AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. ఎవరు.. ఎక్కడ ఓటు వేస్తారంటే..

Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం పార్లమెంట్‌లోనూ సన్నాహాలు పూర్తయ్యాయి.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. ఎవరు.. ఎక్కడ ఓటు వేస్తారంటే..
Presidential Elections 2022
Sanjay Kasula
|

Updated on: Jul 18, 2022 | 7:56 AM

Share

రాష్ట్రపతి ఎన్నికలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం పార్లమెంట్‌లోనూ సన్నాహాలు పూర్తయ్యాయి. పార్లమెంట్ హౌస్‌లోని రూం నంబర్ 63లో 6 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి దివ్యాంగ్ ఓటరు. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌లో ఓటు వేయనున్నారు. యూపీ నుంచి 4, త్రిపుర నుంచి 2, అస్సాం నుంచి 1, ఒడిశా నుంచి 1, హర్యానా నుంచి 1 ఉండగా, 42 మంది ఎంపీలు అసెంబ్లీలో ఓటు వేయనున్నారు.  జూలై 21న ఫలితాలు వెలువడిన తర్వాత, కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం జూలై 25, 2022న నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ భవనంలో, ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపగా.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ద్రౌపది ముర్మును సపోర్ట్ చేస్తున్నాయి.

భారత రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నామినేట్ చేయబడిన షెడ్యూల్డ్ తెగలకు చెందిన రెండవ వ్యక్తి ముర్ము. అతను గతంలో 2015 నుండి 2021 వరకు జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్‌గా పనిచేశాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలిస్తే రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళ ఆమె అవుతుంది.

విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా 

ఇవి కూడా చదవండి

విపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా నిలిపారు. 1990 నుండి 1991 వరకు మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వంలో.. 1998 నుండి 2002 వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. యశ్వంత్ సిన్హా విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో పార్టీని వీడే ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. ఆ తర్వాత ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నిక కావడానికి ఒకరోజు ముందు ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు.

ఎవరు అర్హులు..

రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడు అయి ఉండి, 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ప్రధానిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే.. రాష్ట్రపతిని పరోక్షంగా ఎంపిక చేస్తారు. ప్రజాప్రతినిధులు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు.

ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ..

మన దేశంలో లోక్‌సభ ఎంపీలు 543, రాజ్యసభ సభ్యులు 233 కలుపుకొని.. మొత్తం 776 ఎంపీలు ఉన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 4,033 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 4,809 మంది. ఎంపీ ఓటు విలువ 700గా.. సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ అక్షరాలా.. 10,86,431.

ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 లెక్కల ప్రకారం జనాభా, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకుని ఈ విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యతో డివైడ్‌ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో మల్టిప్లై చేసి ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు. ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతుంది. యూపీకి 208గా ఉండగా.. ఝార్ఖండ్, తమిళనాడులో 176, మహారాష్ట్రలో 175, ఏపీ- 159 కాగా.. తెలంగాణ 132గా ఉంది. ఇక ఎంపీలకు సంబంధించి.. దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్య తో డివైడ్‌ చేస్తారు. ఈ మేరకు ఈ సారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు.

ఎవరు.. ఎక్కడ ఓటు వేస్తారు..

ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు వారి రాష్ట్రంలోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మరెక్కడైనా ఓటు వేయాల్సి వస్తే .. కనీసం పది రోజులు ముందుగా కమిషన్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్‌ పాటించాలి. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్‌ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. ఓటింగ్‌ తర్వాత వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో ఓట్లు లెక్కిస్తారు. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్‌ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. ఓటింగ్ మార్క్‌ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్‌ ఇస్తుంది. దాంతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.

ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్..

పోల్‌ అయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకటితో.. మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఈరోజు ఎన్నికలు జరగనుండగా.. జులై 21 కౌంటింగ్ నిర్వహిస్తారు. అందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లోనూ బీజేపీ, వాటి మిత్రపక్షాలకు సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచేందుకే అవకాశమున్నట్టు అంచనా.