AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. ఏనుగుల గుంపును ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. స్పాట్‌లోనే..

అస్సాంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నప్పటికీ, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏనుగులను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. ఏనుగుల గుంపును ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. స్పాట్‌లోనే..
Rajdhani Express Hits Elephants Herd
Krishna S
|

Updated on: Dec 20, 2025 | 11:19 AM

Share

అస్సాం రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్, జమునముఖ్ సమీపంలోని సనారోజా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అడవి నుంచి ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన ఏనుగుల మందను గమనించిన లోకో పైలట్, రైలును ఆపేందుకు అత్యవసర బ్రేకులు వేశారు. అయితే రైలు అప్పటికే వేగంగా ఉండటంతో ఏనుగులను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఇంజిన్‌తో సహా ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఏనుగుల శరీర భాగాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతం అత్యంత భయానకంగా మారింది.

ప్రయాణికులు సురక్షితం.. కానీ భయాందోళన

ప్రమాదం జరిగిన సమయంలో రైలులో భారీ కుదుపు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిద్రలో ఉన్న చాలా మంది తమ సీట్ల నుంచి కింద పడిపోయారు. అదృష్టవశాత్తూ, ప్రయాణికులెవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైల్వే అధికారులు ధృవీకరించారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను అదే రైలులోని ఇతర ఖాళీ బెర్తులకు తరలించి, సురక్షితంగా గౌహతికి పంపించారు. అక్కడ అదనపు బోగీలను జోడించి ప్రయాణాన్ని కొనసాగించారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని లూమ్డింగ్ మీదుగా దారి మళ్లించారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ క్రేన్ల సహాయంతో పట్టాలు తప్పిన కోచ్‌లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా అస్సాంలోని ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అడవుల మధ్య గుండా వెళ్లే ట్రాక్‌ల వద్ద ఏనుగులను గుర్తించేందుకు ‘AI ఆధారిత సెన్సార్లు’ (Gajraj System) ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతోంది, అయితే ఈ ప్రాంతంలో ఆ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. మూగజీవాల ప్రాణాలు కాపాడేందుకు రైల్వే శాఖ మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..