Andhra Pradesh: విజయవాడలో మంకీపాక్స్ కలకలం..?.. చిన్నారి నమూనాలు పుణె ల్యాబ్ కు తరలింపు
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ (Monkeypox) వైరస్ ఏపీలోని విజయవాడలో (Vijayawada) కలకలం రేపింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన...
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ (Monkeypox) వైరస్ ఏపీలోని విజయవాడలో (Vijayawada) కలకలం రేపింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు చిన్నారిని విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారి నమూనాలను సేకరించి, పుణె ల్యాబ్‌కు పంపించారు. మంకీపాక్స్ అనేది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరల్ వ్యాధి. ఇది జంతువుల నుంచి మానవులకు సోకుతుంది. ఎలుకలు, చుంచులు, ఉడతలు వంటి జీవుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా.. కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. స్మాల్ పాక్స్ లాగే మంకీపాక్స్ కు గురైన వ్యక్తి.. జ్వరం, తలనొప్పి, వాపు, నడుమునొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలతో ఉంటారు. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది కోలుకుంటారు. కొందరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల కేసులకు పైగా నమోదయ్యాయి. వైరస్ కారణంగా నలుగురు మృతి చెందారుర. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో మంకీపాక్స్ వ్యాప్తి అధికం కాకముందే భారీసంఖ్యలో పరీక్షలు నిర్వహించి, వ్యాప్తిని నివారించాలని కోరారు. కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుల మాదిరిగానే మంకీపాక్స్ టెస్టులు చేయనున్నారు.
కాగా వేగంగా విస్తరిస్తోన్న మంకీపాక్స్.. ఇప్పటికే 59 దేశాలకు పాకింది. ఈ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..