Video: కారులో 53 డిగ్రీల ఎండ.. లోపల విలవిలలాడిన అక్కాచెల్లెళ్లు.. డోర్ తీసి చూసేసరికి వామ్మో..
వేసవి ఎండలు ఎంత దారుణంగా ప్రాణాలు తీస్తాయో చెప్పడానికి రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘోర ఘటనే నిదర్శనం. ఆడుకుంటూ వెళ్లి ఓ పాత కారు ఎక్కిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. కారు డోర్లు లాక్ అయిపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. బయట ఎండ వేడికి కారు లోపల ఉష్ణోగ్రత ఏకంగా 53 డిగ్రీలకి చేరింది. గాలి ఆడక, నిప్పుల కొలిమిలా మారిన ఆ కారులో ఆ చిన్నారులు ఎంత విలవిలలాడారో ఊహించుకుంటేనే కన్నీళ్లు ఆగవు

తీవ్రమైన ఎండలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ.. రాజస్థాన్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. తాళం వేసి, ఎండలో పార్క్ చేసిన ఒక పాత కారులో చిక్కుకుపోయి.. ఊపిరాడక, ఎండ వేడిని తట్టుకోలేక ఇద్దరు చిన్నారి అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ నగరంలో జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.అల్వార్‌లోని వైశాలి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాన్‌పురి ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు టీనా (8), లక్ష్మి (5)లతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంటి సమీపంలో ఆడుకుంటూ.. అక్కడ పక్కనే నిలిపి ఉంచిన ఒక పాత కారు లోపలికి ఎక్కారు. ఆ కారు ఇంజన్, బ్యాటరీ పాడైపోవడంతో గత 10 రోజులుగా వినోద్ అనే మెకానిక్ గ్యారేజ్ సమీపంలోనే పార్క్ చేసి ఉంది. పిల్లలు లోపలికి వెళ్లిన తర్వాత కారు డోర్లు లాక్ అయిపోయాయి. అప్పటికే బయట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటి నిప్పుల కొలిమిలా ఉంది. ఇక కిటికీలన్నీ మూసి ఉన్న ఆ పాత కారు లోపల గాలి ఆడక, కేవలం అరగంటలోనే ఉష్ణోగ్రత ఏకంగా 53 డిగ్రీల చేరుకుంది. ఆ భయంకరమైన వేడిని తట్టుకోలేక ఆ చిన్నారులు కారు లోపలే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
తాకితే నిప్పులా కాలిపోతున్నాయి..
సమీపంలోని గ్యారేజీలో పనిచేసే పప్పు అనే వ్యక్తి కారు లోపల పిల్లలు కదలకుండా పడి ఉండటాన్ని మొదటిసారి గమనించాడు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి కారు తలుపులు తెరిచారు. స్థానిక నివాసి సుభాష్ చంద్ సైని మాట్లాడుతూ.. ‘‘కారు తలుపు తెరవగానే లోపల నుండి ఒక్కసారిగా భయంకరమైన వేడి గాలి వచ్చింది. ఆ నరకంలో ఆ పిల్లలు ఎంత విలవిలలాడారో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది’’ అని కన్నీరు పెట్టుకున్నాడు. పిల్లలను బయటకు తీసిన పప్పు అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘వేడి తీవ్రతకు వారి కాళ్లు, చేతులు వంకరపోయాయి. నేను వాటిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించినా కాలేదు. వారి శరీరాలు నిప్పులా కాలిపోతున్నాయి. చల్లటి నీళ్లు పోసినా వేడి తగ్గలేదు. చర్మం దారుణంగా కాలిపోయింది’’ అంటూ ఆ ఘోర కలిని వివరించాడు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
తల్లి లేని పిల్లలు.. తండ్రి కష్టార్జితం..
ఈ ఇద్దరు పిల్లల కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. సుమారు ఐదేళ్ల క్రితం, చిన్నపాప లక్ష్మికి కేవలం ఒకటిన్నర నెలల వయసు ఉన్నప్పుడే వారి తల్లి చనిపోయింది. అప్పటి నుండి తండ్రి రమేష్ ఓ చిన్న సెలూన్ షాపు నడుపుకుంటూ.. ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఇద్దరు కూతుళ్లను ప్రాణంగా పెంచుకుంటున్నాడు. రోజూ ఉదయం 9 గంటలకే రమేష్ పనికి వెళ్తుండటంతో.. ఇంట్లో పిల్లలను చూసేవారు ఎవరూ లేక ఇరుగుపొరుగు వారి సాయంతో ఆ చిన్నారులు వీధుల్లో ఆడుకుంటూ ఉండేవారు. చివరకు విధి ఆడిన వింత నాటకంలో ఆ తండ్రికి కడుపుకోత మిగిలింది.
డాక్టర్ల హెచ్చరిక
ఈ ప్రమాదంపై మెడికల్ లీగల్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ కేకే మీనా మాట్లాడుతూ.. వేసవి కాలంలో కిటికీలు మూసి ఎండలో పార్క్ చేసిన కార్ల లోపల ఉష్ణోగ్రత కేవలం 30 నిమిషాల్లోనే 10 నుండి 15 డిగ్రీలు పెరుగుతుందని తెలిపారు. ఆక్సిజన్ అందకపోవడం, 53 డిగ్రీల అత్యధిక వేడి కారణంగానే పిల్లలు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు, వాహన దారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వాహనాలకు లాక్ వేయండి: మీ నివాస ప్రాంతాల్లో ఉపయోగించని పాత వాహనాలు లేదా కార్లు ఉంటే వాటిని ఎల్లప్పుడూ లాక్ చేసి ఉంచండి. పిల్లలు ఆడుకుంటూ లోపలికి వెళ్లకుండా చూసుకోండి.
పిల్లలపై నిఘా: వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు, ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
కారులో వదిలి వెళ్లొద్దు: షాపింగ్‌కు వెళ్లినప్పుడు చాలా మంది పిల్లలను కార్లలోనే ఉంచి లాక్ చేసి వెళ్తుంటారు. కేవలం 10 నిమిషాలు అలా వదిలేసినా అది పిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అమాయక చిన్నారుల మరణం అల్వార్ పట్టణంలో విషాద ఛాయలు నింపింది.
A heartbreaking incident took place in #Alwar, #Rajasthan. Sisters Tina (8) and Lakshmi (5) got stuck in a car while playing. Suddenly, the car door locked and they lost their lives due to suffocation. The father, who had raised his children with great care, who lost their mother… pic.twitter.com/QXVgt4eIvg
— Siraj Noorani (@sirajnoorani) May 20, 2026
