Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టర్కీ రియాక్షన్.. ఏమన్నాదంటే?
అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానానికి సమయానికి మెయింటెనెన్స్ ప్రక్రియ గతేడాదిలో జరిగినట్లు తాజాగా తేలింది. జూన్ 2023లో సమగ్ర నిర్వహణ తనిఖీ చేపట్టినట్టు రికార్డులు చూపాయి. తదుపరి సమగ్ర తనిఖీ ఈ ఏడాది డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. 12 ఏళ్ల నాటి ఈ విమానం కుడి ఇంజిన్‌కు 2025 మార్చిలో మరమ్మతులు..

అహ్మదాబాద్, జూన్ 15: ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 ప్రమాదంపై తాజాగా టర్కీ స్పందించింది. క్రాష్ అయిన డ్రీమ్‌లైనర్‌కు మేము ఎలాంటి మెయింటెనెన్స్ చెయ్యలేదని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా, టర్కీ టెక్నిక్ మధ్య 2024-25 లో ఒప్పందం జరిగిందని తెలిపింది. అందులో బీ777 విమానానికి మాత్రమే మెయింటనెన్స్ చేసేలా ఒప్పందం కుదిరింది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ప్రస్తావన లేదు. అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ టర్కీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తాజాగా కీలక విషయాలను వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానానికి సమయానికి మెయింటెనెన్స్ ప్రక్రియ గతేడాదిలో జరిగినట్లు తాజాగా తేలింది. జూన్ 2023లో సమగ్ర నిర్వహణ తనిఖీ చేపట్టినట్టు రికార్డులు చూపాయి. తదుపరి సమగ్ర తనిఖీ ఈ ఏడాది డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. 12 ఏళ్ల నాటి ఈ విమానం కుడి ఇంజిన్‌కు 2025 మార్చిలో మరమ్మతులు కూడా జరిగాయి. ఇంజిన్ తయారీదారు ప్రోటోకాల్ ప్రకారం ఎడమ ఇంజిన్‌ను ఏప్రిల్ 2025లో తనిఖీ చేయగా ఎలాంటి లోపం లేదని గుర్తించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8/9 విమానాల భద్రతా తనిఖీలపై DGCA ఆదేశాలతో ఈ విషయం వెల్లడైంది. ఇక ఎయిరిండియాలో ఇంకా 26 బోయింగ్ 787-8లు, 7 బోయింగ్ 787-9 రకానికి చెందిన విమానాలు కూడా ఉన్నాయి.
విమాన ప్రమాద బాధితులకు అండగా ఇన్స్యూరెన్స్ కంపెనీలు
విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఇన్స్యూరెన్స్ కంపెనీలు నిలిచాయి. విమాన ప్రమాద మృతుల ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను బీమా సంస్థలు సులభతరం చేశాయి. ఎయిర్ ఇండియా విమానం AI 171 ప్రమాదంలో బాధితులకు క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానాలను సడలిస్తున్నట్లు SBI లైఫ్, HDFC లైఫ్z ICICI లాంబార్డ్ సహా ప్రధాన భారతీయ బీమా కంపెనీలు ప్రకటించాయి. బాధితులకు వేగవంతమైన ఆర్థిక సహాయం అందించడం, బాధిత కుటుంబాలపై భావోద్వేగ భారాన్ని తగ్గించడం లక్ష్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. క్లెయిమ్ ఫారం, పాలసీ డాక్యుమెంట్ , నామినీ KYC , బ్యాంక్ ఖాతా వివరాలు వంటి కనీస పత్రాలతో క్లెయిమ్‌లను ప్రారంభించవచ్చని SBI లైఫ్ ఈ సందర్భంగా పేర్కొంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పొందడానికి స్థానిక అధికారుల నుంచి (ప్రభుత్వం, పోలీసులు లేదా ఆసుపత్రులు) మరణ రుజువును అంగీకరించే ప్రక్రియను HDFC లైఫ్ సరళీకృతం చేసింది. విమాన ప్రమాదం లో చనిపోయినవారి కుటుంబాలకు సకాలంలో క్లెయిమ్ అందించడానికి పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ICICI లాంబార్డ్ సైతం ప్రకటించింది. కాగా గురువారం (జూన్ 12) జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రయాయణంలో మృతుల సంఖ్య విమాన 274కి చేరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








