేందుకు ఏటా లక్షల్లో విద్యార్థులు కఠోరంగా చదివి పోటీపడుతుంటారు. కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటుకొని ఎన్నో ఆశలతో సీటు పొందుతారు. ఐతే వీటిల్లో ప్రవేశం పొందిన కొందరు విద్యార్ధులు మాత్రం మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఇలా 2019 నుంచి 2023 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 8 వేల మందికిపైగా ఐఐటీ విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేసినట్లు కేంద్రమంత్రి సుభాస్ సర్కార్ రాజ్యసభలో వెల్లడించారు.
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సుల్లో అత్యధిక సంఖ్యలో డ్రాపవుట్‌లు ఉన్నారని ఆయన చెప్పారు. అలాగే 2018 నుంచి 39 మంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో ఎయిమ్స్ క్యాంపస్‌లలో ఏడు మంది విద్యార్ధులు ప్రాణాలు తీసుకున్నారు. 2018 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో 98 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.
సెంట్రల్ యూనివర్సిటీ అత్యధిక సంఖ్య (17,454)ల్లో డ్రాపౌట్స్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. తర్వాత ఐఐటీలు, ఆ తర్వాత ఎన్‌ఐఐటీల్లో డ్రాపౌట్‌లు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఐఐటీల్లో 8,139 మంది, ఎన్‌ఐటీల్లో 5,623 మంది, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో 1,046 మంది, ఐఐఎంల్లో 858 మంది, ట్రిపుల్ ఐటీల్లో 803 మంది చదువును మధ్యలో ఆపేశారని తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం.. పేలవమైన చదువులు, ఒత్తిడి, వ్యక్తిగత, వైద్యపరమైన కారణాల వల్ల వారంతా చదువు మధ్యలోనే మానేస్తున్నట్లు మంత్రి తెలిపారు.




మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.