AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ గ్రాండ్ ఎంట్రీ.. సింగ్రౌలీ మున్సిపల్ పీఠం కైవసం..

ఢిల్లీ, పంజాబ్ లలో విజయకేతనం ఎగురవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్యప్రదేశ్ లోనూ సత్తా చాటింది. బీజేపీకి తామే అసలైన ప్రత్యామ్నాయమని చెబుతున్న ఆప్.. ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) మున్సిపల్‌...

AAP: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ గ్రాండ్ ఎంట్రీ.. సింగ్రౌలీ మున్సిపల్ పీఠం కైవసం..
Aap In Madhyra Pradesh
Ganesh Mudavath
|

Updated on: Jul 18, 2022 | 6:33 AM

Share

ఢిల్లీ, పంజాబ్ లలో విజయకేతనం ఎగురవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్యప్రదేశ్ లోనూ సత్తా చాటింది. బీజేపీకి తామే అసలైన ప్రత్యామ్నాయమని చెబుతున్న ఆప్.. ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్ సంచలనం సృష్టించింది. సింగ్రౌలీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి 9 వేల ఓట్ల మెజారిటీతో మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. రాణి అగర్వాల్‌ అనే మహిళ తాజాగా సింగ్రౌలీ (Singrauli) మేయర్‌గా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. అయితే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో రాణికి మద్దతుగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొని, రోడ్‌ షో నిర్వహించారు. కాగా మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తర్వాత పెద్ద మున్సిపల్‌ కేంద్రం సింగ్రౌలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాంతంలో విద్యుదుత్పత్తి కేంద్రాలతోపాటు బొగ్గు, ఖనిజ గనులు అధికంగా ఉన్నాయి.

సింగ్రౌలీ మేయర్‌గా ఎన్నికైన రాణి అగర్వాల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్‌ నేతలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ నిజాయతీ రాజకీయాలను ప్రజలందరూ విశ్వసిస్తున్నారని కేజ్రీవాల్ ఆకాంక్షించారు. మరోవైపు.. 2023 లో పశ్చిమ బెంగాల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఆప్ ఇంచార్జీ సంజయ్ బసు ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్రంలో క్యాంపెయిన్ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీజేపీ బలమైన శక్తిగా ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా, తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలూ బీజేపీని ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌కు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే, ఈ స్థానిక పార్టీల భావజాలాల ఘర్షణ, రాష్ట్రం వెలుపల లేని ఆదరణతో ఈ కూటమి రూపుదాల్చడం నెమ్మదించింది. కానీ, ఈ సవాల్‌ను ఆప్ అధిగమించింది. తొలిసారిగా మరో రాష్ట్రంలో విజయ ఢంకాను మోగించింది. దీంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..