Driving Tips: పొగమంచులో వాహనం డ్రైవ్ చేస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్
శీతాకాలం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పొగమంచు వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పొగమంచు వల్ల డ్రైవింగ్ చేయడం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

అసలే చలికాలం.. రాత్రి, ఉదయం వేళల్లో చలిపులి పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోడుతున్నాయి. దీంతో ప్రజలు రాత్రిపూట, ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ఆసక్తి చూపడం లేదు. మార్చి వరకు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక చలి, పొగమంచు వల్ల బయటకు వెళ్లాలన్నా లేదా డ్రైవింగ్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. పొంగమంచు రోడ్లను కప్పేసి ఉంటుంది. దీంతో రోడ్లు కనిపించక, ఎదుటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో చలికాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇందులో చూద్దాం.
స్లో డ్రైవింగ్
పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా స్లోగా వెళ్లండి. సడెన్ బ్రేకులు వేయకండి. ముందున్న వ్యక్తులు, వాహనాలను గమనిస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఇక పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు లో బీమ్ హెడ్‌లైన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫాగ్ లైట్స్ తప్పకుండా వాడండి. దీని వల్ల మీరు సేఫ్‌గా డ్రైవింగ్ చేయగలుగుతారు. ఇక పొగమంచులో వాహనం నడిపేటప్పుడు ముందున్న వాహనానికి కాస్త దూరంలో ఉండండి. అలాగే పొగమంచులో ప్రయాణించే సమయంలో హారన్ ఎక్కువగా ఉపయోగించండి. దీని వల్ల ముందు లేదా వెనుక ఉన్న వాహనదారులు అలర్ట్ అవుతారు.
ముందే చెక్ చేసుకోండి
పొగమంచులో మీరు ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు ముందుగా మీ బైక్ కండీషన్ చెక్ చేసుకోండి. ఒక్కొసారి చలికాలంలో బైక్‌లు త్వరగా స్టార్ట్ అవ్వకు. లోపలికి మంచు వెళ్లడం ద్వారా మధ్యలో ఆగిపోవచ్చు. అందుకే ముందే బండి కండీషన్, లైట్లు , బ్రేకులు అన్నీ చెక్ చేసుకోండి. ఇక రోడ్లపై లైన్ డిసిప్లిన్ పాటించండి. లైన్ దాటాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్లండి. మధ్య లైన్ ఎడ్జ్ మార్కింగ్‌ను గమనిస్తూ డ్రైవ్ చేయండి. ఇక పొగమంచులో వాహనం నడిపేటప్పుడు హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవడం మంచిది. దీని వల్ల వెనుక వచ్చే వాహనదారులకు మీ వాహనం ఉందని తెలుస్తుంది. అత్యవసరమైతే తప్పు పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనం నడపకపోవడమే మంచిది.




